సిరోయ్ లిల్లీ!: - - యామిజాల జగదీశ్


 ఇది సిరోయ్ లిల్లీ కథ. 
దీనినే షిరుయ్ లిల్లీ అని కూడా అంటారు. ఇది ప్రపంచంలోని అత్యంత అరుదైన మొక్కలలో ఒకటి. మన దేశంలో మణిపూర్‌లో కేవలం షిరుయ్ కొండ శిఖరంపై మాత్రమే కనిపిస్తుంది. 
బ్రిటిష్ పాలనలో, బ్రిటిష్ వారు దీనిని మరొక ప్రదేశానికి తరలించడానికి ప్రయత్నించారని, కానీ సుదీర్ఘ పోరాటం తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారన్నది ఓ కథనం. అప్పటి నుండి, ఈ మొక్క షిరుయ్ శిఖరంపైన మాత్రమే పెరగగలదని భావిస్తున్నారు.
ఈ మొక్కను ఒక ఆంగ్లేయుడు కనుగొని, తన భార్య పేరు మీద దీనికి నామకరణం చేశాడు. ఈ మొక్క భారతదేశంలోని మణిపూర్ రాష్ట్ర పుష్పం హోదాను కూడా పొందింది. ఇదే కారణంతో, మణిపూర్‌లో దీని పేరు మీద అనేక దుకాణాలు, రెస్టారెంట్లు మీకు కనిపిస్తాయి.
నాగా తెగకు చెందిన వారు ఈ పువ్వు గురించి చెప్పే కథనం.... అనగనగా ఒకప్పుడు, చాలా అందమైన ఆకర్షణీయమైన యువరాణి (లిల్లీ) తన ప్రేమికుడు (షిరుయ్)తో కలిసి ఈ ప్రదేశంలో నివసించేది. ఒకరోజు షిరుయ్ ఏదో పని మీద కొండ దిగువకు వెళ్ళాడు, కానీ అతను తిరిగి ఇంటికి రాలేదు. లిల్లీ తన జీవితాంతం అతని కోసం ఎదురుచూస్తూనే ఉండి, చివరికి ఈ ప్రదేశంలోనే మరణించింది. యువరాణిని ఇక్కడే ఖననం చేయడం వల్లే మట్టిలోంచి లిల్లీ పువ్వు మొలకెత్తుతుందని ఉఖ్రుల్ గ్రామస్తులు నమ్ముతారు.
కొంతమంది ఆ యువరాణి ఇప్పటికీ షిరుయ్ శిఖరంపైనే నివసిస్తుందని కూడా నమ్ముతారు. ఆమె రోడ్డు దాటుతున్న అందమైన యువకులను ఆకర్షించడానికి పాటలు పాడుతుంది. ఆమె పాట విన్న ఏ యువకుడైనా ఆమెను కనుగొంటాడు.  ఆ వ్యక్తి ఎప్పుడూ ఇంటికి తిరిగి వెళ్ళలేదట.
సిరోహ్ కొండ శిఖరానికి చేరుకోవడానికి 3 గంటల సమయం పడుతుంది. మొదటి గంటలో, నడక చాలా నిటారుగా ఉంటుంది. ఆ తర్వాత మధ్యస్తంగా ఉంటుంది. పర్వతం విశాల దృశ్యంతో, ఈ 3 గంటల ప్రయాణంలో ఎక్కడా విసుగనిపించదట. మధ్యలో, ఒక చెట్టు కనిపిస్తుంది, ఆ చెట్టు 400 మీటర్ల పొడవైనది. కారణమేమోగానీ స్థానికులు దీనికి 'కోతి చెట్టు' అని పేరు పెట్టారు. షిరోయ్ శిఖరానికి వెళ్లే దారిలో ప్రతి ఒక్కరూ ఈ చెట్టు దగ్గర ఫోటో తీసుకుంటారు.
పువ్వులు కాకపోయినా కనీసం షిరోయ్ మొక్కలైనా కనిపిస్తాయన్న ఆశతో ఏప్రిల్‌లో వెళ్తే ఆ ప్రదేశంలో ఏమీ కనిపించదు. ఈ ప్రదేశాలలో ఎవరూ షిరోయ్ విత్తనాలు నాటరనే విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. సరైన సమయం (జూన్ - జూలై నెలల్లో) వచ్చినప్పుడు అవి వాటంతట అవే మొలకెత్తుతాయి.
ఈశాన్య భారతదేశపు ఆభరణమని షిరుయి లిల్లీని పేర్కొంటారు.
