1. ఏ వయసులోనైనా రాయడం మొదలుపెట్టవచ్చు. అయితే ఒకటి, రాస్తూ కొనసాగుతున్నారా లేదా అన్నదే ముఖ్యం.
2. రచయిత కావాలంటే తెలుగు రాయడం వస్తే చాలు. కాలేజీ చదువు తప్పనిసరి కాదు.
3. రచన ఒక కళ. అదే సమయంలో అదొక చేతిపని కూడా. నిరంతర సాధనతో రచనలో మీరు నైపుణ్యం సంపాదించవచ్చు.
4. అదృష్టవశాత్తూ ప్రపంచంలోని గొప్ప రచయితలు ఎలా రాయాలో మనకు చెప్పి వెళ్లారు. వారి రచనలు చదవడం ద్వారా వారి నుంచి నేర్చుకోండి.
5. చదవకుండా మీరు రాయలేరు. చదవడమే రచయితగా ఎదగడానికి తొలి మెట్టు. రాయడం కోసం చదవడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించండి.
6. రాసిన దాన్ని మళ్లీ మళ్లీ చదవండి. అవసరమైన చోట మార్పులు చేయండి. గొప్ప రచయిత టాల్‌స్టాయ్ తన యుద్ధం – శాంతి నవలను ఎనిమిదిసార్లు తిరగరాశారు.
7. ఒక పదంతో చెప్పగలిగే చోట రెండు పదాలు వాడకండి.
8. రాయడం మొదలుపెట్టేటప్పుడు ఒక నిర్దిష్ట సమయంలోగా రచన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.
9. అసాధారణమైన విషయాలను చెప్పడానికి సాధారణమైన పదాలను ఉపయోగించండి.
10. రచనలో భాషా సౌందర్యం ఒక్కటే సరిపోదు. ఆ భాష ద్వారా మీరు ఏం చెబుతున్నారన్నది కూడా చాలా ముఖ్యం.
11. మీరు చెప్పే విషయం స్పష్టంగా ఉండాలి. అందులో కొత్త ఆలోచన, కొత్త చూపు ఉండాలి. అది పాఠకుడికి దగ్గరగా ఉండాలి.
12. రాయడం మొదలుపెట్టగానే తప్పులు లేకుండా రాసేయాలని అనుకోకండి. అలా అనుకుంటే ఒక్క మాట కూడా రాయలేరు. రాస్తూ పోవాలి. ఆ తర్వాతే దిద్దుకోవాలి.
13. రచయిత కావాలనుకుంటే సరిపోదు. రాయాలి. మళ్లీ మళ్లీ రాసి చూడాలి. రాయడం ద్వారానే రచయితగా ఎదగగలరు.
14. మీరు ఏదైనా రాసి ఉంటేనే దాన్ని తిరగరాయగలరు, దిద్దుకోగలరు. అసలు ఏమీ రాయకుండా ఖాళీగా ఉన్న పేజీని ఎలా సరిచేస్తారు?
15. రచన కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోండి.
16. రోజుకు ఇన్ని పేజీలు లేదా ఇన్ని పదాలు రాయాలని ఒక లక్ష్యం పెట్టుకోండి. ఇది మీ రచనా వేగాన్ని పెంచడమే కాకుండా, ఏకాగ్రతను కూడా పెంపొందిస్తుంది.
తమిళంలో నాకిష్టమైన రచయితలలో ఒకరు ఇంద్రన్ రాజేంద్రన్. కనుక ఆయన రచనలు చదవటం అనేది సహజం. ఆయన రాసిన మాటలే ఈ పైవికూడా. ఎలా రాయాలి అనే దాని గురించి ఆయన చేసిన సూచనలివి. నాకెంతో ఉపయోగకరం.
నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో రాసిన ఓ అనువాద రచనే మొదటిసారిగా ఓ ప్రముఖ మాసపత్రికలో అచ్చయ్యింది. దాదాపు అయిదు దశాబ్దాలుగా రాస్తున్నాను. కానీ ఇప్పటికీ జంకే. ఎక్కడ పొరపాటు చేస్తానోనని. రచయిత కావటానికి సూచనలంటూ ఎక్కడైనా కంటికి కనిపిస్తే చదవటం నాకిష్టం. కానీ నేను ఇన్నేళ్ళుగా రాస్తున్నా నన్ను వదలని మాట - "భయం". ఎందుకంటే నాకు వ్యాకరణం బొత్తిగా తెలీదు. అసలా మాట వింటేనే వణుకు. నిజానికది ప్రాణం వాక్యనిర్మాణానికి. కానీ నేనది ఒంట పట్టించుకోలేదు ఎందుకనో? పట్టుమని ఓ రెండు మూడు వందల మాటలు తెలుసు. ఆ మాటల పరిధిలోనే కొట్టుమిట్టాడుతుంటాను. దాన్ని దాటి కొత్త కొత్త మాటలు రాయటం ప్రయోగించటం తెలీదు నా బుర్రకి. అందుకే నేనెప్పటికీ రాత విషయంలో ఎల్. కే. జీయే. అందువల్ల నా రాతకోతల్లో ఎవరు తప్పు చెప్పినా దిద్దుకోవడానికి సిద్ధమే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి