సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 ప్తిక పర్వము ప్రథమాశ్వాసము-436 వ రోజు


అశ్వత్థామ తన నిశ్చయమును కృపాచార్యునకు వినిపించుట

అశ్వత్థామ తననిశ్చయమును చెప్పడానికి కృపాచార్య, కృతవర్మలను లేపి " మిత్రమా కృతవర్మా ! మామా కృపాచార్యా ! రారాజును ఒక్కడిని చేసి ఆ పాండవులు సుయోధనుడిని అధర్మంగా కూల్చారు. పదకొండు అక్షౌహినుల సైన్యములకు అధిపతి అయిన సుయోధనుడు దీనుడై నేల పడి ఉన్నాడు. ఆ పాపాత్ముడు భీముడు సుయోధనుడిని కాలితో తన్నాడు. మనం ఉండీ సుయోధనుడు దిక్కు లేని వాడు అయ్యాడు. మనమిప్పుడు ఏమి చేయాలో ఆలోచించండి " అన్నాడు.
కృపాచార్యుడు అశ్వత్థామకు ధర్మాధర్మములు చెప్పుట
కృపాచార్యుడు " అశ్వత్థామా ! నీమసులో మాట చెపితే విని మా మాట చెప్తాము. ముందుగా నేను కొన్ని మాటలు చెప్తాను విను. ఏ పనికైనా పురుష ప్రయత్నము, దైవసహాయం కావాలి. ఏ ఒక్కదానితో కార్యము సానుకూలము కాదు. దేవతలు అనుకూలించి వర్షం కురిపించినా రైతు విత్తనదే మొలకెత్తదు కదా ! అలాగే రైతు విత్తినా దైవం అనుకూలించి వర్షం కురిపించకున్న మొలకెత్తి ఫలితాన్ని ఇవ్వదు. కనుక పురుష ప్రయత్నం, దైవసాయం రెండూ చేరి కార్యసానుకూలతను ఇస్తాయి. ధర్మం తప్పక చేసే ఏపనికైనా దైవసాయము ఉంటుంది. కనుక కార్యం సానుకూలమౌతుంది. అధర్మంతో చేయు పనులు ప్రారంభంలో సుఖములు ఇచ్చినా తరువాత పడవేస్తాయి. అదే మన సుయోధనుడి విషయంలో జరిగింది. సుయోధనుడు లోభం, కోపం, అసూయ, అహంకారంతో ద్రౌపదిని సభకీడ్చి అవమానించాడు. అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నాడు. మనం ధర్మం తప్పక కార్యం నెరవేర్చాలి. ముందుగా మనం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి అతడికి గాంధారికి విషయం చెప్పి వారు ఏమి చెప్పిన అది చేస్తాము. వారు చెప్పిన మాట ధర్మబద్ధం ఔతుంది కాని ధర్మవిరుద్ధం కాదు. కాబట్టి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో " అన్నాడు.
అశ్వత్థామ శపధం
అశ్వత్థామ కృపాచార్యునితో " మామా ! ధర్మం దేశకాల పరిస్థితులను అనుసరించి మారుతూ ఉంటుంది. దరిద్రంలో ధర్మమనిపించింది ధనవంతుడుగా అధర్మం ఔతుంది. కనుక నేను నమ్మిందే ధర్మం. దానిని నేను నా మరణానికి వెరువక ఆచరిస్తాను. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టి నా దౌర్భాగ్యం కొద్దీ విల్లు పట్టాను. క్షాత్రం అవలంబించాను. ఇంత కాలం తరువాత మరలా నేను బ్రాహ్మణ్యం వంక మరలడం నాకు చేత కాదు. అస్త్రసన్యాసం చేసిన నా తండ్రిని దారుణంగా చంపినవాడు బ్రతికి ఉండగా నేను ఎలా ప్రాణంతో ఉండగలను. ఈ రోజు నా తండ్రిని చంపిన దుర్మార్గుడిని అతని బంధువులతో సహా ఏ ఉపాయంతోనైనా హతమారుస్తాను. నా శత్రువులు విజయోత్సాహంలో తేలియాడి ఆనందంగా అలసి సొలసి ఆదమరచి నిద్రిస్తున్నారు. వారిని సంహరించడానికి ఇదే తగిన సమయం. పైగా మనం బ్రతికి ఉన్నామని వారికి తెలియదు నేను వచ్చి వధిస్తానని ఊహించి ఉండరు కనుక ఏమరుపాటున ఉన్న వారి మీద విరుచుకు పడి పీకలు కోసి దారుణంగా చంపి వారి శిబిరాలను పీనుగుల పెంట చేసి భూతములకు ఆహారంగా వేస్తాను. నా తండ్రిని చంపిన వాడి శరీర భాగాలు ఆ పీనుగుల పెంటల మధ్య చెల్లాచెదురుగా గజాశ్వకళేబరాలతో పడి ఉండటం నేను కళ్ళార చూడాలి " అన్నాడు అశ్వత్థామ. అంతా శాంతంగా విన్న కృపాచార్యుడు " అశ్వత్థామా ! నీకు అపకారం చేసిన వాడిని హతమార్చాలని అనుకున్నావు. నీవు దానికి ఒక మార్గం అవలంబిస్తున్నావు. దానికి అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉండి నీకు తోడ్పాటును అందిస్తాము. ఈ రాత్రికి విశ్రమించి రేపు ఉదయం మన ప్రయత్నాలు ప్రారంభిస్తాము. నీవు ద్విగుణీకృత ఉత్సాహంతో శత్రువులను గెలువగలవు. నీవు యుద్ధ భూమిన నిలిచిన నిన్ను గెలువగల వారు ఎవ్వరు. ఇక నాగురించి చెప్పపని లేదు. కృతవర్మ అమిత శౌర్యవంతుడు, అస్త్రకోవిదుడు, బలాఢ్యుడు. ఇక ఆ కవచము విడిచి కొంత విశ్రాంతి తీసుకో. రేపు ఉదయం పాండవులను ఎదుర్కొని వారిని చంపుట లేక వారి చేతిలో మడయుట ఏదో ఒకటి నిశ్చయం " అన్నాడు కృపాచార్యుడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి
కామెంట్‌లు