కవితా వైభవాలు : - గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం.


కవితామృతము తాగిస్తా — 
కావ్యమాధుర్యము పంచుతా!
హృదయవీణను మీటుతా — 
గాంధర్వ గానము వినిపిస్తా!

కవితాదీపాలు వెలిగిస్తా — 
గాఢాంధకారం తొలగిస్తా!
కవితాకుసుమాలు పూయిస్తా — 
కలల వనాలను విరబూయిస్తా!

కవితాసౌరభాలు చల్లుతా — 
మనసుల మకరందం నింపుతా!
కవితాపంటలు పండిస్తా — 
భావఫలాలను అందిస్తా!

కవితావిత్తనాలు నాటుతా — 
విజ్ఞాన వృక్షాలు మొలిపిస్తా!
కవితావనాలను పెంచుతా —
సౌందర్య సీమలు నిర్మిస్తా!

కవితావంటలు వండుతా — 
కలకాలం గుర్తుండేలా చేస్తా!
కవితావిందులు వడ్డిస్తా — 
కవితాప్రియులను మెప్పిస్తా!

కవితారుచులు పంచుతా — 
సహృదయాలను రంజింపజేస్తా!
కవితాకళను చాటుతా — 
తెలుగు కీర్తిని పెంచుతా!

కవితాకాశానికి తీసుకెళ్తా —
చుక్కల లోకాలను చూపిస్తా!
కల్పన రెక్కలపై ఎగిరిస్తా —
కనులముందు వింతలు నిలుపుతా!

కవితాగంగను ప్రవహింపజేస్తా —
భావుకతకు పట్టం కడతా!
కవిత్వ కల్పవృక్షాన్ని పెంచుతా  —
సృజనకు కొత్తరెక్కలు తొడుగుతా!

కవితాసిరులు పంచుతా — 
కవనానందం మనసుల నింపుతా!
తరతరాలకు దారి చూపుతా —  
తెలుగు కీర్తిని దశదిశలా చాటుతా!

కవిత్వమే నా ఊపిరిగా — 
కావ్యసేవలో సాగుతా!
కవితాసుమాల మాలికతో — 
తెలుగు తల్లిని పూజిస్తా!

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Wonderful sir 👌👌