మన దేశపు తొలి మహిళా ఎలక్ట్రికల్ ఇంజినీర్ — ఎ. లలిత: - - యామిజాల జగదీశ్
 

అది మద్రాసు. 1930వ దశకం.
ఓ అమ్మాయికి పదిహేనేళ్లకే పెళ్లయింది. పద్దెనిమిదేళ్లకే తల్లి అయింది. బిడ్డ పుట్టిన నాలుగు నెలలకే భర్తను కోల్పోయింది.
ఎలాంటి హడావుడి లేదు. ఎవరి దగ్గరా సమాధానాలు లేవు. చుట్టూ నిశ్శబ్దం మాత్రమే.
చేతుల్లో పసిబిడ్డ. కానీ, ఆమె కథ అక్కడితో ముగియలేదు. నిజానికి, ఆమె జీవితం అక్కడి నుంచే కొత్త మలుపు తిరిగింది.
ఆమె పేరు అయ్యలసోమయాజుల లలిత. ఆమె ఆ తర్వాత సాధించినది ఏమిటో తెలుసా....
ఆమె తండ్రి పప్పు సుబ్బారావు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్. తన కూతురిలోని ప్రతిభను ఆయన గుర్తించారు. ఆమెను ఓదార్చి ఊరుకోలేదు. ఆమె భవిష్యత్తుకే కొత్త దారి చూపించారు.
గిండీలోని కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఆమెను చేర్పించారు. అది పూర్తిగా పురుషుల ఆధిపత్యం ఉన్న ప్రపంచం. అక్కడికి అంతకుముందు ఏ మహిళా అడుగుపెట్టలేదు. కానీ లలిత అడుగుపెట్టింది.
1943.
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పట్టాతో ఆమె కళాశాల నుంచి బయటకు వచ్చింది.
భారతదేశపు తొలి మహిళా ఇంజినీర్‌గా చరిత్ర సృష్టించింది.
ఆమెకు ప్రత్యేక రాయితీలు లేవు. ఆమె కోసం ఉద్యమాలు జరగలేదు.
ఉన్నదల్లా ధైర్యం మాత్రమే.
ఇతరులు గుసగుసలాడుతున్న సమయంలో, ఆమె దేశంలోని అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటైన భాక్రా నంగల్ ప్రాజెక్టు కోసం విద్యుత్ ప్రసార మార్గాల రూపకల్పనలో పనిచేసింది.
దేశాలు గోడలు కడుతున్న కాలంలో, ఆమె ఆ దేశాలకు వెలుగులు పంచే పనిలో నిమగ్నమైంది.
తర్వాత కలకత్తాలోని అసోసియేటెడ్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ (AEI) సంస్థలో చేరింది.
దాదాపు మూడు దశాబ్దాల పాటు అక్కడ పనిచేసింది.
విద్యుత్ వ్యవస్థలకు రూపకల్పన చేసింది. లోపాలను సరిచేసింది. బ్రిటిష్ సాంకేతిక పరిజ్ఞానానికీ, భారతీయ ఆశయాలకూ మధ్య వారధిగా నిలిచింది.
వితంతువులు ప్రయాణాలు చేయకూడదనే అప్పటి సామాజిక ఆంక్షల వల్ల ఆమెకు క్షేత్రస్థాయి పర్యటనలకు అవకాశం దక్కలేదు.
కానీ ఆమె తన ప్రతిభను చాటుకోవడానికి ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని నిరూపించింది.
తన కార్యాలయంలో కూర్చునే విద్యుత్ వ్యవస్థల అభివృద్ధికి ఎంతో కృషి చేసింది.
ఆమె పెద్దగా మాట్లాడలేదు. పోరాటాలు చేయలేదు.
రోజూ తన పనితోనే తన సత్తా చాటింది.
1964. న్యూయార్క్.
మహిళా ఇంజినీర్లు, శాస్త్రవేత్తల తొలి అంతర్జాతీయ సదస్సు జరిగింది.
లలిత అక్కడ ఉంది.
చీరకట్టులో, తన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ నిలిచింది.
ఆమె పేరు కూడా సరిగ్గా తెలియని దేశం తరఫున ప్రపంచ వేదికపై అడుగుపెట్టింది. 1966 నాటికి, లండన్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్స్‌లో పూర్తి సభ్యత్వం పొందింది.
ఆమె కథ భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచానికి ఓ సందేశంగా నిలిచింది.
కానీ మన పాఠ్యపుస్తకాలను అడగండి. మన ఇంజినీరింగ్ కళాశాలలను అడగండి. ఆమె పనిచేసిన ఆనకట్టలను, విద్యుత్ వ్యవస్థలను అడగండి.
అవి ఆమె అందించిన వెలుగును గుర్తుంచుకుంటాయి.
కానీ ఆ వెలుగులు పంచిన మహిళ పేరును మాత్రం మరిచిపోతాయి.
అందుకే, ఎవరైనా మిమ్మల్ని “ఇంజినీరింగ్ ఎప్పుడూ పురుషుల ప్రపంచమేనా?” అని అడిగితే...
చిరునవ్వు నవ్వి ఇలా చెప్పండి:
“ఈ రంగంలో మహిళల కోసం ప్రత్యేక విధానాలు, అవకాశాలు ఏర్పడక ముందే... లలిత తన ప్రతిభతో అడ్డంకులన్నింటినీ ఛేదించింది.”
ఆమె తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు అంటే ఏమిటో తన పనితోనే కొత్తగా చూపించింది.
నినాదాలు చేయలేదు. కచ్చితత్వంతో పనిచేసింది.
ఆమె పేరు ఎ. లలిత.
ఆమె గీసిన ప్రతి విద్యుత్ వలయం... మహిళలు ఈ రంగంలో రాణించలేరనే పాత ఆలోచనలకు నిశ్శబ్ద సమాధానమైంది.
మహిళా సాధికారత అనేది ఎవరో ఇచ్చే బహుమతి కాదు. అది మనలోనే ఉంటుంది. తల్లిదండ్రులు గుర్తించి, ప్రోత్సహిస్తే మరింత వికసిస్తుంది.
కామెంట్‌లు