వేసవిశలవులలో ఆఫీసు వర్క్ చేయడానికి రోజూ స్కూలుకు వచ్చేవాడను. నాన్-టీచింగ్ స్టాఫ్ కూడా నాతో వచ్చేవారు. ఒకనాడు ఒక వ్యక్తి నా ఆఫీసు రూంకు ఎదురుగా రెండు వందల గజాల దూరంలో నిల్చొని ఇద్దరు వ్యక్తుల తో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే వ్యక్తి రాజకీయ నాయకుడిలా ఉన్నాడు. అతనికి ఎదురుగానున్న ఇద్దరు వ్యక్తులు కూలి వాళ్లలా ఉన్నారు. ఇంతలో మా రికార్డు అసిస్టెంట్ వచ్చి " సర్ ! మీకు ఎదురుగా ఆ పాకల దగ్గర నిల్చున్న వ్యక్తి ఈ ఊరు రైతు సంఘనాయకుడండీ. అతని పేరు ' బాబ్జీ' . మన పాఠశాలకు ఏ పని కావాలన్నా అతనే చేస్తారండీ. మన స్కూలు పిల్లలు కూర్చునేందుకు అయిదు సెక్షన్ లకు గదులు చాలవు. ప్రతీ సంవత్సరం ఆ ఐదు సెక్షన్ల పిల్లలకు అక్కడ ఐదు పూరిపాకలు రెళ్ళు గడ్డితోవేయిస్తారు. మన స్కూలు ఫంక్షన్లలో కూడా పాల్గొంటారు." అని రికార్డు అసిస్టెంట్ ఇంకా ఏవేవో చెప్పబోతున్నాడు. ఇంతలో ఆ నాయకుడు తనతో వచ్చిన కూలీలతో వెళ్లిపోతున్నాడు " పిలవమంటారా సర్ ! " అన్నాడు రికార్డు అసిస్టెంట్. వద్దనేసాను. స్కూలు అభివృద్ధికి పాటుపడుతున్న నాయకుడని ముందుగా తెలిస్తే నేనే ముందుగా వెళ్లి కలిసే వాడిని. ఇంతవరకూ ఆ రాజకీయ నాయకుడు మనకెదురు గానే ఉన్నాడు. ఎవరో మనకెందుకులే అని పలకరించలేదు.ఇప్పుడు వెళ్లిపోతున్న వ్యక్తిని పిలవడమెందుకు ? తరువాత పాఠశాలకు వచ్చినప్పుడు కలవొచ్చులే అనుకున్నాను. మా రికార్డు అసిస్టెంట్ ఇంకా కొన్ని విషయాలు చెబుతూ " ప్రస్తుత మండల ప్రెసిడెంట్, మాజీ జిల్లాపరిషత్ ఛైర్మన్ గారైన వాకాడ నాగేశ్వరరావుగారికి ఆప్తుడు ఈ బాబ్జీగారు.ఈ ఇద్దరూ రాజకీయంగా ఎప్పుడూ కలిసిమెలసి ఉంటారు. కలిసిమెలసి పనులు చేస్తారు." అన్నాడు. అహా అలాగా ! అన్నాను. కానీ వాకాడ నాగేశ్వరరావు నా క్లాస్-మేట్‌ అని గానీ, నా స్నేహితుడనిగానీ నేను ఆ రికార్డు అసిస్టెంట్ కు చెప్పలేదు. నేను శలవుల్లో ఆఫీసుకు రోజూ తొమ్మిది గంట లకు వచ్చి పనులన్నీ చూసుకుని ఒంటి గంటకు ఇంటికి వెళ్ళేవాడిని. రెండు రోజులు పోయిన తరువాత బాబ్జీగారు, పదిమంది కూలీలు, ట్రాక్టరుతో రెల్లుగడ్డితో వచ్చి పని చేయి స్తున్నారు . నేను తొమ్మిది గంటలకు వచ్చాను. అతని దగ్గరకు వెళ్ళి పలకరించాను. బాబ్జీగారు చాలా సంతోషించి " మీ క్లాస్-మేట్‌, ఫ్రెండ్ వాకాడ నాగేశ్వరరావు మీ గురించి అంతా చెప్పాడు. పాఠశాల ను జాగ్రత్తగా చూస్తారట. బలిజి పేటలో ఉన్నప్పుడు ప్రజల సహకారంతో పాఠశాలను చాలా అభివృద్ధి చేసి మొదటి జన్మభూమిలో జిల్లా ఫస్ట్, స్టేట్ ఫస్ట్ తెచ్చారట ! చాలా