సూర్య భగవానుడి చరిత్ర – అధ్యాయం 2: - జగదీశ్ యామిజాల
 # (సంజ్ఞకు ఎదురైన కష్టాలు)



గత అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా, అపారమైన తేజస్సుతో ఆవిర్భవించిన సూర్య భగవానుడు ప్రపంచమంతటికీ వెలుగును, జీవశక్తిని ప్రసాదిస్తూ తన దివ్య రథంపై ఆకాశంలో ప్రయాణం ప్రారంభించాడు.
రోజులు గడిచేకొద్దీ సూర్య భగవానుడి తేజస్సు అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.
కాలం గడిచింది. సూర్య భగవానుడికి వివాహం చేయాలని దేవతలు నిర్ణయించారు.
దేవలోకంలో గొప్ప శిల్పిగా పేరొందిన విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను సూర్యుడికి ఇచ్చి వివాహం జరిపించారు.
విశ్వకర్మ దేవతల కోసం ఎన్నో అద్భుతమైన భవనాలు, ఆయుధాలు, వాహనాలు రూపొందించిన మహాశిల్పి. ఆయన కుమార్తె సంజ్ఞ అపురూపమైన అందంతో మెరిసిపోయేది. అందంలోనే కాదు, మంచి గుణాల్లోనూ ఆమె ఎంతో గొప్పది.
సూర్యుడు, సంజ్ఞ తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు.
కొంతకాలానికి వారికి ముగ్గురు సంతానం కలిగారు.
వారే వైవస్వత మనువు, యముడు, యమి.
బయటకు చూస్తే ఎంతో చక్కని కుటుంబంలా కనిపించేది.
కానీ ఆ కుటుంబంలో మెల్లగా సమస్యలు మొదలయ్యాయి.
సూర్య భగవానుడు అపారమైన కాంతి, తేజస్సుతో వెలిగిపోతుంటాడని మనకు ముందే తెలుసు కదా! అదే సూర్యుడి తేజస్సు సంజ్ఞకు కష్టంగా మారింది.
రోజురోజుకూ సూర్యుడి ప్రకాశం పెరుగుతూ వచ్చింది.
ఆయన పక్కన నిలబడటమే సంజ్ఞకు చాలా కష్టంగా మారిపోయింది. అంతటి వేడి, అంతటి కాంతిని ఆమె తట్టుకోలేకపోయింది.
సూర్యుడి తేజస్సును భరించలేక సంజ్ఞ శారీరకంగా, మానసికంగా ఎంతో క్షీణించిపోయింది. తన బాధను భర్తతో మనసు విప్పి చెప్పడానికి కూడా ఆమెకు ధైర్యం చాలలేదు.
"నా భర్త దగ్గర నేను ఉండలేకపోతున్నాను" అని ఆయనకు ఎలా చెప్పాలి?
ఈ ఆలోచనతో ఆమె మనసులోనే కుమిలిపోయేది. రోజులు గడిచేకొద్దీ ఆ బాధ మరింత పెరిగిపోయింది.
చివరికి ఆమె ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకుంది.
తన నీడ నుంచే తనలాంటి మరో రూపాన్ని సృష్టించింది.
అచ్చం తనలాగే కనిపించే ఒక స్త్రీని తన నీడ నుంచి తయారుచేసింది. ఆమే సవర్ణ. ఆ తర్వాత ఆమెనే ఛాయ అని పిలిచారు.
సంజ్ఞ రూపమే ఆమె రూపం.
సంజ్ఞ గుణాలే ఆమె గుణాలు.
ఆమెను చూస్తే నిజమైన సంజ్ఞ ఎవరో, నీడ రూపంలో వచ్చిన స్త్రీ ఎవరో సూర్యుడికి కూడా గుర్తుపట్టడం కష్టమే.
ఛాయను పిలిచిన సంజ్ఞ తన మనసులోని బాధను ఆమెకు వివరించింది.
"ఇకపై నేను ఈయన తేజస్సును తట్టుకుంటూ ఇక్కడ ఉండలేను. నేను తిరిగి వచ్చేంతవరకు నువ్వు నా స్థానంలో ఉండి నా భర్తను, పిల్లలను చూసుకో.
అయితే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయిన విషయం ఎవరికీ తెలియకూడదు."
సంజ్ఞ మాటలకు ఛాయ అంగీకరించింది.
ఆ తర్వాత సంజ్ఞ తన తండ్రి విశ్వకర్మ ఇంటికి వెళ్లింది.
కానీ అక్కడ కూడా ఆమెకు మనశ్శాంతి కలగలేదు.
సూర్యుడు తనను వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో అన్న భయం ఆమెను వెంటాడుతూనే ఉంది.
చివరికి ప్రశాంతత కోసం అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.
ఆమె గుర్రం రూపాన్ని ధరించి, దూరంగా ఉన్న ఉత్తర కురు ప్రాంతానికి చేరుకుంది.
