జయసేనునికి పైప్రాణాలు పైనే పోయినంత పనయింది. ఆ రాక్షసుడు తీక్షణ నేత్రాలతో పైన మొత్తం పరికించి చూశాడు. ఎక్కడా ఏమీ కనిపించలేదు వాడి దృష్టికి. అంతే, ఉన్న చోటునే చుట్టూ ఓసారి చూశాడు. ఏమీ లేదని నిర్ధారించుకుని, అక్కడే క్రింద పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. అక్కడ ఉన్న మట్టిని పోగుచేసి, తనతో తెచ్చిన నీటితో ముద్దలా చేశాడు.
పైనుంచి జయసేనుడు గమనిస్తున్నాడు. రాక్షసుడు ఆ మట్టి ముద్దతో ఏదో తయారు చేస్తున్నాడు. "కొంపదీసి ఏ చేతబడి ఏమైనా చేస్తున్నాడేమో! నేను ఇక్కడ ఇరుక్కుపోయాను" అని తలపోశాడు. అది శివలింగం ఆకారంగా రూపుదిద్దుకుంటోంది. జయసేనుడికి ఆ రాక్షసుడి ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ శివలింగం పూర్తి కాగానే కొన్ని అశ్వత్థ వృక్షం యొక్క ఆకులను భక్తితో సమర్పించాడు. లింగాష్టకం లాంటి అష్టకాలు పఠించాడు. విడవకుండా 'ఓం నమశ్శివాయ' మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు.
జయసేనుడి ఆశ్చర్యానికి అంతులేదు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. వాడు కనులు తెరిచి, "తండ్రీ భూతనాథా! ఇంకెన్నాళ్ళు మాకీ శిక్ష? మా ఆదివాసీ జనులంతా ఇలా రాక్షసులుగా ఉండాల్సిందేనా? మాకు విముక్తిని ప్రసాదించు. ఈ మాయామయ ప్రదేశంలో మా జీవితాలు ముగియవలసిందేనా?" అని అనేక విధములుగా శివలింగాన్ని వేడుకుంటున్నాడు.
జయసేనుడి మెదడులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. 'రూపానికి రాక్షసుడిగా ఉన్నా స్వభావం ఎంతో సాత్వికంగా ఉంది. ఇది ఆ వక్రమల్లు మాయాజాలంలా ఉంది. ఇతను మంచివాడులా తోస్తున్నాడు' అనే సదభిప్రాయం కలిగింది. 'చూద్దాం ఏం జరుగుతుందో' అని అనుకున్నాడు. వాడు పూర్తిగా దైవంపై దృష్టిని కేంద్రీకరించాడు.
ఇంతలో ఒక పెద్ద భల్లూకం ఆ రాక్షసుడిపై తలపడింది. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకునే లోపే అది రాక్షసుణ్ణి హింసించసాగింది. దానితో జయసేనుడు గభాలున చెట్టు దిగి తన దివ్య కరవాలంతో ఆ భల్లూకాన్ని కడదేర్చాడు. రాక్షసుడు తనపై తలపడిన ఈ భల్లూకం తన ప్రమేయం లేకుండానే ఖండించబడింది. "తనను రక్షించటానికి ఆ పరమేశ్వరుడే ఏదో మాయ చేశాడు" అని ఆశ్చర్యంగా పరిసరాల వైపు వింతగా చూడసాగాడు.నేను ధ్యాన నిమగ్నుడనై వుండగా, నన్ను కాపాడిన అదృస్య శక్తి ఎవరు! వారికి నేను కృతజ్ఞతలు తెలియజేయాలి అని పలికాడు రాక్షసుడు.
అప్పుడు జయసేనుడు అదృశ్య రూపం వీడి అతని ముందు ప్రకటితమయ్యాడు. "ఆశ్చర్యం! ఈ ప్రదేశం భీకరమైనదే కాదు, మాయలకు నిలయమైనది అటువంటి ఈ అడవిలో మానవుడైన నీవు ఇక్కడిదాకా ఎలా రాగలిగావు? చూస్తే వీరుడిరా ఉన్నావు, ఎవరు నీవు?" అని అడిగాడు. "మరలా నా రూపాన్ని చూసి భయపడకు, నిర్భయంగా నీవు ఎవరో వివరించు" అని అన్నాడా రాక్షసుడు.
"ఓయీ! నీపై నాకు పూర్తి విశ్వాసమున్నది. నేను సౌరాష్ట్ర దేశ పౌరుడను. మా దేశ యువరాణి అమృతవల్లిని వక్రమల్లు అనే మాంత్రికుడు వాడి మాయలతో ఎత్తుకు వచ్చాడు. ఆమెను వెతికే క్రమంలో నేను వాడి నివాసాన్ని కనిపెట్టి వెళ్ళాను.వచ్చే గ్ర
హాణ పున్నమికి వాడు ఆరాధించే దేవికి బలివ్వాలని... వాడిని తుదముట్టిద్దామంటే, వాడి పంచ ప్రాణాలు ఈ అడవిలో దాచిన విషయం తెలిసి ఇక్కడికి వచ్చాను.వాడు రాకుమారిని దాచిన ప్రదేశం చాలా దూరం.దైవయోగమున నాకు అదృశ్య రూపం సంప్రాప్తించినది. దానివలన ఇక్కడిదాకా రాగలిగాను. కానీ, వాడు ఆ ప్రాణాలు దాచిన ప్రదేశాన్ని తెలుసుకోలేక పోతున్నాను. నీ ఆగమనం నాలో కొంత ఆశను మొలకెత్తించింది. నీకు ఏమైనా తెలిస్తే నాకు సహాయం చేయగలవా?" అని అన్నాడు జయసేనుడు.వక్రమల్లా!!!
: సశేషం..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి