సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 

 

సామెత-398 : ఈగ వాలితే ముక్కు కోసుకున్నట్టు"
***
ఏందో అవ్వా! కొందరి తీరు యవ్వారం అదో రకంగ వుంటది. గాళ్ళ తల్కాయలల్ల మెదడుందా !ఇంకేమన్న మన్ను మశానం ఉందాని అన్పిత్తుంటది."
 "ఏంది శెల్లోవ్! ఎవలన్న యినగాల.గీ మాట ఆళ్ళనే అన్నమని అన్కుని కయ్యానికొచ్చేను జెర జాగర్త . ఎవలికన్న యిట్టం లేకుంటే ఊల్లె ముచ్చెట్లు అన్నీ నీకే గావాల్నా ?మమ్మల్నే  అంటవా? అని పంచాతికి సుత వొత్తరు శెల్లే. అస్లే పరిత్తితులు మంచిగ లెవ్వు."
 "ఏందవ్వా! ఎప్పుడు దైర్నంగ మాట్లాడాలె. అవుసురమైతే ఎదురు సమాధానం సుత శెప్పాలె. లేకుంటే బకరాను జేసి ఆడిత్తరు అని నువ్వే ఎన్నో త్యేపల శెప్పినవ్.గిప్పుడేమో గిట్ల మన్సుల పిర్కి మందు బోత్తున్నవ్"
అస్లే మూర్ఖులు ఎవలన్న మంచి శెబర శెప్పబోతె యింటరా శెల్లే! నాకెందుకో గని ఓ కత యాది కొచ్చి వొల్లు జల్లనిపిచ్చింది.
గదేం కతనో జెర జెప్పు అవ్వా!అస్లే కతలంటే శెవులు కోస్కుంట. నీకు తెల్సుగద.
"నువ్వు కతలకి శెవులు కోస్కుంటనని  నవ్వుతాలుకి అన్నవు గని ,ఒకాయిన కతేమైందో తెల్సునా? నిజ్జంగా ముక్కే తెగిపోయింది
 "అయ్యో! అవ్వా ! గట్లెట్లయింది.జెల్దీ శెప్పు!ఆత్రం ఆపుకోలేక పోతున్న."
" కొందరు మంత్రులకి, పెద్దోళ్ళకి రచ్చనగా, కాపలాగ పేద్ద తుపాకి బట్టుకొని ఎన్కాల నిలబడ్తరు సూడు. గజ్జూసి ఓ ఒకాయిన నాకు మాత్తరం ఏం తక్వ నేను గాళ్ళ లెక్కనే అన్కుని ఓ మడిషిని రచ్చనగా కాపలాగ పెట్టుకున్నడు. శానా మందిరి గాడొట్టి మూర్ఖుడు గాన్నెందుకు బెట్కొన్నవ్ పెద్దాయనా! అంటే నాయిట్టం, మీకెందుకు అంటడు."
 "ఇంగ గా మూర్ఖుడు పెద్దాయన్ని కాపలా కాత్తుంటడు.కొన్ని దినాల్లో ఓ పాలి గా పెద్దాయన నిద్దుర వోతున్న సయిమంల గా మూర్ఖుడు కాపలా కాత్తుంటడు.గింతట్లనే ఓ ఈగొచ్చి ముక్కు మీద ఆల్తది‌. ఇష్షన్నా ఉష్షన్నా వోదు."అమ్మనీ నేనంటే బయం లేకుంట ఆల్తవా వుండు నీ పని శెప్త అన్కుంట కత్తి దీశిండు.గా సయిమంలో  ఈగ వొయ్యి గా పెద్దాయన ముక్కు మీద ఆల్తది‌. తీశిన కత్తితో ఈగెని సంపడాన్కి సర్రున అదున్న సోట యిసుర్తడు.ఆ ఈగ ఎగిరిపోతది.గా కత్తి యిసురుడుకు ముక్కు తెగి కింద వడ్తది".
అయ్యో! గట్లెట్ల సేశిండవ్వా! గస్మంటి మూర్ఖున్ని ఎవలన్న పెట్టుకుంటరా పాపం కా పెద్దాయిన ముక్కు తెగిపాయె కదవ్వా!"
"అవును శెల్లే! గిది కతనే గని గిట్ల తెలివితక్కువ పన్లు శేసేటోళ్ళని, ఎవలో కాకుండా ఆళ్ళకి ఆళ్ళే నట్టం జేస్కునేటోళ్ళని,"ఈగ వాలితే ముక్కు కోసుకున్నట్లు" అన్న శాస్త్రంతో పోల్శి శెబుతరు."
 బలేగ శెప్పినవ్ అవ్వా!గిసుమంటి మూర్ఖుల్ని మన సుట్టూ ఉన్నోళ్ళలో  ఒక్కలిద్దర్నైనా సూత్తుంటం".
"గదండీ సంగతి!  "ఈగ వాలితే ముక్కు కోసుకున్నట్లు" అంటే గిదే మరి. కొంత మందిది తెల్వి తక్వ ఆలోచనల వల్ల గిట్ల నట్టపోతుంటరు."
కామెంట్‌లు