నేటి కష్టం రేపటి విజయానికి పునాది : - యామిజాల జగదీశ్
 

 

రాత్రిళ్లు వేరుశెనగలు అమ్ముతూ… పగలు కాలేజీలో చదువుకుంటూ! ఈ యువకుడి కష్టం చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! 
ఫిలిప్పీన్స్‌కు చెందిన అరిస్టన్ ఎరా (Ariston Era) విసాయాస్ యూనివర్సిటీలో మెరైన్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.
కుటుంబానికి సాయం చేయాలి… తన చదువును ఆపకూడదు. అందుకోసం రాత్రుళ్ళు సెబు నగర వీధుల్లో వేరుశెనగలు అమ్మేవాడు. పగలేమో కాలేజీకి వెళ్లి చదువుకునేవాడు. ఇలా కుటుంబ బాధ్యతలను చూసుకుంటూనే తన కలను నిజం చేసుకోవడానికి కష్టపడ్డాడు.
చదువు కోసం ఇంత కష్టమా!
కాలేజీ యూనిఫామ్‌లోనే వేరుశెనగలు అమ్ముతున్న అరిస్టన్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పగలు చదువు… రాత్రి పని. ఇలా కష్టపడుతున్న అతడిని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. తన పరిస్థితులు ఎలా ఉన్నా చదువును మాత్రం వదులుకోకూడదని ముందుకు సాగాడు.
కుటుంబం కోసం అతడి తపన!
తాను జీవితంలో మంచి స్థాయికి చేరుకోవాలి. తన కుటుంబం కూడా బాగుండాలి. ఇదే అరిస్టన్ ఆలోచన. అందుకే చదువుకుంటూనే రాత్రుళ్ళు పని చేసేవాడు. అతడి కష్టం, పట్టుదల చూసి చాలా మంది ప్రశంసించారు.
అరిస్టన్ చదువుతున్న యూనివర్సిటీ కూడా అతడిని అభినందించింది. ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మధ్యలో ఆపేయకుండా, తమ కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఇతర విద్యార్థులకు గుర్తుచేసింది.
అందరి జీవితాలు ఒకేలా ఉండవు. కొందరికి అన్నీ సులభంగానే దొరుకుతాయి. మరికొందరు మాత్రం తమ కలలను నిజం చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడాలి.
కానీ, పరిస్థితులు ఎలా ఉన్నా మన లక్ష్యాన్ని వదులుకోకూడదు. మనం చేయగలిగినంత కష్టపడుతూ ముందుకు సాగాలి.
ఈ రోజు నువ్వు పడే కష్టమే… రేపు నీ విజయానికి కారణం కావచ్చు!

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
True sir 👍