మానేరుముచ్చట్లు--నిన్నటి ముచ్చట్లలో వేములవాడ చాళుక్య రాజైన రెండవ అరికేసరి ఆశ్రయంలో ఉన్న పంపని గురించి,అతని తమ్ముడు జినవల్లభుని గురించి కొంత తెలుసుకున్నాము.్లాగే వచ్చి చేరిన మరొక కవి సోమదేవసూరి. ఇతను ఘూర్జరభూమి అంటే నేటి గుజరాత్ రాష్ట్రం నుండి వచ్చినవాడు.అయితే సోమదేవసూరి విశేషమేమిటంటే ఇతడు రెండవ అరికేసరి కాలం వచ్చి,అతని కొడుకు వాగరాజు కాలంలోను,మనుమడు మూడవ అరికేసరి కాలం లోనూ ఉన్నట్టుగా ఆధారాలున్నాయి.వయసులో తేడాలున్నప్పటికీ, పంపన,జినవల్లభుడు,కవిజనాశ్రయకర్త మల్లియ రేచన మరియు రెండవ అరికేసరి సమకాలి కులు.అలాగే కవిజనాశ్రయమనే ఛందో గ్రంథాన్ని రచించిన మల్లియ రేచన జినవల్లభుని మిత్రుడు.ఈయన కంద పద్యాలలో ఛందశ్శాస్త్ర గ్రంథం రచించాడు.కందం పుట్టిన నేల కరీంనగరం అన్నట్టుగా ముందు జినవల్లభుడు తన శాసనంలో మూడు కంద పద్యాలతో నాంది వాచకం పలికితే అతని మిత్రుడు ఏకంగా కావ్యమే రచించాడు.నిజానికి కవిజనాశ్రయమే తొలి తెలుగు గ్రంథం.మల్లియ రేచనకు శ్రావకాభరణుడు అనీ జినవల్లభునికి వాచకాభరణుడు అనీ బిరుదులు న్నట్లుగా ఆ శాసనమూ మరియు ఈ పుస్తకం వల్ల నిరూపితమౌతున్నది.ఇవి జైన సంప్రదాయానికి సంబంధిచిన బిరుదులనవచ్చు.మల్లియ రేచన రచించిన కవిజనాశ్రయము ఛందస్సుకు సంబంధించిన లక్షణ గ్రంథము.ఇందులో 1.సంజ్ఞాధికారము 2.వృత్తాధికారము,3.జాత్యధికారము, 4.షట్ప్రత్యయాధికారము,5.దోషాధికారము అను ఐదు విభాగములు ఉన్నవి. ఇటీవల తెలంగాణా సాహిత్య పరిశోధన కేంద్రము వెరగున ఆచార్య ఎస్వీ రామారావుగారి సంపాదకత్వంలో వెలువడింది.ఇందులో వారు సమగ్ర సమాచారాన్ని పొందుపరచటం ఆధునిక జిజ్ఞాసువులకు ఉపయుక్తకరం. వారి పుస్తకమునుండి కొంత సమాచారాన్ని నేనందించగలిగి నందుసకు వారికి కృతజ్ఞుణ్ని. రెండవ అరికేసరి తరువాత అతని కుమారుడు వాగరాజు (955-960)తన రాజధానిని వేములవాడనుండి సమీపమున నున్న గంగాధరకు మార్చి పరిపాలించాడు.ఈయనకాలంలోనే సోమదేవసూరి గంగాధరన తన స్థిర నివాసం చేసుకుని యశస్స్తిలక చంపువును క్రీస్తు శకము 959 లో రచించాడు.ఇది సంస్కృతంలో లిఖించబడిన ఎనిమిది ఆశ్వాసాల జైన మత సంప్రదాయ గ్రంథం.ఇందలి కవిత్వం సులభ సుందరంగా ఉంటుంది.సోమదేవసూరి వాగరాజు కమారుడైన రెండవ బద్దెగునికి విద్యా గురువు కూడా.బద్దెగుడు తన గురువు కోసం క్రీ.శ.966 లోశుభదామజినాలయం నిర్మించడ దానికి స్థానాధిపతిని చేశాడు. బద్దెగుని తరువాత అతని కుమారుడు మూడవ అరికేసరి రాజ్యాధికారం చేపట్టి మళ్లీ రాజధానిని గంగాధరనుండి వేములవాడకు మార్చాడు.ఇతని పరిపాలనాకాలం 966 నుండి 973 వరకు.ఇతని కాలంలో వేములవాడ సమీపంలో గల రేపాక లో జినాలయానికి చెందిన శాసనం ఉంది. మల్లియ రేచన కూడా ఇతని కాలం వరకు ఉన్నాడు.వేములవాడ చాళుక్యులలో చివరి రాజు మూడవ అరికేసరి.అలా క్రీ.శ.973 వరకు ఎలగందుల ప్రాంతం వారి అధీనంలో ఉందని భావించవచ్చు.-రామ్మోహన్ రావు .తుమ్మూరి


కామెంట్‌లు