ఆట వెలది పద్యాలు
తల్లి ప్రథమ గురువు తండ్రి మలిగురువు
కన్నవారి ప్రేమ గాచుచుండు
బ్రతుకు విద్య దెలుపు బాధ్యత గురువుదే
వినుము లక్ష్మి మాట! విరుల తోట!
గురువు జ్ఞానమొసగి గుర్తింపు నిచ్చును
బ్రతుకు సమరమందు బలమునిచ్చు
గురువు లేక విద్య గరపసాధ్యముగాదు
వినుము లక్ష్మి మాట!విరుల తోట!
అడగకుండ మనకు నన్నివిద్యలునేర్పు
నోర్పుతోడ నతడు మార్పు దెచ్చు
తల్లి దండ్రి వోలె తాను మేలును గోరు
వినుము లక్ష్మి మాట!విరుల తోట!
చదువు విలువ దెల్పి జక్కజేయు మనల
బుజ్జగించి జెప్పు బుద్ధి తాను
గురువు మనకు కల్ప తరువు సమమగును
వినుము లక్ష్మి మాట!విరుల తోట!
గురువు బూజసేయ గురుపౌర్ణమియె వచ్చె
కొలువురయ్య మీదు గురువరులను
గురువులేని విద్య గుడ్డివిద్యగమారు
వినుము లక్ష్మి మాట! విరులతోట!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి