అనిస్ బేగం కిద్వాయ్ : - - యామిజాల జగదీశ్
 

అనిస్ బేగం కిద్వాయ్ కుటుంబం మొత్తం స్వాతంత్రోద్యమానికి అంకితమైంది. ప్రజాసేవే లక్ష్యంగా పని చేస్తూ మతసామరస్యానికి కృషి చేసింది. సంప్రదాయ కుటుంబం.
1906లో ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో షేక్ విలాయత్ అలీ దంపతులకు అనిస్ బేగం కిద్వాయ్ జన్మించారు. ఆమె భారత జాతీయ ఉద్యమంలో అంకితభావంతో పాల్గొన్నారు. ఆమె తండ్రి విలాయత్ అలీ, ఆమె భర్త షఫీ అహ్మద్ కిద్వాయ్ ఇద్దరూ స్వాతంత్ర్య సమరయోధులే. అలాగే ఆమె బావ రఫీ అహ్మద్ కిద్వాయ్ కూడా భారత జాతీయ ఉద్యమంలో నాయకుడు. ఆమె తండ్రి స్థానిక పత్రికలకు రాస్తుండేవారు. ఆయన ప్రముఖ న్యాయవాది. భర్త షఫీ అహ్మద్ అనిస్ బేగానికి బంధువే.
కిద్వాయ్ కుటుంబం మొత్తం ఖిలాఫత్ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం గమనార్హం. అయితే ఈ కారణంగా వారు బ్రిటిష్ పోలీసుల ఆగ్రహానికి గురయ్యారు.
సంపాదన పొందే కిద్వాయ్ కుటుంబ సభ్యులు తమ తమ ఉద్యోగాలను వదిలి భారత జాతీయోద్యమంలో పాల్గొనడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తాయి. అయినప్పటికీ, పోలీసులు లేదా ఆర్థిక కష్టాలు అనిస్ బేగం కిద్వాయ్ తిరుగులేని నిబద్ధతను రవ్వంతకూడా తగ్గించలేకపోయాయి. 
తన సోదరులకు ఇంటికొచ్చి ఉపాధ్యాయులు బోధించేటప్పుడు వినడం ద్వారా ఉర్దూ , ఇంగ్లీషు సాహిత్యాలను తెలుసుకున్న అనిస్ బేగం తన తండ్రి మరణం తరువాత, 1930ల చివరలో, ఇంటిపట్టున ఉండవలసి వచ్చింది. అయితే భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ఆమె ప్రజా జీవితానికి ఓ బాట వేసింది. ఆమె చివరి వరకు జాతీయోద్యమంలోను రాజకీయాలలోను తన క్రియాశీల పాత్రను పోషించారు.
దేశ విభజన ఆమెను తీవ్రంగా బాధించింది, ముఖ్యంగా హిందువులు, ముస్లింల మధ్య మత సామరస్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేసారు. దేశ విభజనను వ్యతిరేకించిన మతశక్తులు ఆమె భర్త షఫీ అహ్మద్ కిద్వాయ్ ప్రాణాలు తీశాయి. తన భర్తను కోల్పోవడం ఆమెకు వ్యక్తిగతంగా తీవ్ర  విషాదాన్ని మిగిల్చింది.
తన భర్త మరణానంతరం, అనిస్ బేగం కిద్వాయ్ ఢిల్లీలో మహాత్మా గాంధీని కలుసుకున్నారు, ఆయన మార్గదర్శకత్వంలో సుభద్ర జోషి, మృదులా సారాభాయ్ వంటి ఇతర మహిళా నేతలతో కలిసి పని చేయడం ప్రారంభించారు. 
దేశ విభజన కారణంగా తనలాగా బాధపడుతున్న మహిళలకు మద్దతు ఇవ్వడం, సహాయం చేయడం అనిస్ బేగం  లక్ష్యమైంది. బాధితుల కోసం ఆమె రెస్క్యూ క్యాంపులను ఏర్పాటు చేసారు. వారికి తన చేతనైన సహాయాన్ని అందించారు. ఈ సహాయసహకారాలే ఆమెకు 'అనిస్ ఆప' అనే ఆప్యాయతతో కూడిన మారుపేరును తెచ్చిపెట్టాయి.
అనిస్ కిద్వాయ్ రాజకీయ జీవితం అక్టోబర్ 24 (1954) న  సోదరుడు రఫీ మరణంతో ప్రారంభమైంది. ఆయన మరణానంతరం  కాంగ్రెస్ పార్టీ ఆమెకు రాజ్యసభ సీటునిచ్చింది. ఆమె కాంగ్రెస్ తరఫున 1957, 1962లలో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 
1961లో, ముస్లిం వ్యక్తిగత చట్టంలో సాధ్యమైన సంస్కరణలను పరిశీలించడానికి జవహర్‌లాల్ నెహ్రూ ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల పార్లమెంటరీ కమిటీలో అనిస్ బేగం ఏకైక మహిళా సభ్యురాలు. మొదటి సమావేశంలో ముస్లిం ఎంపీలు, మంత్రులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో వెంటనే రద్దు చేశారు.
దేశ విభజన సమయంలో ఆమె  అనుభవాలను " ఆజాదీ కి చాన్ మే " అనే పుస్తకం కళ్ళకు కట్టినట్లు వివరించాయి. ఇదే కాకుండా ఆమె జుల్మ్, అబ్ జింకే దేఖ్నే వంటి పుస్తకాలను కూడా రాశారు. ఇది మతతత్వ శక్తుల క్రూరత్వాన్ని ఖండించింది. ఆమె వ్యాసాల సంకలనం, నజ్రే ఖుష్ గుజ్రే కూడా 1976లో వెలువడింది. 
అనిస్  సాహిత్య నైపుణ్యాన్ని భారత ప్రభుత్వం, సాహిత్య కళా పరిషత్  గుర్తించి సత్కరించాయి. 
అటు రాజకీయాలలోను, ఇటు సాహిత్యంలోను ఆమె తనదైన ముద్రవేసుకున్నారు. ప్రజా సేవతోనూ ప్రత్యేక గుర్తింపు పొందిన అనిస్ బేగం కిద్వాయ్  1982  జూలై 16న మరణించారు. 
"మర్సియా 1947" అనే టైటిల్ తో ఒక లఘు చిత్రం విడుదలైంది. దేశ విభజన నుండి బయటపడిన, వివిధ దశలలో మతాలు, సరిహద్దుల్లో మతపరమైన హింసకు గురైన మహిళల మౌఖిక అనుభవాల గురించి నిర్మించిన చిత్రమిది. విభజన తర్వాత మూడేళ్లపాటు అపహరణకు గురైన మహిళలను రక్షించిన ఇద్దరు సామాజిక కార్యకర్తలైన అనిస్ కిద్వాయ్ కమలా బెన్ పటేల్ కథనాల ఆధారంగా ఈ చిత్రాన్ని  రూపొందించారు.

కామెంట్‌లు