అక్కడ ఎవరికీ తెలియకుండా తపస్సు చేయడం ప్రారంభించింది.
ఇదిలా ఉంటే, సూర్యుడి ఇంట్లో మాత్రం ఎలాంటి సమస్యా లేకుండా రోజులు గడిచిపోతున్నాయి.
తనతో ఉంటున్నది నిజమైన సంజ్ఞ కాదన్న విషయం సూర్యుడికి తెలియదు.
ఆమె సంజ్ఞేనని భావిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు.
ఛాయ కూడా అచ్చం సంజ్ఞలాగే ప్రవర్తించడంతో సూర్యుడికి ఎలాంటి అనుమానం రాలేదు.
కొంతకాలానికి ఛాయకు, సూర్యుడికి సంతానం కలిగింది.
అయితే ఇక్కడి నుంచే ఆ కుటుంబంలో మరో కొత్త సమస్య మొదలైంది.
ఛాయ ఒక తల్లే అయినప్పటికీ, ఆమె మనసులో సహజంగానే ఒక తేడా ఏర్పడింది.
తనకు పుట్టిన పిల్లలపై ఎక్కువ ప్రేమను, శ్రద్ధను చూపించడం మొదలుపెట్టింది.
అదే సమయంలో సంజ్ఞకు పుట్టిన పిల్లలైన మనువు, యముడు, యమి పట్ల క్రమంగా నిర్లక్ష్యం చూపించసాగింది.
మొదట్లో ఆ తేడా చిన్న చిన్న విషయాల్లోనే కనిపించేది.
కానీ పిల్లల కళ్లకు మాత్రం ఆ తేడా తప్పలేదు.
ముఖ్యంగా యముడు తన పట్ల చూపిస్తున్న నిర్లక్ష్యాన్ని భరించలేకపోయాడు.
"అమ్మ నన్ను మాత్రమే ఎందుకు ఇలా చూస్తోంది?"
అనే ప్రశ్న అతని మనసులో మొదలైంది.
రోజులు గడిచేకొద్దీ ఆ ప్రశ్న అనుమానంగా మారింది.
"ఈమె నిజంగా నా తల్లేనా?"
అని ఆలోచించడం మొదలుపెట్టాడు.
ఒక పిల్లవాడి మనసులో ఇలాంటి ఆలోచన రావడం చిన్న విషయం కాదు కదా!
యముడి మనసులో ఇప్పుడు ఒక పెద్ద రహస్యం గురించి అనుమానం మొదలైంది.
అతను తల్లిని నిశితంగా గమనించడం ప్రారంభించాడు.
ఆమె మాట తీరు... ఆమె ప్రవర్తన... తనను, తన తోబుట్టువులను చూసే విధానం...
ప్రతిదానిలోనూ ఏదో తేడా కనిపించేది.
రోజులు గడిచేకొద్దీ అతని అనుమానం మరింత పెరిగింది. అయినప్పటికీ ఆ విషయాన్ని ఎవరితోనూ చెప్పలేకపోయాడు.
ఒకవైపు తల్లి. మరోవైపు మనసులో పెరుగుతున్న అనుమానం.
ఈ రెండింటి మధ్య యముడు ఎంతో సతమతమయ్యాడు.
కానీ అతనికి వచ్చిన అనుమానం నిజమే!
మరి ఆ నిజం ఎలా బయటపడబోతోంది? అన్నదే ఇక్కడ విధి ఆడబోయే నాటకం.
సంజ్ఞ ఇప్పుడు ఎక్కడ ఉంది?
ఆమె అసలు గుర్రం రూపం ఎందుకు ధరించింది?
యముడికి, ఛాయకు మధ్య ఎలాంటి సంఘటన జరగబోతోంది?
అన్నింటికంటే ముఖ్యంగా...
సూర్య భగవానుడికి కూడా తెలియకుండా ఇన్ని రోజులుగా దాగి ఉన్న ఈ రహస్యం చివరికి ఎలా బయటపడబోతోంది?
ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాం.
## జ్యోతిష్య పరంగా సూర్యుడి ప్రభావం
జ్యోతిష్య నమ్మకాల ప్రకారం జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే తండ్రి, పిల్లల మధ్య దూరం పెరగడం, కుటుంబంలో ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం, ఆత్మవిశ్వాసం తగ్గడం వంటి సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు చెబుతుంటారు.
జాతకంలో సూర్య దోషం ఉందని నమ్మేవారు ఆదిత్య హృదయం పారాయణం చేయడం, ఆదివారాల్లో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం మంచిదని భావిస్తారు.
తరువాతి అధ్యాయంలో ఈ కథలో మరో ఆసక్తికరమైన మలుపు గురించి తెలుసుకుందాం.
**- కొనసాగుతుంది...**
కామెంట్‌లు