మనం ప్రేమించాల్సింది ఎవరిని?: - - మూలం - తమిళం (రచయిత పేరు తెలియలేదు)-- అనుసృజన - యామిజాల జగదీశ్


 ఒకరోజు ఓ వ్యక్తి రోడ్డు పక్కన వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ హడావుడిలో ఎదురుగా వస్తున్న మరో వ్యక్తిని పొరపాటున ఢీకొన్నాడు.
“అయ్యో! చూసుకోలేదు. క్షమించండి” అన్నాడు.
“పర్వాలేదులెండి” అంటూ అవతలి వ్యక్తి చిరునవ్వుతో బదులిచ్చాడు.
ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుం టూ, నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిన్న పొరపాటు వల్ల మనసులు నొచ్చుకునే పరిస్థితి రాలేదు.
ఆ రోజు రాత్రి ఆయన ఇంటికి వచ్చాడు.
భోజనం ముగించుకుని వెనక్కి తిరుగుతుండగా, చేతులు వెనక్కి కట్టుకుని తన వెనకాలే నిలబడి ఉన్న కొడుకు ఆయనకు కనిపించలేదు. పొరపాటున కొడుకును ఢీకొన్నాడు.
“దారిలో అడ్డంగా నిలబడతావేంటి? పక్కకు పో!” అని అరిచాడు.
ఆ మాటల్లో కోపం నిప్పులా రగిలింది.
ఆ చిన్నారి ముఖం ఒక్కసారిగా వాడిపోయింది. బాధతో అక్కడి నుంచి నెమ్మదిగా పక్కకు వెళ్లిపోయాడు. కళ్లలో దుఃఖం నిండింది. కన్నీళ్లు కళ్ల అంచుల్ని దాటి జారడం మొదలుపెట్టాయి.
ఆ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆయన మనసులో ఓ ఆలోచన మెదిలింది.
‘రోడ్డుపై పరిచయం లేని వ్యక్తిని పొరపాటున ఢీకొన్నప్పుడు ఎంత మర్యాదగా, ఎంత ప్రేమగా మాట్లాడాను! అలాంటిది, నా సొంత కొడుకుతో మాత్రం ఎందుకలా ప్రవర్తించలేకపోయాను?’
ఆ ఆలోచన ఆయన మనసును కలచివేసింది.
వెంటనే లేచి కొడుకు పడుకున్న గదికి వెళ్లాడు.
లోపలికి వెళ్లి చూస్తే, ఆ చిన్నారి ఇంకా నిద్రపోలేదు. వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి కళ్లు ఎర్రబారిపోయాయి.
తండ్రి కొడుకు పక్కన మోకాళ్లపై కూర్చుని, ఆప్యాయంగా ఇలా అన్నాడు.
“నన్ను క్షమించరా నాన్నా! నీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. నిన్ను బాధపెట్టినందుకు నన్ను క్షమించు.”
తండ్రి మాటలు విన్న ఆ చిన్నారి వెనక్కి తిరిగాడు.
అంతవరకు బాధతో నిండిన అతని ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. లేచి కూర్చున్నాడు.
వెంటనే మంచం మీద నుంచి కిందకు దూకి, మంచం కింద దాచిపెట్టిన పూలగుత్తిని తీసి తండ్రి చేతుల్లో పెట్టాడు.
“ఇదేంటి నాన్నా?” అని ఆశ్చర్యంగా అడిగాడు తండ్రి.
“ఈరోజు బయటికి వెళ్లినప్పుడు నాకు ఈ పువ్వులు కనిపించాయి. రకరకాల రంగుల్లో ఉన్న పూలను ఏరుకుని, మీ కోసం ఈ పూలగుత్తిని తయారు చేశాను.
మీకు నీలం రంగంటే చాలా ఇష్టం కదా! అందుకే నీలం రంగు పూలను ఎక్కువగా ఏరుకున్నాను.
ఈ విషయం మీకు ఒక రహస్యంలా చెప్పాలని, మిమ్మల్ని ఆశ్చర్యపరచా లని మీ వెనకాల వచ్చి నిలబడ్డాను నాన్నా…” అని ఆ చిన్నారి అమాయకంగా చెప్పాడు.
ఆ మాటలు విన్న తండ్రి గుండె కరిగిపోయింది.
తనను సంతోషపెట్టాలని ఆశతో ఎదురుచూసిన కొడుకును తానే బాధపెట్టానని తలచుకుని కుమిలిపోయాడు.
కొడుకును, ఆ పూలగుత్తిని ఒకేసారి గుండెలకు హత్తుకున్నాడు. ఆయన కళ్ల నుంచి కన్నీళ్లు జారాయి.
ఒక పసిమనసులో దాగున్న ప్రేమను గుర్తించలేకపోయినందుకు ఆయన మనసు బాధతో నిండిపోయింది.
కుటుంబం అంటే దేవుడు మన కోసం ఈ భూమ్మీద ఏర్పాటుచేసిన స్వర్గం.
ఆ స్వర్గాన్ని ప్రేమతో నింపుకోవాలా, బాధలతో నరకంలా మార్చుకోవాలా అన్నది మన చేతుల్లోనే ఉంది.
డబ్బు సంపాదించాలనే పరుగులో మనం కోల్పోతున్నది విలువైన ఆనందపు క్షణాలేనని గుర్తుంచు కోవాలి.
ఒక్కసారి ఆలోచించండి…
రేపు మనం లేకుండా పోతే, మనం పనిచేసే కార్యాలయం కొద్ది రోజుల్లోనే మన స్థానంలో మరో వ్యక్తిని వెతు క్కుంటుంది. కానీ మన కుటుంబం అలా కాదు.
మనల్ని కోల్పోయిన బాధ వాళ్ల గుండెల్లో చెరిగిపోని గాయంలా మిగిలిపోతుంది. ఆ జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తొచ్చినప్పుడల్లా ఆ గాయం బాధపెడుతూనే ఉంటుంది.
జీవితంలో అన్నీ ఉన్నా, వాటిని నింపే ప్రేమ లేకపోతే జీవితం వెలితిగానే మిగిలిపోతుంది.
డబ్బుంటేనే సంతోషంగా ఉండగలమని తరతరాలుగా మనకు నేర్పిన మాట నిజం కాదు.
సంతోషాన్ని చదరపు అడుగుల్లో కొనలేం. ఖరీదైన ఇళ్లలోనే ఆనందం ఉంటుందనుకోవడం పొరపాటు. కొద్దిపాటి సౌకర్యాలతో జీవించే పేద కుటుంబాల్లో కనిపించే ఆప్యాయత, అనుబంధం, తృప్తి… ఎంతో సంపద ఉన్నవాళ్ల జీవితాల్లోనూ కొన్నిసార్లు కనిపించవు.
కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి.
డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడతారో, ప్రేమను సంపాదించు కోవడానికి అంతకంటే ఎక్కువ శ్రద్ధ చూపండి.
ఎందుకంటే…
మనల్ని ప్రేమించే మనుషులే మన జీవితంలో నిజమైన సంపద.
మన కోసం ఎదురుచూసే కుటుంబమే మన నిజమైన స్వర్గం.
కామెంట్‌లు