నేను సైతం.....! ఇవాళ ప్రపంచ రంగస్థల దినోత్సవం . మలకపేట ప్రభుత్వ పాఠశాలలో స్కూల్లో చదువుకునే రోజుల్లో 10 వ తరగతిలో వుండగా అనుకుంటా మొదట ' పన్నా " అనే చారిత్రక హిందీనాటకంలో సైనికుడిగా ఒక హాస్యపాత్రలో నటించాను. ఆ తరువాత ఆంధ్ర బాలానందసంఘం రవీంద్రభారతిలో నిర్వహించిన నాటక పోటీలలో నల్లకుంట శాఖ విశ్వకవి విజ్నాన కేంద్రం తరుఫున ' సతీ సక్కుబాయి ' నాటకంలో సక్కుబాయి గురువుగా నటించాను. నేనే స్ఠాపించిన అమర్ జవహర్ బాలానంద సంఘం తరుఫున ఒకసారి మా కాలనీ గణపతి నవరాత్రి ఉత్సవాలలో ' ఏక్ దిన్ కా సుల్తాన్ ' నాటకం వేశాం.అలాగే ఆదివిష్ణు రాసిన 'వాంటెడ్ ఫాదర్స్ 'కూడా. విశ్వనాథ సూర్యనారాయణ (ప్రముఖ స్త్రీ వాద కవయిత్రి జయప్రభ భర్త ) నేనూ, స్నేహితులుగా అలా కొన్ని నాటకాలు వేశాం. రంగస్థలంపై రంగు పూసుకు వేసిన నాటకాల సంగతే చెబుతున్నాను.రేడియోలో శ్రవ్య నాటికలు బోలెడు వేశాం.నాటక రచయితగానూ పలు నాటికలు,రూపకాలు రాసాను కూడాను. అకాశవాణి లో చేరాక కూడా రెండు మూడు నాటకాలు రంగస్థలంపై వేశాను. కీ.శే.తురగా జానకీరాణి గారు రాసిన ఒక నాటకం రవీంద్ర భారతిలో 1984 లో వేసినప్పటి ఫొటో ఇది. (కర్టెసీ: పుట్టపర్తి నాగపద్మిని) నాటకం పేరు సరిగా గుర్తు లేదు. ఫోటొలో కుడి నుంచి ఎడమకు మీ సుధామ, కళాకృష్ణ ,కీ.శే.వట్టం సత్యనారాయణ (రేడియో కార్మికుల కార్యక్రమం ఏకాంబరం,) శ్రీమతి. రతన్ ప్రసాద్ (రేడియో చిన్నక్క) ,నాటక రచయిత్రి కీ.శే.తురగా జానకీరాణి ,శ్రీమతి జొన్నలగడ్డ శకుంతల (రిటైర్డ్ దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ ),డాక్టర్.పుట్టపర్తి నాగపద్మిని (రిటైర్డ్ దూరదర్శన్ అసిస్టెంట్ డైరెక్టర్ ,రచయిత్రి ,పుట్టపర్తి నారాయణాచార్యులగారి అమ్మాయి) .అలా రేడియోలో వుండగా రంగస్థలంపై నాటకాలలో వేషం కట్టిన సందర్భాలున్నాయి. ఆ తరువాత రంగస్థలంపైనే పలుమార్లు సాహిత్య రూపకాలలో ' త్రిభువన విజయం' లో మహాకవి శ్రీశ్రీ గా,'గురజాడ దర్బార్' లో రచయిత ,విమర్శకులు తాపీ ధర్మారావ్ గా హాస్య దర్బార్ లో ముళ్ళపూడి వెంకటరమణ గా పాత్రలు పోషించాను. జీవితమే ఒక నాటకరంగం అన్నారు కదా రంగస్థల దినోత్సవం అని ఊరికే తలపోసుకుంటున్న కాలక్షేపం కబుర్లివి .... అంతే! .- సుధామ


కామెంట్‌లు