సామెతల ఊట- సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 

 

సామెత -384: ఈగను కప్ప మింగితే - కప్పను పాము మింగుతుంది...
***
"ఇగ్గో అవ్వా! గా కూషయ్య ఏం జేశిండో తెల్సునా? పాపం గా శిన్నవ్వని  ఎంతుసురు బెట్కుండని. లోకమంత కోడై కూత్తుంటే అవల్ దర్జాగా నన్ను గాదుపో అన్నట్టు జేశిండు."
"అవును శెల్లే.బత్కంత ఆస్రా ఉండాల్శిన మొగుడు బొయ్యి పుట్టెడు దుక్కంతో పుట్టింటికి సంటి పోరన్ని ఎంట బెట్కొని వొత్తే జీతం బత్తెం లేని పనిదాని లెక్క సూశిండు.
" గంతేగాదవ్వా! దాని పాలుకు వొచ్చిన బూవి అత్తింట్లె ఎందుకని అమ్మి మనూల్లె పెద్దొర తాన ఐదెకరాలు కొన్నడు.దాని మీద వొచ్చే పంట, రైతు బందసుమంటి  పైసలన్ని తన కీసల ఏస్కోని దొరబాబు లెక్క కాల్మీద కాలేసుకుని బత్కుతున్నడు. గందుట్ల శెల్లె ఆత్తి వుందన్న సంగతి అన్న మర్శిండు, వొదినె మర్శిర్రు అవ్వా! "
 "అవును శెల్లే! పాపం గా పొల్ల జానమ్మ వొట్టి అమాయికపుది.ఏదన్న గట్టిగడిగితే గీ మాత్రం నీడ కర్వైతదేమో నని, నోర్మూసుకుని పాశి, గీశి ఏది వెట్టినా తిని ఇల్లెడు శాకిరి శేస్కుంట బత్కుతుంది."
 "అవునవ్వా! గా కూషయ్య మావఁ శేసేది శానా శానా అన్నేలం. తోడబుట్టిన తోడు ఒక్క రకతం. గింతన్న నెనరు నాయం లేకుంటె ఎట్ల.?"
 "అయిన గని అవ్వా! గీ నడ్మల గాల్లింట్లెనే ఓ ముచ్చెటి నడుత్తుంది. నీ దన్క వొచ్చిందా? బయిటికి పొక్కనియ్యకుండ శెడ జాగర్త వడ్తుర్రు.ఎందుకంటే "శెప్పకుంటె మానం బోతది. శెప్పితే పర్వు వోతది" అన్నట్టుంది గాల్లింట్లె యవ్వారం. "
 " అవునవును శెల్లే! ఊల్లె అందరు శెవులు కొరుక్కుంటుర్రు. మాగైంది.గిసుమంటియి నాలుగు గోడల్ల దాగుతయా ఏంది ?ఎన్నాళ్ళకైన బయిటికి రానే వత్తయి. "
'నీ దన్క వొచ్చిందా అవ్వా!గా కూషయ్య మావఁ అల్లుడు కూషయ్య మావఁకి సుక్కలు సూపిత్తుండు. మూడొద్దుల కింద మావఁతో పొట్టు పొట్టు పంచాతివెట్కుండు."*'
'అయిన గని కూషయ్య మావఁ పోవడీ అస్సలు బాలేదు. పైంగ బిడ్డని అల్లుడంత ఏడ్పిత్తుంటే నోట్లో గుడ్డ గుక్కుకుని శేతులు గావు అన్కుంట బతిమాల, బామాల బట్తుండని తెల్సింది అవ్వా! "
 " అవును శెల్లే! గా కూషయ్య మావఁకి పర్వు ముక్కెమట.అయిన తాతకి వెట్టిన శిప్ప దల్లెనే ఉందంటరు గద పెద్దోళ్ళు. గా కూషయ్య మావఁ ముచ్చెటి సుత గట్లనే అయ్యింది. "
 " అవునా అవ్వా! మాగైంది. శెల్లెని వెట్టిన శెరలు ఇంక అగవడ్తేనే ఉండయి మరి. '
 "ఇగ్గో  శెల్లె అమాయికత్తాన్ని అల్సుగ తీసుకున్నడు ఆత్తంత తన పేర్న రాయిచ్చుకుండు గద. గట్లనే గిప్పుడు "ఈగని కప్ప మింగాలని సూత్తే కప్పని పాము మింగినట్టుంది గాల్ల యవ్వారం."
 "బలే శెప్పినవ్ అవ్వా! ఈగె లాంటిది. ఇష్షంటె బయవడి వోతది అన్కుండు.గట్లనే చేసిండు.గా పాపం ఊకెనే బోలె.మల్ల అల్లుని లెక్క వొచ్చి అసలుకే ఎసరు వెట్టుడు షురూ శేసింది. "
 " గందుకే అంటరు! "తాడిని తన్నేటోడుంటే గాని తలదన్నేటోడు యాన్నించో ఓ నించి వొత్తడని.. గట్లనే అయ్యింది గద గా కూషయ్య మావఁ కత గిప్పుడు."
 గదండీ సంగతి"  "ఈగను కప్ప మింగితే - కప్పను పాము మింగుతుంది" అంటే గిదే మరి. గందుకే ఒకల్కి అన్నేలం శెయ్యొద్దు గది ఎంటాడుతుంటది.మనం జేత్తే మనకి అన్నేలం జేశేటోళ్ళు సుత వుంటరని మన పెద్దోళ్ళు అంటరు. గందుకే  గట్లెప్పుడూ శెయ్యొద్దు. శేత్తుంటే సూస్కుంట ఉండొద్దు. నిలదియ్యాలె.గప్పుడే నాయం జరుగుద్ది.అంతే గదురుల్లా..." 
కామెంట్‌లు