వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
180. నిర్నాశా (త్ర్యక్క్షరీ)
181. మృత్యుమథనీ (పంచాక్క్షరీ)
నూట ఎనభై ఒకటవ నామ మంత్రము:
ఓం మృత్యమథన్యై నమః
మృత్యుమథనీ = మృత్యువును పోగొట్టునది
తన సాధకులనూ, భక్తులను వారి వారి అర్హతలను బట్టి, మృత్యువు యొక్క భయాన్ని పోగట్టుతాను అని తెలుపుతూ ప్రకటితమైన పరాత్పరిని చూసి వశిన్యాది వాగ్దేవతలు, జగన్మాతను "మృత్యుమథనీ" అని కీర్తించి తరించారు. మనలను మృత్యు భయపీడితులము కాకుండా కాపాడే భద్రకాళికి నమస్కారము.
పరమేశ్వరి, పరమేశ్వర హృదయేశ్వరియై, అర్థనారీశ్వరమై, ద్వైతము లేదూ, ఉన్నది అద్వైతమే, అని బోధించిన శ్రీమాత, తన స్వామి హృదయ మంత్రము, మనలను వైతరణిని దాటింపగలిగేది అయిన, "త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం! ఉర్వారుక మివబంధనాత్ మృత్యోమృక్షీయ మామృతాత్!!" అనే త్రయంబకంను మనకు ఇచ్చి, "మననాత్ త్రాయతే ఇతి మంత్రః" అని, ఈ మంత్ర స్మరణ మహిమ వలన మనలను రుద్రులను చేసి, ఆ మహారుద్రునిలో లీనమయే దారి చూపిన అగజ, "మృత్యుమథనీ" అయ్యింది.
జీవునికి, చనిపోవడం కంటే, తాను చనిపోతున్నాను అని తెలిసినప్పుడు కలిగే బాధ, ఆవేదన చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే "అనాయాసేన మరణం, వినాదైన్యేన జీవనం ! దేహాంతే తవ సాన్నిధ్యం, దేహిమే పరమేశ్వర !!" అని ప్రతీ క్షణం, ప్రతీ రోజూ, ఆ స్వామి సేవలో తరించి, కోరుకోవాలి. పరిక్షిత్తు మహారాజుకు తాను, ఏడు రోజులలో, తక్షకుని కాటువలన చనిపోతాను అని తెలిసినప్పుడు కలిగిన బాధ వర్ణనలో చెప్పలెనిది.
అయితే, తక్షకుని కాటు పడకుండా ఎక్కడ దాక్కోవాలి, ఎలా తప్పించుకోవాలి అని పరీక్షిత్తు మహారాజు ఆలోచన చేయలేదు. ఈ ఏడు రోజులలో పరమాత్మకు దగ్గరగా ఎలా ఉండాలి అనుకున్నాడు. శుక మహాయోగి భాగవత కథను ఏడు రోజులూ పరీక్షిత్తు మహారాజుకు వినిపించి, మహారాజు చేత భాగవత సప్తాహము చేయించి, మృత్యువు సమీపించినప్పుడు, ఎలా వుండాలి, ఏమి చేయాలి అనే దారి, మానవాళికి చూపించారు. ఈ విధంగా, శుక మహర్షి ద్వారా, పరీక్షిత్తు మహారాజుకు ముక్తిని ఒసగిన శ్రీచక్రరాజసింహాసనేశ్వరి, "మృత్యుమథనీ" అని పిలువబడుతుంది.
ఆత్మ ప్రవేశించిన శరీరము శుష్కించి, నశించినప్పుడు, ఆ ఆత్మ వేరొక శరీరమును చేరుతుంది. కానీ, పరమేశ్వరి యొక్క భక్తులూ, సాధకులూ, ఆ పరమేశ్వరి కరుణతో ఈ జననమరణ చక్రబంధ విషవలయం నుండి బయటపడవేయబడి, మోక్షాన్ని పొందుతారు అని సద్గురువు యొక్క అనుగ్రహంతో తెలుసుకుని, తనను పూజించే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం మృత్యమథన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి