శౌర్యాగ్నితో శంఖం పూరిస్తా!
రాక్షసులపై రణానికి దిగుతా —
ధర్మసేనగా దండెత్తుతా!
అవినీతి మూలాలు పెకలిస్తా —
అధర్మపు కోటలు కూల్చేస్తా!
అన్యాయగాళ్ల ఆటలు కట్టిస్తా —
న్యాయదీపాలను వెలిగిస్తా!
మోసగాళ్ల భరతం పడతా —
ముసుగుల వెనుక మర్మం విప్పుతా!
ద్రోహుల కుట్రలు తిప్పికొడతా —
దుర్మార్గుల దారులు మూసేస్తా!
దుష్టులపై పోరాటం చేస్తా —
దుష్కృత్యాల పునాదులు పెకలిస్తా!
కఠినాత్ములపై కలమెత్తుతా —
కరుణా భావాలను మేల్కొలుపుతా!
బలహీనుల పక్షాన నిలబడతా —
బాధితుల కన్నీరు తుడిచేస్తా!
దీనుల గొంతుకనై గర్జిస్తా —
దిక్కులేని వారికి దిక్కవుతా!
అవసరమైతే అగ్నిశిఖనవుతా —
ఆపదలో అభయహస్తమవుతా!
అవకాశమొస్తే అమృతధారనవుతా —
అందరి హృదయాల్లో అనురాగమవుతా!
కత్తి పట్టకుండానే కలంతో పోరాడతా —
కపటపు చీకట్లను కవితతో తరిమేస్తా!
కక్షలు పెంచకుండానే కదనంలో గెలుస్తా —
కలలను కనమంటూ కలతలను తుడిచేస్తా!
ధర్మమే నా ధ్వజమవుతుంది —
న్యాయమే నా నినాదమవుతుంది!
సత్యమే నా సైన్యమవుతుంది —
సమసమాజమే నా విజయమవుతుంది!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి