సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 శల్య పర్వము ద్వితీయాశ్వాసము- 421 వ రోజు


భీమసుయోధనులు ఎదుర్కొనుట

సాత్యకి మొదలైన వారు భీముడిని పొగిడారు వారందరిని చూసి భీముడు " ధర్మజా ! ఈ కులనాశకుని మీద నాకు అమిత కోపం ఉంది. అర్జునుడు ఖాండవవనదహనం చేసిన విధంగా నేడు నేను సుయోధనుడిని సంహరిస్తాను. నిన్ను ఈ భూమికి పట్టాభిషిక్తుని చేస్తాను. ఈ రోజు ధృతరాష్ట్రుడు తన కుమారుడి మరణవార్త విని ఏడవక తప్పదు " అని తన గధ తీసుకుని సుయోధనుడి ఎదుట నిలువగానే భీమునిలో పగ రగిలి పోయింది. భీముడు " సుయోధనా ! మమ్ము లక్క ఇంట్లో పెట్టి కాల్పించావు. మా అన్న ధర్మరాజుతో మాయా జూదం ఆడించి మా రాజ్యాన్ని అపహరించావు. ద్రౌపదిని నిండు సభలో అవమానించిన ఫలం ఊరికే పోతుందా అనుభవించు. భీష్మ, ద్రోణ, కర్ణ, శల్యుల వంటి మహా వీరులంతా నీ కొరకు బలి అయ్యారు. నీవు వెంట తెచ్చిన రాజులంతా యుద్ధభూమిలో మరణించారు. ఈ మహా మారణహమానికి మూల పురుషుడివైన నిన్ను నేను చంపి ఈ లోకం లోని కాలుష్యాన్ని కడిగి వేస్తాను " అన్నాడు. సుయోధనుడు " బీమా ! అతిగా మాట్లాడకు యుద్ధం చేసి నా చేతిలో చచ్చిపోయి. నన్ను రాజ్యాభి షిక్తుడిని చెయ్యి. నాతో గదా యుద్ధం చేయడానికి ఇంద్రాదులు కూడా భయపడతారు నీ వెంత " అన్నాడు.
బలరాముని రాక
తన ప్రియ శిష్యుడైన సుయోధనుడు భీమునితో ద్వంధ యుద్ధానికి సిద్ధపడ్డాడని తెలిసి తీర్ధయాత్ర నుండి వస్తున్న బలరాముడు అది చూడాలన్న కుతూహలంతో అక్కడకు వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో బలరామునకు ఎదురేగి అర్ఘ్యపాద్యములను ఇచ్చి సత్కరించి ఉచితాసనమున కూర్చుండ చేసాడు. బలరాముడు వారితో ప్రియసంభాషణ చేసి ఆనందపరచాడు. శ్రీకృష్ణుడు సాత్యకి అన్నగారికి పక్కనే కూర్చున్నారు. మిగిలిన వారందరూ బలరాముని కుశల ప్రశ్నలు వేసారు. బలరాముడు వారందరిని చూసి " ఈ యుద్ధములో పాల్గొనడానికి ఇష్టపడక నేను తీర్ధయాత్రకు వచ్చాను. మిమ్ము చూసి చాలా రోజులైందనీ భీమసుయోధనులు యుద్ధం చేస్తున్నారని తెలుసుకుని చూడాలన్న కుతూహలంతో ఇక్కడకు వచ్చాను " అన్నాడు. భీముడు, సుయోధనుడు బలరామునకు ఎదురెదురుగా నిలిచి నమస్కరించారు. ధర్మరాజు లేచి భీముడు సుయోధనుడితో ఎందుకు ద్వంధ యుద్ధం చేస్తున్నాడో వివరించి వారి ద్వంధ యుద్ధానికి అనుజ్ఞ ఇమ్మన్నాడు. బలరాముడు అలాగే అనుజ్ఞ ఇచ్చాడు " అన్నాడు సంజయుడు.
ప్రభాస తీర్థం
జనమేజయుడు వైశంపాయునితో " మునివర్యా ! యుద్ధారంభంలో బలరాముడు శ్రీకృష్ణుని పాండవపక్షపాతి అని నిందించి యుద్ధములో పాల్గొనడానికి తీర్ధర్తత్రకు వెళ్ళాడు. అలాంటి బలరాముడు భీమసుయోధనుడి ద్వంధయుద్ధానికి ఎలా వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఏమి జరిగింది " అని అడిగాడు. వైశయంపాయనుడు " జనమేజయా ! బలరాముడు యజ్ఞానికి కావలసిన సంభారములు సమకూర్చుకుని బ్రాహ్మణులు వెంటరాగా సరస్వతీనది సాగరసంగమం చేసే ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ప్రదేశాన్ని ప్రభాసతీర్థం అంటారు. బలరాముడు ఆతీర్ధాన్ని దాని సమీపతీర్ధాలను సేవించి బ్రాహ్మణులకు గోవులను ధనమును దానం ఇచ్చాడు. ఆ మాట వినగానేజనమేజయుడు ప్రభాసతీర్ధ మహత్యం వివరించమని వైశంపాయనుడిని కోరాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు