స్వామి వివేకానంద అనుభవం: - - యామిజాల జగదీశ్



 స్వామి వివేకానంద చికాగోతో పాటు ఇతర నగరాల్లో ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు, ప్రతి వారం పన్నెండు, పదిహేను, ఒక్కోసారైతే అంతకంటే ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇలా శరీరాన్ని, మనసును అతిగా శ్రమ పెట్టడం వల్ల ఆయన ఎంతగానో అలసిపోయేవారు.
ఉపన్యాసాల కోసం కొత్త విషయాలు దొరకడం కష్టమయ్యేది. మరుసటి రోజు ఏ విషయం గురించి మాట్లాడాలి? కొత్త ఆలోచనలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అని ఆందోళన చెందేవారు. కొత్త విషయాలు అసలు తట్టేవి కావంటూ ఆయన ఇలా రాసుకున్నారు...
"ఒక రోజు ఉపన్యాసం ముగించుకుని, ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తూ పడుకున్నాను. ఆలోచనల్లో ఉండగానే నాకు మగతనిద్ర కమ్ముకుంది. ఆ స్థితిలో ఎవరో నా పక్కనే నిలబడి ఉపన్యాసం ఇస్తున్నట్లు అనిపించింది. ఎన్నో కొత్త ఆలోచనలు, నాకు జీవితంలో ఎప్పుడూ వినని, ఆలోచించని కొత్త విషయాలు వినిపించాయి.
నిద్ర నుంచి మేలుకున్నాక ఆ విషయాలన్నీ నాకు గుర్తుండేవి. వాటినే నా ఉపన్యాసాల్లో చెప్పేవాడిని. ఇలా ఎన్నిసార్లు జరిగిందో లెక్కలేదు. ఎన్నో రోజులు మంచం మీద పడుకున్నప్పుడే ఇలాంటి ఉపన్యాసాలు నాకు వినిపించేవి.
కొన్నిసార్లు ఆ ఉపన్యాసం చాలా గట్టిగా వినిపించేది. పక్క గదుల్లో ఉన్నవాళ్లకు కూడా ఆ శబ్దం వినిపించేది. మరుసటి రోజు వాళ్లు నన్ను, “స్వామీజీ, నిన్న రాత్రి మీరు అంత పెద్దగా ఎవరితో మాట్లాడుతున్నారు?” అని అడిగేవారు. నేను ఏదో ఒక సమాధానం చెప్పి ఆ ప్రశ్న నుంచి తప్పించుకునేవాడిని.
ఆహా! అదొక అద్భుతమైన అనుభవం!
స్వామీజీ మాటలు విన్న శిష్యుడు ఆశ్చర్యపోయాడు. కొంతసేపు లోతుగా ఆలోచించి ఇలా అన్నాడు:
“స్వామీ, అయితే మీ సూక్ష్మశరీరమే అలా ఉపన్యాసాలు ఇచ్చి ఉండాలి. ఒక్కోసారి ఆ ఉపన్యాసాల ప్రతిధ్వని మీ స్థూలశరీరం నుంచి కూడా వినిపిం చి ఉండవచ్చు.”
శిష్యుడి మాటలు విన్న స్వామీజీ ఇలా సమాధానమిచ్చారు:
“అవునేమో, అలా జరిగి ఉండవచ్చు.”
కామెంట్‌లు