సంతోషం. మా పిల్లలకోసం మీరు కష్టపడుతున్నారు. ఏ సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తాం " అన్నారు. థాంక్స్ చెప్పాను. ఈ పని అయిన తరువాత ఒకసారి నా ఆఫీసు రూంకు రండి. అలానే అప్పుడప్పుడూ పాఠశాలకు వచ్చి పోతుండండి అన్నాను. " " అలానే వస్తాను కానీ ప్రస్తుతం కాదు. మీ ఫ్రెండ్ నాగేశ్వర రావు నేనూ ఏదో రోజున తప్పనిసరిగా కలసి వస్తాం.ఇంతకీ మీరు ఉంటుండగా మా అవసరం స్కూలుకు ఉండదు. " అన్నారు బాబ్జీగారు. ఈ ఊరు మీది. ఈస్కూలు మీది. పిల్లలు మీవారు. వారు బాగుపడాలనే కోరిక నాయకునిగా మీకు ఉంటుంది. తరువాత మాకు ఉంటుంది.మొత్తం పై ఇద్దరిదీ బాధ్యత. మీ సహకారం మాకు ఎప్పుడూ ఉండాలి. అని చెబుతూ ఆఫీసు రూంకు వచ్చేసాను. తరువాత మూడు, నాలుగు రోజుల్లో వేసవి శలవులు అయిపోయాయి. పాఠశాల రీ- ఓపెనింగ్ అయింది. నాకంటే ముందుగా హెడ్మిష్ర్టస్ ఉండేవారని చెప్పాను.ఆమె చాలా అమాయకు రాలు. పైగా భయస్థు రాలనీ, ఒక సీనియర్ టీచర్ తగాదా కోరనీ, ఎవరికైనా మంచి జరిగితే చూడలేకపోయేవాడనీ, ఈర్ష్య, ద్వేషాలతో కొట్టుమిట్టాడుతుంటాడనీ విన్నాను. ఆ టీచర్ బ్రతుకంతా అవతలివాడి విషయాలు ఇవతలి వాడికి చేరదీయడం, ఇవతలివాడి విషయాలు అవతలి వాడికి చేరదీసి తగాదాలు పెట్టడమే తన పనట.మరికొంత మంది టీచర్లు ప్రాంతీయ, జాతి,కుల వైషమ్యాలతో తిట్టు కుంటూ ఉండేవారనీ టీ, టిఫిన్ లకు, హోటళ్ళకు, ఎస్. టి.డీ బూతులకు ఫోన్ చేద్దామంటూ వీధిలోకి వెళ్లి వాళ్ళ పీరియడ్ చివర్లో వచ్చేవారట. అలానే ఏవో కారణాలు చెప్పి స్కూలుకు లేటు రావడం చేసేవారట. ఇటువంటి అస్థవ్యస్థ పరిస్థితులు పాఠశాలలో కోకొల్లలుగా ఉన్నాయని నాన్- టీచింగ్ స్టాఫ్ ద్వారా విన్నాను. అలానే అటెండరు, నైట్-వాచర్ లు గుమస్తా, రికార్డు అసిస్టెంట్ ఎటువంటివారో చరిత్రంతా ఒకరిమీద ఒకరు చెప్పుకొచ్చారు. ఇక గుమస్తా, రికార్డు అసిస్టెంట్ లు నైట్ వాచర్ , గార్డెనర్ పై చెప్పుకొచ్చే వారు. ఇలా విషయసేకరణ జరిగింది. అయినా నేను అన్ని విషయాలను మనసులో ఉంచుకుని వాళ్ళ చర్యలను పరిశీలించేవాడిని. ఎందుకంటే ఒకరంటే ఒకరికి పడక చెప్పొచ్చు. గార్డెనర్ రెండు, మూడు రోజుల్లో జీతాలందు తాయనగా నా దగ్గరకొచ్చి నైట్-వాచర్ .గునపాం, పార, బొరిగెలు, బకెట్ లు తన ఇంటి దగ్గర ఉంచుకున్నాడు ఇమ్మంటే ఇవ్వకుండా ఉన్నాడండీ. నేను మొక్కలు ఎలా నాటుతానండి అంది. నైట్- వాచర్ ను పిలిచి అడిగాను గార్డెనర్ ఇలా అంటుందని. ఇంటి దగ్గర వెతుకుతానన్నాడు. వెతకడం కాదు.గంటలో తెచ్చివ్వాలి.నివ్వు ఇంట్లో దాచినవి తెచ్చిస్తావో? బజారుకెళ్ళి కోనేసి తెస్తావో నాకు తెలియదు గంటలో ఇక్కడ వస్తువులు ఉండాలన్నాను. ఇకనుంచి పాఠశాల వస్తువులు పాఠశాలలోనే ఉండాలి. అలా కాని పక్షంలో ఆ వస్తువు ఖరీదుకు మరి రెండింతలు కట్టవలసి ఉంటుందని చెప్పాను. పాఠశాల సామగ్రి ఇంట్లో పెట్టు కోవడం ఒక నేరం. గార్డెనర్ పనికి ఆటంకం కలిగించడం మరో నేరం. నీవు గార్డెనర్ కు మొక్కలు వెయ్యడంలో సహాయం చేసి, బోర్ లో నీరు బకెట్ కు నివ్వే కొట్టి గార్డెనర్ కు ఇచ్చి, మొక్కలకు పోయించి బ్రతికించాలన్నాను. అలా అనేసరికి మొక్కలను నాటి, నీరు పొయ్యమంటే పోస్తాను గానీ మొక్కలు బతికించడం నా చేతిలో లేదండయ్యా అన్నాడు. మొక్క బ్రతకడం బ్రతకకపోవడం నీవు నాటే విధానాన్ని బట్టి, నీరుపోయడాన్నిబట్టి, ఆ నేల సారాన్ని బట్టి, వాటికి నీవు కల్పించే రక్షణను బట్టి ఉంటుంది. నీవు నైట్- వాచర్ వి కాబట్టి పశువులు, పందులు, మేకలు, కోళ్లు రాకుండా చూడాలి. పాఠశాల పనిరోజుల్లో పగలంతా గార్డెనర్ కాపలా ఉంటుంది. మిగిలిన కాలం పాఠశాల ఆస్థులకు కాపలా దారుడవు నీవే కదా ! మన స్కూల్ తరగతి గదుల ముందు నుండి బళ్ళు పరిగెత్తించి తీసుకువెళ్తుంటే అంతా చూస్తున్నా రు గానీ వారినినిలువరించగలిగే ప్రయత్నం చేయలేదు. పాఠశాల అంటే ప్రతీ ఒక్కడికీ అలుసైపోయింది. మరి పిల్లలకు ఏమైనా జరిగితే బాధ్యు లెవరు ? బండ్లను పాఠశాల గుండా రావొద్దని వచ్చేవారికి చెప్పండి. వారు మన మాట వినకపోతే ఊరు పెద్దలముందు పెడదాం అని చెప్పాను. మీరు ఎవరి దగ్గరా జడవ వలసిన అవసరం లేదు. ఇక పిల్లలు ఆడుకొనే ప్లే గ్రౌండ్ పశువులు పచ్చగడ్డి మేసే " గ్రీన్ లాండ్ " లా ఉంది. అంతా చూస్తుంటే మన స్కూలు మనది కాదు. మనఇల్లు మనదికాదు. అంతా పరాధీనమే ! మనకు బాధ్యత లేదు. మన పనులు మనం చెయ్యం.ఫస్ట్ వచ్చేసరికి మన జీతాలు మనకు వచ్చేయాలి. మన వస్తువులు మనం కొనుక్కోం. ప్రభుత్వ ఆస్థులతోనే బ్రతికేయాలి. పెద్దవాళ్లమైపోవాలి. ఇవీ మన నీచాతినీచ మైన బ్రతుకులు. మనుషులు మారండి. తిండి కోసం జంతువులు రోజంతా ఎండలో, వర్షంలో, చలిగాలుల్లో తిరుగుతాయి. మనం మాత్రం ఏమీ కష్టపడకూడదు.కూర్చొని జీతాలు అందుకు తినాలి. అలా చెయ్యడానికి మనకు సిగ్గు, లజ్జా ఉండాలి. ఈరోజు నుండి ఎవరి పనులువారు చెయ్యండని సీరియస్ గా చెప్పి పంపించేసాను. ( సశేషం )-- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి ఫోన్: 701 3660 252.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
తెలుగు సాహిత్యము-కాసె సర్వప్ప కవి--తెలుగు సాహిత్యంలో కవిగా పేరు పొందిన వాడు కాసె సర్వప్ప కవి. ఈయన ఛందోబద్ధముగ, కవిత్వ లక్షణాలతో రాయ లేకపోయినప్పటికీ, ఇతడు రాసిన ద్విపద కావ్యం తర్వాత కాలం కవులకు కవిత్వం వ్రాయడానికి ఆధారమైంది. ఈయన రాసిన సిద్దేశ్వర చరిత్రమను నామాంతరం గల ప్రతాప చరిత్రమను ద్విపద కావ్యంగా ప్రసిద్దికెక్కింది.ఈ కావ్యమును అనుసరించి కాల నిర్ణయము చేయుట కష్టమని చరిత్ర కారులు అంటారు. కానీ ఈ కావ్యం చాలా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ గ్రంథము తర్వాత కాలంలో కూచిమంచి జగ్గకవి తను రాసిన సోమదేవ రాజీయ మునందు సర్వప్ప రాసిన ప్రతాప చరిత్రమను గ్రంధము నుండి అధిక భాగము సేకరించి యున్నాడు. అలాగే ప్రసిద్ధ కవి తిక్కన సోమయాజి చరిత్రమునందీ గ్రంధము నుండి చాలా భాగము ఉదహరించి రాసినాడు. ఇందుగల కొన్ని పంక్తులు గ్రహింపబడినవి. ద్విపద:- గణ ప్రసాదత గలిగిన సుతుని/గణపతి నామంబు ఘనముగా బెట్టి/తూర్పు దేశం బేగి తూర్పు రాజు లను/నేర్పుతో సాధించి యోర్పు మీరంగ/బాండు దేశాధీశు బాహు బలాఢ్యు/గాండంబులనుగొని గం డడగించి/చండవిక్రమ కళాసార దుర్వార/పాండిత్య ధనురస్త్రభద్రు డారుద్రు// ***. ***. ***. *** ఇది శ్రీసకలవిద్వదిభ పాద కమల/ సదమల సేవన సభ్యసంస్మరణ/భాసురసాధు భావనగుణానూన/భూసురాశీర్వాద పూజనీయుం డు/ కాసె మల్లన మంత్రి ఘనకుమారుండు/ వాసిగా జెప్పె సర్వప్పనునతడు.// కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర మరియు ప్రతాప చరిత్రము ఈ గ్రంథము కాదని వేరు వేరు గ్రంథాలని, కొందరు సాహితీ విమర్శకులు అంటారు. వాస్తవానికి ఈ కవి యొక్క ఇతర గ్రంథాలు కాలాదులు నిర్ణయించడానికి సరైన ఆధారాలు లేవు. కవిగా చరిత్రలో నిలిచాడు. *****. *****. *****. *****. ***** "*తెలుగు సాహిత్యము - భాస్కర పంతులు*" తెలుగు సాహిత్యములో భాస్కర పంతుల్ని ఒక కవిగా చెప్పుకుంటారు . ఈయన భాస్కరపంతులు కాదని భాస్కరాచార్యుడు అని కూడ తెలుస్తుంది. ఈ కవి తండ్రి పేరు బాల్లన. వీరి నివాస స్థానము పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధమైన గ్రామము కాదు. ఈయన రచించిన గ్రంథం పేరు "కన్యకా పురాణము" అనే ఎనిమిది ఆశ్వాసముల పద్యకావ్యము. ఈ పురాణములో ఒక కథ ఉంది. ఈ కథ చారిత్రిక కథను పోలి ఉంటుంది. పెనుగొండలో కుసుమ శెట్టి అను ఒక కోమటి ఉంటాడు. అతనికి ఒక కుమార్తె ఉంటుంది. ఆమెను విష్ణువర్ధనుడు అను రాజు కామించి తన కివ్వ మంటాడు. తండ్రి అయిన శెట్టి అందుకు అంగీకరించడు. అందుకు కోపోద్రిక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఆ కన్యను బలాత్కారము చేస్తాడు. శెట్టి , ఆతని కూతురు అగ్నిహోత్రములో పడి మృతులయినట్టు, వారితో పాటు 102 గోత్రముల వారు మృత్యు లయ్యారు. అప్పుడు కన్యక కోమట్ల లో ఎనుబది కుటుంబములు తూర్పునకును, నూరు కుటుంబాలవారు పడమటకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూట ముప్పది కుటుంబములు ఉత్తరమునకును పారిపోయారు. కన్యకా శాపము చేత విష్ణువర్ధనుని శిరస్సు ముక్కలై మరణించాడు. అతని కుమారుడైన రాజ నరేంద్రుడు వైశ్యులను శాంత పరచి కుసుమ శెట్టి కొడుకు అయిన విరూపాక్షునికి పదునెనిమిది పట్టణములకు అధికారిగా చేసి కోమట్లను శాంత పరిచాడు. మిగిలిన వారిని పెనుగొండలో ఉండమన్న ట్లు చెప్పబడింది.ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య పుణ్యస్థలం. ఎక్కడ కన్యకా పరమేశ్వరి ఆలయము నిర్మింపబడినా, ఆ దేవత వైశ్యులచే పూజలందుకోబడుతున్నది. గ్రంథకర్త అయిన భాస్కర పంతులనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజ మహేంద్ర వరం మొదలైన ప్రదేశములందుండీన కోమట్ల కు గురువయ్యాడు. కన్యకా పురాణం రచించి వైశ్యుల విషయమై కొన్ని కట్టుబాట్లను చేసి వాటిని ఆధారముగా 102 గోత్రముల వారిని లోబరుచుకున్నాడు. ఈ ఏర్పాటుకు కాదన్న వారిని కులభ్రష్టులుగా చేసి బహిష్కరించాడు. తనకు లోకువ అయిన వారికి పురోహితుడయ్యాడు.ఇదీ కన్యకా పరమేశ్వరి కథ నేటికిని ప్రాచుర్యంలో ఉన్నది. ఈ కవి గురించి నిశ్చయముగా తెలియకపోయినప్పటికీ ఇతడు 16వ శతాబ్దము ముందు వాడని అనిపించు చున్నది.ఈతని కన్యకా పురాణము నుండి రెండు పద్యములు: ఉ. అంతట నింకితజ్ఞు డగు నాకుసుమాఖ్యుడు నాదరంబున్/గాన్తను జూచి పల్కె ననుకంప దలిర్పగ నీ మనంబున్/జింత వహించి యిట్లనికి చెప్పుము నీకు మనో రథార్థముల్/సంతసమంద నిత్తును విచారము మానుము దైన్య మేటికిన్// ***. ****. *** *** చ. జలనిధి మేరదప్పిన నిశాకరబింబము త్రోవ దప్పినన్/బలువిడి ధాత్రి క్రుంగినను భాస్కరు డిట్లుదయింప కుండినన్/గులగిరి సంచలించినను గూర్మము భూమి భరింపకుండినన్/బలికిన బొంక నేరరు కృపా నిధులై తగు వైశ్యు లెప్పుడున్// ***. *****. ‌‌. **** ‌‌. *** ఈ పద్యములందు "కన్యకా పరమేశ్వరి" కావ్య చరిత్రలో వైశ్యుల నీతి నిజాయితీల గురించి వివరింపబడింది, ఈ కన్యకా పురాణము వ్రాసిన భాస్కర పంతులనుఆచార్యుడు తెలుగు సాహితీ చరిత్రలో శాశ్వతంగా నిలిచాడు.(54 విభాగము)-- బెహరా ఉమామహేశ్వరరావు సెల్ నెంబరు:9290061336
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
కాలములు - వర్తమాన కాలం - భూత కాలం - భవిష్యత్ కాలం - తద్ధర్మ కాలం వివరణను ఉపాధ్యాయులు కూకట్ల తిరుపతి ర్'ఇస్తారు వినండి. 
చిత్రం
భళిరే నైరా
చిత్రం