కరకు ఖాకీ దుస్తులతో పనికి అంకితమైనా,
బాసిజాన్ని పుక్కిట పట్టి అదిమినా,
సమయసారిణిని చక్కగా పాటించినా,
విధినిర్వహణకు కుటుంబాన్ని కూడా పక్కకు పెట్టినా,
అసంబద్ధ నిర్ణయాలతో విసిగి
వేసారినా,
ఆజ్ఞలను తు.చ తప్పకుండా పాటించినా,
సమాజం అడుగడుగునా అపనమ్మకపు చూపులు చూసినా,
రాజకీయ నాయకులు ఊసరవెల్లి రంగులు మార్చినా,
పాలకులు తమ ఇష్టాలకు వాడుకొనజూసినా,
కల్లోల సమయాల్లో మరకలు అంటినా,
రోజంతా రోడ్లపై జాగారం చేయాల్సి వచ్చినా,
పొడగిట్టని వారు కాపు కాచి హాని తలపెట్టినా,
కాలం అస్సలు అనుకూలంగా లేకపోయినా,
కఠిన నిర్ణయాల సంకెళ్ళు పడినా,
నెత్తిన పెట్టిన టోపీ వెక్కిరించినా,
పక్షపాతపు పాచి తెగ నంటజూచినా,
తెలివిదప్పి విమర్శకులు అవాకులు చెవాకులు పేలినా,
ప్రసార మాధ్యమాలు హీరోలు చేసినా,విలన్లుగా చూపినా,
ప్రాణాలు సైతం లెక్కజేయని ధీరత్వం,
హృదయాల్లో నింపుకున్న మానవత్వం,
ఎన్కౌంటర్ల వెలుగు చీకట్లు ముసిరినా సడలని స్థిరత్వం,
విధి వశాత్తు తప్పని మరణాల్లో
సాహసం,
నీ మొక్కవోని ధైర్య,స్థైర్యాల ఋజుత్వం,
పోలీసు! నీ అడ్రస్సే ప్రజలకు
రక్షణై నిలుస్తున్నది.
నీ సేవలు నిరుపమానమై ముద్ర వేస్తున్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి