ఆకలి నిశ్శబ్దంగా
ఊరి దారిని వెతుకుతుందని
మనకు ఇంకా తెలియలేదా?
అడవి అంచున పడిన
ఒక్క గొడ్డలి గాయం
కొన్ని రోజుల్లోనే
రైతు పొలంలో
వేదనగా మొలుస్తుందని
మనసుకు తట్టలేదా?
ఆవాసం కోల్పోయిన మృగం…
ఆశ కోల్పోయిన రైతు…
ఇద్దరి కళ్లలోనూ
ఒకే మౌన ప్రశ్న—
“తప్పెవరిది?”
అడవి లేని జీవి
ఆకలి కోసం పొలాన్ని తాకింది.
అది నేరం కాదు… అవసరం.
రాత్రింబవళ్లు కాపాడిన పంట
ఒక్క క్షణంలో అడవికి చేరితే
రైతు గుండె కూడా
నిశ్శబ్దంగా రోదిస్తుంది—
అది కూడా తప్పు కాదు.
మరి నిజంగా…
తప్పెవరిది?
చెట్లను లెక్కలుగా చూసిన చూపుదా?
అడవిని భూమిగా మాత్రమే కొలిచిన మనసుదా?
లేదా అభివృద్ధి పేరుతో
ప్రాణాల చిరునామాలు చెరిపేసిన
మన నిర్ణయాలదా?
అందుకే ఇప్పుడు
ఒకే సత్యం మిగులుతుంది—
అడవికి రక్షణ కావాలి.
రైతుకు భరోసా కావాలి.
ప్రాణికి తన గూడు కావాలి.
మనిషికి తన మానవత్వం కావాలి.
అడవి బతికితే జీవం నిలుస్తుంది.
జీవం నిలిస్తే సమతుల్యం పుడుతుంది.
సమతుల్యం పుడితే
భూమి మళ్లీ పండుతుంది.
రైతు కన్నీరు
మారే రోజు రావాలి.
అప్పుడే అభివృద్ధి
అర్థం పొందుతుంది.
లేకపోతే—
నరికిన ప్రతి చెట్టు వెనుక
ఒక రోజు మనిషి ఆకలే ప్రతిధ్వనిస్తుంది.
====================================
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
చరవాణి 9347042218
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి