మహాసాధ్వి మండోదరి : - - యామిజాల జగదీశ్



 పరాక్రమశాలి, వీణా వాదనలో నిపుణుడు, గొప్ప శివభక్తుడు అయిన రావణుడి భార్య మండోదరి. ఆమె ఉత్తమ గుణాలు కలిగిన స్త్రీ. నడవడికలో, పాతివ్రత్యంలో మేటి అనిపించుకున్న మహాసాధ్వి. దేవశిల్పి మయుడి కుమార్తెగా జన్మించిన మండోదరి అందంలో మేటి. గొప్ప ఐశ్వర్యం కలిగిన మయుడు ఆమెను ఎంతో గారాబంగా, సిరిసంపదల నడుమ పెంచాడు. ఆమె కూడా పరమశివుడికి గొప్ప భక్తురాలు. ఇంద్రజిత్తు ఆమె కుమారుడు.
లంకను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రావణుడు మయుడి సహాయం కోరాడు. అక్కడ అణకువ, అందం కలగలిసిన మండోదరిని చూసి రావణుడు ఆమెపై మనసు పారేసుకున్నాడు. మయుడి అంగీకారంతో మండోదరిని వివాహం చేసుకున్నాడు.
రాక్షస వంశంలో జన్మించినప్పటికీ మండోదరి గొప్ప శివభక్తురాలిగా, భర్తకు మంచి సహచరిగా, పాతివ్రత్య ధర్మాన్ని పాటిస్తూ జీవించింది. ఆమె పాతివ్రత్య మహిమ వల్లే, ఎన్నో తప్పులు చేసిన రావణుడు వాటికి తగిన శిక్ష నుంచి తప్పించుకోగలిగా డని పలు జానపద కథలు చెబుతా యి. మండోదరి వల్ల రావణుడికి పేరు, ప్రతిష్ఠలు లభించాయి.
తన భర్త సీతాదేవిని అపహరించి లంకకు తీసుకొచ్చాడని తెలిసిన మండోదరి ఎంతో దుఃఖించింది. అది ధర్మవిరుద్ధమైన పని అని రావణుడికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పింది. సీతను తిరిగి శ్రీరాముడి దగ్గరకు పంపించాలని హితవు పలికింది. కానీ ఆమె మాటలు రావణుడి చెవులకు చేరాయే తప్ప, మనసుకు చేరలేదు.
భూమి, స్త్రీ, బంగారం మీద అత్యాశతో తప్పుడు మార్గాల్లో నడవడం వల్ల కలిగే అనర్థాలు ఏ కాలంలోనైనా ఉంటాయి. భర్త ఏం చేసినా సరేనని సమర్థించలేదు మండోదరి. తనకెందు కులే అని పక్కకు తప్పుకోలేదు. భర్తతోనే ఉంటూ, అతడి మనసు మార్చేందుకు చివరివరకూ ప్రయత్నిం చింది. తన భర్త అయినప్పటికీ, ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే సహించలేని ధైర్యవంతురాలు ఆమె.
‘మండోదరి’ అనే పేరుకు సన్నని నడుము కలిగిన స్త్రీ అని అర్థం. ఆమె మనసు కూడా ఎంతో సున్నితమైనది. తన భర్త సీతకు చేసిన అన్యాయాన్ని, దాని వల్ల సీత అనుభవించిన బాధను ఆమె తట్టుకోలేకపోయింది. తనకు చేతనైనంతవరకూ రావణుడికి మంచి మాటలు చెప్పి, అతడిలో మార్పు తీసుకురావాలని తపించింది.
సీతాదేవిని వెతుకుతూ లంకకు వచ్చిన హనుమంతుడు, రావణుడి అంతఃపురంలో మండోదరిని చూశాడు. ఆమె అందాన్ని చూసి, ఈమెనే సీతాదేవి అని పొరబడ్డాడని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. అంతటి అందం, ఉన్నతమైన గుణాలు కలిగిన స్త్రీ మండోదరి. ధర్మమార్గంలో నడిచే ఆమె తన భర్త కోసం ఎన్నో త్యాగాలు చేసింది. యుద్ధంలో తన కుమారులను ఒక్కొక్కరిగా కోల్పో యింది. తాను ఎలాంటి తప్పూ చేయకపోయినా, భర్త చేసిన అనుచిత పనుల వల్ల తనకు కూడా అపకీర్తి వస్తుందని తెలిసినా, ఆ బాధను మౌనంగా భరించింది.
భర్త తప్పును ఎత్తిచూపిన ధైర్యశాలి
యుద్ధంలో విజయం సాధించాలనే కోరికతో రావణుడు ఒక యాగం ప్రారంభించాడు. వానర సైన్యం ఆ యాగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినా, రావణుడు మాత్రం దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు.
ఆ సమయంలో అంగదుడు రావణుడి ఏకాగ్రతను దెబ్బతీయాలని ఒక ఉపాయం ఆలోచించాడు. మండోదరి జుట్టు పట్టుకుని ఆమెను ఈడ్చుకుం టూ రావణుడి ముందుకు తీసుకెళ్లా డు. రావణుడి దగ్గరగా వెళ్తూ మండోద రి ఇలా అంది:
“మీరు సీతాదేవిని బలవంతంగా లంకకు తీసుకొచ్చారు. ఇప్పుడు మీ భార్యనైన నన్ను అంగదుడు జుట్టు పట్టుకుని ఈడ్చుకుపోతున్నాడు. ఇదంతా మీ కళ్లతో చూడండి!”
ఆ మాటలు రావణుడిలో ఆగ్రహాన్ని రగిలించాయి. కోపంతో యాగాన్ని మధ్యలోనే వదిలేసి, అంగదుడిని చంపాలనే ఉద్దేశంతో అతడి వెంట పరుగెత్తాడు. అంగదుడు తాను వచ్చిన పని నెరవేరిందని సంతోషిస్తూ, రావణుడికి చిక్కకుండా తప్పించుకున్నాడు.
తన భర్త చేసిన తప్పును అతడికే అర్థమయ్యేలా చేయాలన్న ఉద్దేశంతో మండోదరి తనకు తానే కష్టాన్ని తెచ్చుకుంది. భర్తలో మార్పు రావాలని, అతడు ధర్మమార్గంలోకి తిరిగి రావాలని తన బాధను సైతం లెక్కచేయలేదు. అలాంటి గొప్ప మనసున్న స్త్రీ మండోదరి.
రావణుడి మరణం – మండోదరి విషాదాంతం
చివరకు యుద్ధంలో రావణుడు మరణించాడు. భర్త మృతదేహాన్ని చూసిన మండోదరి దుఃఖంతో విలపించింది. తట్టుకోలేని బాధతో రావణుడి ఛాతీపై పడి, అతడిని కౌగిలించుకుని ప్రాణాలు విడిచిందని కథలు చెబుతాయి.
గొప్ప శివభక్తి, అపారమైన ప్రేమ, సత్యనిష్ఠ, పాతివ్రత్యం, ఇతరులకు కలలోనైనా కీడు తలపెట్టని స్వచ్ఛమైన మనసు — ఇలా ఎన్నో ఉత్తమ గుణాలు మండోదరిలో ఉన్నాయి. అయినప్పటికీ, భర్త చేసిన తప్పుల వల్ల ఆమె జీవితం విషాదంతో ముగిసింది.
సీతాదేవికి ఏమాత్రం తీసిపోని సుగుణాలు మండోదరిలో ఉన్నా, రావణుడి దుష్ప్రవర్తన వల్ల ఆమె గొప్పతనం మరుగున పడిపోయింది. తన భర్తను ధర్మమార్గంలో నడిపించేం దుకు చివరివరకూ ప్రయత్నించిన మండోదరి వంటి మహాసాధ్వి, రావణుడి జీవితంలో ఉండటం అతడికి గొప్ప అదృష్టం. ఆమె మాటలను ఆలకించి ఉంటే, రావణు డికి ఆ దుర్గతి పట్టేది కాదేమో!
భర్తను ప్రేమించడం అంటే అతడు చేసే ప్రతి పనినీ సమర్థించడం కాదు. అతడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఎత్తిచూపి, సరైన దారిలో నడిపించేందుకు ప్రయత్నించడమే నిజమైన ప్రేమ. మండోదరి జీవితం మనకు అందించే గొప్ప సందేశం ఇదే.
ఆలయం
గోవాలోని పొండా పట్టణానికి సమీపంలో ఉన్న బేట్కి గ్రామంలో శ్రీ మండోదరి ఆలయం ఉంది. సముద్ర మట్టానికి సుమారు 81 అడుగుల ఎత్తులో ఈ ఆలయం కొలువై ఉంది. జలదేవత మండోదరి మహిమలు, గ్రామ ప్రజలు చేసిన త్యాగాల కారణంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మండోదరి అమ్మవారిని ప్రధాన దైవంగా పూజిస్తారు.
ఈ ఆలయం బేట్కి గ్రామానికి గ్రామదేవత అయిన మండోదరి అమ్మవారిది. అంతేతప్ప, ఈమె రావణుడి భార్య మండోదరి కాదు. నీటికి అధిదేవతగా గ్రామ ప్రజలు కొలిచే అమ్మవారు.
ఈ ఆలయానికి సుమారు వెయ్యేళ్ల చరిత్ర ఉందని స్థానికులు నమ్ముతారు. గర్భగుడి, దాని ముందు విశాలంగా ఉన్న మండపంతో ఈ ఆలయం నిర్మితమైంది. బేట్కి గ్రామ ప్రజలు మండోదరి అమ్మవారిని తమ గ్రామదేవతగా భావించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. గర్భగుడిలో అమ్మవారు కొలువై ఉంటారు.
‘మండోదరి’ అనే పేరుకు నీటితో సంబంధం ఉందని చెబుతారు. ‘మండ్’ అంటే నీరు, ‘ఉదర’ అంటే కడుపు. ఈ రెండు పదాల కలయికతో నీటిలో జన్మించినది అనే అర్థం వస్తుందని స్థానిక కథనం.
గ్రామ ప్రజల సంక్షేమం కోసం ప్రాణత్యాగం చేసిన పిల్లల జ్ఞాపకార్థం, ఆ గ్రామానికి నిరంతరం నీరు అందేలా అనుగ్రహించిన మండోదరి అమ్మవారి మహిమను స్మరించుకుంటూ ఈ ఆలయాన్ని గౌరవిస్తారు.
గ్రామ ప్రజల మేలు కోసం పిల్లలు చేసిన త్యాగానికి గుర్తుగా, ఎప్పటికీ ఎండిపోని నీటి ప్రవాహం అందుబాటులోకి రావడంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. బావుల ద్వారా నీరు లభించని ప్రాంతాల్లో వాగులు, నీటి ఊటలు గ్రామ ప్రజల జీవనానికి ఎంతో కీలకం. అందుకే నీటితో సంబంధం ఉన్న ఈ దేవతను గ్రామ ప్రజలు పూజించడం మొదలుపెట్టి ఉండవచ్చు. తమకు జీవనాధారమైన నీరు ఎల్లప్పుడూ సమృద్ధిగా లభించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు.
నీరు మనిషి జీవితానికి ఎంత ముఖ్యమో, భారతదేశంలోని అనేక గ్రామాల ఆచారాలు, సంప్రదాయాలు తెలియజేస్తాయి. మండోదరి అమ్మవారి పట్ల బేట్కి గ్రామ ప్రజలకు ఉన్న భక్తి, నీటి పట్ల వారికున్న గౌరవాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన పల్లకిలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగిస్తూ భక్తులు మండోదరి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆమె అనుగ్రహం కోసం ప్రార్థిస్తారు.


కామెంట్‌లు