"అదృశ్య వీరుడు" జానపద నవల - 3️⃣4️⃣✅వ భాగం.: - నాగమణి రావులపాటి.
 

జయసేనుడు లోపలికి దూరి మెల్లగా అడుగులు వేస్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళగానే, ఒక పంజరం కనిపించింది; దానిలో రెండు చిలుకలు దీనంగా, మూగగా రోదిస్తున్నాయి. ఒక భీకరమైన గబ్బిలపు రాక్షసుడు అడ్డంగా పడుకుని ఉన్నాడు. ఆ గుహంతా దుర్గంధమైన వాసనతో వికారం పుట్టించేలా ఉంది. వాడి రెండు చేతుల్లో ఏదో మెరుస్తూ ఉంది; దాని కాంతి ఆ చీకటి గుహను వెలుతురుతో నింపుతోంది.
జయసేనుడు ముందుగా ఆ మణులను స్వాధీనం చేసుకున్నాడు. అంతే, ఏదో మాయలా తన దగ్గర ఉన్న మణులు మాయమవటంతో, రాక్షసుడు పంజరం వైపు దృష్టి సారించాడు. అవి బయటకు రాలేక, అందులో ఉండలేక సతమతమవుతున్నాయి. "అవి నా బంధనం నుంచి రాలేవు, మరి మణులు ఎలా మాయమయ్యాయి?" అని చివాలున లేచి వింత శబ్దాలతో అరవటం మొదలుపెట్టాడు.
జయసేనుడు ఆ జగదంబికను తలుచుకుని, తనవద్ద ఉన్న ఖడ్గంతో సమయస్ఫూర్తిగా దాని రెక్కలను నరికేశాడు. అది ఒకింత బాధతో, ఆశ్చర్యంతో "నాపై దాడి చేసినది ఎవరా?" అంటూ తీక్షణంగా వెతకసాగింది. జయసేనుడు అదును చూసి దాని కాళ్ళను నరికి, తుదకు తలను మొండెం నుంచి వేరు చేశాడు. వాడు విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాడు.
దానితో పంజరంలోని చిలుకలు విచిత్రంగా ఆ రాక్షస గబ్బిలం చావును తిలకిస్తూ, "ఎవరో అదృశ్యంగా వాడి ప్రాణాలు తీసారు అది ఎవరా?" అని ఆత్రంగా చూడసాగాయి. అది గమనించిన జయసేనుడు నిజరూపంలోకి మారి, పంజరం నుంచి వాటికి విముక్తి కలిగించాడు. ఆ మణులతో పాటు ఆ చిలుకలను తోడ్కొని జయసేనుడు బయటికి వచ్చాడు.
అంతకుముందు గుహకు దారి చూపిన చిలుక వీరితో ఏదో మాట్లాడుతోంది. మరల వీరంతా గండాబేరుండం, మిగిలిన చిలుకలు ఉన్న ప్రదేశానికి తిరిగి వచ్చాయి. అవి ఆ పక్షితో ఏదో చెబుతున్నాయి. అప్పుడు గండాబేరుండం, "కుమారా! నీయొద్ద ఉన్న మణులను వారు కోరుతున్నారు" అని వివరించాడు.
తనవద్ద ఉన్న ఆ మణులను ఆ చిలుక దంపతులకు అందించాడు. అంతే, అవి వారి చేతికి రాగానే ఆ చిలుక దంపతులు అందమైన యక్షుడు, యక్షిణిగా మారిపోయారు. మిగిలిన చిలుకలను యక్షిణులుగా మార్చేశారు. ఇదంతా ఎంతో సంభ్రమాశ్చర్యాలతో జయసేనుడు, గండాబేరుండం చూడసాగారు.
అప్పుడు ఆ యక్షుడు, "ఓ వీరుడా! నీ సాహసం కొనియాడతగినది. మేమిద్దరం దంపతులం, వీరంతా నా రాణి చెలికత్తెలు. మాకు భూలోక అందాలను తిలకించాలనిపించి, చిలుక రూపంలో వచ్చి విహరిస్తుంటే... మా ఇద్దరివద్ద ఉన్న మణులకు ఆకర్షితుడై ఆ గబ్బిలం రాక్షసుడు మణులను లాక్కుని, మమ్ములను నిస్సహాయులను చేసి బందీలను గావించాడు. నీ దయవలన మరలా మా రూపాలు మాకు దక్కాయి. ఈ మణులు లేనిచో మేము మా లోకానికి వెళ్ళలేము; ఇలా చిలుకలుగా ఇక్కడే తనువులు చాలించాల్సి వచ్చేది" అని అన్నాడు.
జయసేనుని సాహసానికి అందరూ ఎంతో మెచ్చుకున్నారు. గండాబేరుండ పక్షి ద్వారా జయసేనుని లక్ష్యాన్ని తెలుసుకుని, అతనికి ఒక అపూర్వమైన ఖడ్గాన్ని బహూకరించారు. "జయసేనా! మమ్ములను తలుచుకుని ఈ ఖడ్గాన్ని వినియోగించావంటే, ఎలాంటి మాయలతో నిర్మితమైన వస్తువైనా, జంతువైనా, తుదకు మాంత్రికుడైనా అంతం కావాల్సిందే!" అని ఒక మంత్రాన్ని ఉపదేశించి వారంతా గగనాంతరానికి ఎగిరిపోయారు.
"జయహో కుమారా! నీ అదృశ్య రూపానికి ఈ ఖడ్గం తోడయింది. ఇక నీకు అంతా జయమే. ఆ కోనేరులో నీటిని భద్రపరుచుకో, నిన్ను ఆ ప్రదేశం వద్ద దింపుతాను" అని అన్నది ఆ పక్షి...
సశేషం...
కామెంట్‌లు