ఒక మొక్కలో 7 పువ్వులు ఉండే అత్యంత అరుదైన షిరుయ్ లిల్లీ మొక్కను వేరే చోటికి మార్చలేనందు వల్ల ఇది అరుదైనదిగా నమోదైంది. ఈ పువ్వు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఎప్పుడూ పెరగలేదు. పెరగడమూ లేదు. బహుశా షిరుయ్ శిఖరంపై తప్ప మరెక్కడా మళ్ళీ పెరగకపోవచ్చు కూడా అని స్థానికుల అభిప్రాయం. ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ ఈ పువ్వు ఇతర ప్రదేశాలలో ఎందుకు పెరగదో ఎవరికీ తెలియదు.
షిరుయ్ లిల్లీ జన్మస్థలం మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లాలో ఉన్న షిరుయ్ కషుంగ్. షిరుయ్ అనేది ఉఖ్రుల్ జిల్లాకు ఈశాన్యంలో ఉన్న ఒక గ్రామం పేరు. ఉఖ్రుల్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్ నుండి సుమారు 103 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పువ్వు కారణంగానే ఈ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఇది జిల్లా రాజధాని ఉఖ్రుల్‌కు తూర్పున సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తరం నుండి దక్షిణం వరకు సముద్ర మట్టానికి 4900' నుండి 8474' ఎత్తులో విస్తరించి ఉన్న షిరుయ్ కషుంగ్ పర్వత శ్రేణి, మణిపూర్‌లోని అత్యంత అందమైన పర్వత శ్రేణులలో ఒకటి.
1946లో న్యూయార్క్ బొటానికల్ సొసైటీ తరపున వృక్షశాస్త్ర సేకరణ కోసం మణిపూర్ కొండలకు వచ్చిన మిస్టర్ కింగ్‌డన్ వార్డ్, ప్రసిద్ధ షిరుయ్ లిల్లీని సంచలనాత్మకంగా కనుగొన్నారు. ఇది లండన్‌లో జరిగిన 1948 రాయల్ హార్టికల్చరల్ సొసైటీ ఫ్లవర్ షోలో ప్రతిష్టాత్మక మెరిట్ బహుమతిని గెలుచుకుంది. ఆవిష్కర్త కింగ్‌డన్ ఎఫ్ వార్డ్ భార్య జీన్ మాక్లిన్  పుట్టింటి పేరు మీద షిరుయ్ లిల్లీకి 'లిలియం మాక్లినే సీలీ' అని వృక్షశాస్త్ర నామం పెట్టారు. ఈ లిల్లీ కాలానుగుణంగా పుష్పించే మొక్క. ఇది మే - జూన్ నెలల్లో ఉత్తమంగా వికసిస్తుంది. దీని పుష్పించే కాలం మే 15 నుండి జూన్ 5 వరకు గరిష్టంగా ఉంటుంది. ఈ మొక్క ఎత్తు 1 నుండి 3 అడుగులు లేదా 30 నుండి 90 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఒక్కో మొక్కకు 1 నుండి 7 పువ్వులు పూస్తాయి. తొలినాళ్లలో ఒక్కో మొక్కకు 11/12 పువ్వుల వరకు కూడా కనిపించేవి, కానీ ఇప్పుడు అది చాలా అరుదు. పైగా దొరకడం చాలా కష్టం. షిరుయ్ లిల్లీ జాతి లిలియానే కుటుంబానికి చెందినది. ఇది షిరుయ్ శిఖరం యొక్క తేమతో కూడిన ఆల్పైన్ ప్రాంతాలలో విస్తరించి ఉంది. ఈ పువ్వు లేత గులాబీ రంగులో ఉంటుంది. వినయశీలి అయిన యువతిలా వంగి ఉన్న దాని గంట ఆకారపు రేకులే దీని అందం.
ఐదు దశాబ్దాల క్రితం విదేశాల నుండి వచ్చిన ఇతర ప్రజలు దీనిని కనుగొని, ఈ పుష్పానికి ప్రతిష్టాత్మకమైన మెరిట్ బహుమతిని కూడా గెలుచుకున్నారు. విచిత్రమేమిటంటే, మణిపూర్ పర్యాటక పటంలో షిరుయ్ శిఖరాన్ని చేర్చలేదు.
ఈ పువ్వును పరిరక్షించడానికి ఇప్పటివరకు ఏ పరిశోధకులు గానీ, నిపుణులు గానీ ముందుకు రాలేదు. ఈ పువ్వును పరిరక్షించడంలో సహాయపడటానికి, సంబంధిత రంగంలోని పరిశోధకులు, నిపుణులు ముందుకు రావాలని పలువురు అభ్యర్థించారుకూడా. ఇందుకోసం, ముఖ్యంగా నేల, వాతావరణం, పువ్వు స్వభావం మొదలైన వాటిపై పరిశోధన బృందాలను ఏర్పాటు చేసి, పువ్వు గురించి మరింత తెలుసుకోవాలని కోరారు.
కామెంట్‌లు