సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 ఇంటికి పిడికెడు బియ్యం -ఇల్లాలికి పది పూటలు
**
"అవ్వా ! కొంత మందిరికి కట్టాలన్ని కుప్పబోశి ఇత్తడా ఏంది.గాళ్ళు ఒకప్పుడు బత్కిన దాన్కి ఇప్పటి దానికి సూత్తే గాళ్ళు గీళ్ళేనా అనిపిత్తది."
"ఎవలి యిష్యం శెల్లే! గాళ్ళు ఎవలు శెల్లే? ఆడామెనా? మొగాయినా? అయినా ఎవలైతే ఏం తీ.గీ దినాల్లో బత్కాలంటే కూసింతన్న తెల్వి వుండాలె. ఎవలి తాన ఎట్లుండాల్నో తెల్శుండాలె. గట్ల లేక పోతే బత్కుడు కట్టంగనే వుంది. మల్ల గాళ్ళు ఎట్ల బత్కుతున్నరు?.''
అవునవ్వా! గట్లనే వుంది గీ దినాలల్ల బత్కుడు.శతకోటి దరిద్దాన్కి ఎన్నెన్నో ఉపాయాలంట. శిరిగిన బట్ట తొడ్గినా,ఉంటాన్కి ఇల్లో గుడిశో ఎందుల్ల‌ తల దాస్కున్నా కడ్పుకింత ముద్ద సయిమానికి పడెయ్యక పోతే సావు దెగ్గరై పాడెక్కుడే.గందుకే గాళ్ళు బత్కడాన్కి‌ ఏవేవో శేస్కుంట కాలమెల్లదీత్తున్నరు.
 "అవును శెల్లె గింతకీ ఎవలో శెప్కనేపోతివి?"
 "గదేనవ్వా! మన శార్దత్త ఉంది సూడు గిదివరకి ఊల్లెనే యిల్లుండే గద. పదేళ్ళ కింద ఊరి శివర ఇల్లు గట్కొని పోయిండ్రు.గప్పట్ల  ఎగసాయం బాగుండె గని గాళ్ళ కొడ్కుల సద్వులకని తేపింత తేపింత అమ్మిర్రు. గా యిల్లు దప్ప ఏం మిలగలే. కొడ్కులు ఉజ్జోగాలని ఏడేడ్కో ఎల్లిర్రు గని అమ్మ నాయిన ఉన్నదంత ఊడ్శిపెట్టి సద్విచ్చింది మర్శిర్రు. ఇంటికొత్తె ఏడ బాద్దెత మీదేస్కోవల్శి వొత్తదో నని,ఇంటి మొగం సూసుడే బందు వెట్టిర్రు. గీల్లకి యిప్పుడు ఎల్లుబాటులేక శానా అవత్తలు బడుతుర్రు. పొయినేడు దన్క ఇంట్లె కూరగాయలు పండిచ్చి తట్టలోల్లకి అగ్వకి అమ్మి ఇల్లు ఎల్లదీశింది."
 "ఎట్నించి పైస ఆమ్దాని లేదు.గిన్ని ఉడ్కేస్కోడానికి పిడికెడు బియ్యం సుత లేని తితి ఆళ్ళది. బాగా బత్కిన మోత్బరి రైతులు.గస్మంటిది సూడవ్వా ఎంత యిస్మసంది వొచ్చిందో. నాకైతే గా అత్తని సూడంగనే గుండెల్నించి దుఃఖం ఎగదన్నుకొచ్చింది. గాళ్ళ తిండిబాద ఎట్ల తీర్సాల్నో తెల్వట్లే అవ్వా!''
"గా యిష్యం నాకు శెప్పినవ్ గద.ఇంగ నేను సూస్కుంట.ఒక్కపాలే  సోలెడో,తవ్వెడో బియ్యం ఉత్తగ పెట్టాలంటే ఎవలికైనా కట్టమే అనిపిత్తది శెల్లే! గంద్కనే ఇంటికో పిడికిలి బియ్యం నువ్వు నేను కల్శిపొయ్యి అడుక్కొద్దాం.మనాడకట్టున ముప్పై నల్పై యిండ్లు ఉన్నయి గద.గీ త్యేప గటేపు బోదాం.గయ్యి ఎంత గాదన్న పదిపూటలైన వొత్తయి గద శెల్లే!"
 " మంచి యిశారమే సేశినవ్ గని అవ్వా గా శార్దత్త తీస్కుంటదా.అస్లే పర్వు,యిజ్జత్కి పాకులాడే మన్షి.ఎందుకంటే ఏం జెప్తం అవ్వా!"
"నిజమే శెల్లే! ఊల్లె ఆడోళ్ళందరం గిట్ల  కల్శుండాలని అనుకున్నం.ఉండుడు లేకపోవుడు అనే ముచ్చెటే గాదని నచ్చ జెప్దాం.ముందగాల మనిండ్ల నుంచే మొదలువెడ్దాం శెల్లే! పిడికెడు బియ్యం వెడ్తే ఎవ్వలికి నట్టం రాదు.కట్టమనిపిచ్చదు. " ఇంటికి పిడికెడు బియ్యం-ఇల్లాలికి పది పూటలు."
"భలే వుందవ్వా గీ ముచ్చెటి. గట్లనే శేద్దాం."
గదండీ సంగతి "ఇంటికో పిడికెడు బియ్యం -ఇల్లాలికి పది పూటలు" అంటే గిదే మరి. పల్లెల్ల శానా మంది ఒకలి కోస్రం ఒకలు గిట్ల యిశారిత్తరు,కట్టంల ఆదుకుంటరు. గందుకే గిస్మంటి సామెత పుట్టింది."
కామెంట్‌లు