"అదృశ్య వీరుడు" జానపద నవల 3️⃣3️⃣✅వ భాగం.: - నాగమణి రావులపాటి.


 "అలాగే మిత్రమా!" అని అన్నాడు జయసేనుడు. తన గుర్రం పంచకళ్యాణితో, "కళ్యాణీ! నీవు ఇక్కడే ఉండు. నేను ఈ పక్షిరాజు సహాయంతో ఆ మాయా మయ ప్రదేశానికి వెళ్ళి, వాడి ప్రాణాలను హరించి వస్తాను. జాగ్రరూకతతో ఉండు" అని వివరించాడు.
గండాబేరుండ పక్షి తన విశాలమైన రెక్కలను చాచింది. దాని రెక్కల విదిలింపునకు ఒక సుడిగాలి పలకరించింది. జయసేనుడు తన్ను తాను సమాయించుకుని, దాని రెక్కల ఆధారంతో దాని వీపుపై కూర్చుని, దాని మెడను గట్టిగా కౌగిలించుకున్నాడు. అది చూస్తుండగానే గాలిలోకి ఎగిరింది. అలా ఎంతో ఎత్తులో కదలికలను బంధించి దూసుకుపోతోంది. వక్రమల్లుడు నివాసం ఉన్న అడవిని దాటి, కొండలూ కోనలూ, సముద్రాలు దాటి ప్రయాణిస్తోంది.
అదో అలౌకికమైన అనుభూతి! అనుభవించాల్సిందే కానీ చెప్పతరం కాదు. అలా ప్రయాూనిస్తూ దారిలో ఒక చక్కటి కోనేటి దగ్గర ఆగింది. "కుమారా జయసేనా! ఆ నీటిని నీ దగ్గర ఉన్న తోలుతిత్తిలో భద్రపరుచుకో" అని పలికింది.
ఇంతలో ఒక విశేషం సంభవించింది. ఆ నిర్జన ప్రదేశంలో అనేక చిలుకలు గుంపులుగా రావటం కనిపించింది. జయసేనుడు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యాడు. అవి ఏదేదో మాట్లాడుకుంటున్నాయి; కానీ, ఏదో ఆపదలో చిక్కుకున్నట్లు అనిపిస్తోంది.
ఇంతలో గండాబేరుండం, "అరెరే! ఎంత ఆపదలో ఉన్నాయి ఈ చిలుకలు! వీళ్ళ నాయకుడు చిలుకరాజును, చిలుక రాణిని ఒక దుర్మార్గుడైన గబ్బిలం ఈ దాపుల్లోని కొండ గుహలోకి లాక్కెళ్ళిందట. వాడిని ఎదిరించలేక నిస్సహాయులై నా సహాయం అర్ధిస్తున్నాయి. కానీ, నా ఆకారం ఎంతో విశాలం; ఆ కొండ గుహలోనికి చొరబడలేను. జయసేనా! నీవు సునాయాసంగా ఆ గుహలోనికి దూరిపోగలవు. నీవేమైనా వారికి సహాయం చేయగలవా?" అని అడిగింది.
"తప్పక చేస్తాను మిత్రమా!" అని ఆ కొండ గుహకు దారి చూపమనెను. ఒక చిలుక ముందుకు వచ్చింది. అది ఎగురుతూ దారి చూపుతుండగా జయసేనుడు దానిని అనుసరించాడు. అది సరిగ్గా ఆ గబ్బిలాల నివాసమైన కొండ గుహ ముందు ఆగింది. ఇదే ఆ చిలుకలు అపహరణకు గురైన ప్రదేశం అని తెలుసుకుని, అదృశ్య రూపంలో గుహలోనికి దారితీశాడు.
అప్పటిదాకా కనిపించిన మానవ వీరుడు కనిపించక పోవటంతో కాస్త కంగారు పడినా, గండాబేరుండ స్నేహితుడిగా కాస్త నమ్మకం చిక్కింది. అక్కడే ఎదురుచూస్తోంది అతని రాకకై.
సశేషం...
కామెంట్‌లు