అష్టాదశ గీతామకరందం-- రెండేళ్ళ క్రితం కొన్న పుస్తకమే "అష్టాదశ గీతా మకరందం". పద్దెనిమిది గీతార్థాల సార సంగ్రహమిది. ఖమ్మంలోని స్వరాజ్యలక్ష్మి ప్రచురణ సంస్థ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తక రచయిత సూర్యప్రసాదరావుగారు.నాకు తెలిసిన గీతలు మూడే. అవి అర్జునుడికి కృష్ణపరమాత్ముడు చేసిన ఉపదేశమైన భగవద్గీత. మరొకటి ఉద్ధవ గీత. ఉద్ధవుడికి సంబంధించి మా నాన్నగారు శ్రీరామకృష్ణ ప్రభలో ఓ వ్యాసం రాసినప్పుడు అది అదవి ఉద్ధవగీత ఆనేదొకటి ఉందని తెలుసుకున్నాను. మా నాన్నగారి పుస్తకాల సేకరణలోని సనత్సుజాతీయం.ఇక మిగిలిన పదిహేను గీతల విషయం ఈ పుస్తకం ద్వారానే తెలిసింది. ఈ పుస్తకంలో సంగ్రహించి చెప్పిన గీతలు....వ్యాథగీత. గురుగీత. కపిల గీత. భరత గీత. సనత్ కుమార గీత. ఋషభ గీత. రుద్రగీత. నవయోగీశ్వర గీత. బ్రాహ్మణ గీత. శ్రీరామ గీత. ఉద్ధవ గీత. సనత్సుజాత గీత. అవధూత గీత. అనుగీత. భిక్షు గీత. నహుష గీత. హంసగీత. శౌనక గీత. ఋషుల బోధనలన్నీ అనేక సందేశాల రూపంలో మహాభారతం, భాగవతం, రామాయణ ఇతిహాసాలలో, ఉపనిషత్తులలో, అష్టాదశ పురాణాలలో నిక్షిప్తమై ఉన్నాయి. వీటికే "గీత"లని నామకరణం చేశారు.భగవద్గీత జగద్వితం. అర్జునుడిని కార్యసాధకుడిగా నడిపించడానికి కృష్ణుడు బోధించిన భగవద్గీత జగమంతా ఎరిగిన గీత. అయితే అటువంటి గీతలు సుమారు నలభైకిపైగా అక్కడక్కడా దర్శనమిస్తాయి. వాటిలోంచి పద్దెనిమిది గీతలను సేకరించి వాటి అర్థసారాలను వివరించే ప్రయత్నం చేశారు రచయిత.వ్యాధ గీత అనేది మహాభారతం అరణ్యపర్వంలో అయిదో శ్వాసలో ఉంది. జాతిని బట్టీ వృత్తిని బట్టీ కటికవాడుగా చెలామణి అయ్యే ధర్మవ్యాధుడు కౌశికుడికి గురుస్థానీయుడిగా ఈ గీతను బోధించాడట. వేదాధ్యయనం కన్నా ధర్మాచరణమే ప్రధానమని, పతి సేవను మించిన ధర్మం సతికి లేదని ఈ గీత చెబుతుంది.ఇలా ఒక్కొక్క గీత ఏ సందర్భంలో ఎవరు బోధించారన్నది పరిచయం చేస్తూ అక్కడక్కడ సందర్భోచితంగా కొన్ని కథలిచ్చారు. అవి చదవడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాయి.ఋషభ గీత భాగవతంలోని అయిదవ స్కందంలోనిది. పరీక్షిన్మహారాజుకి శుకమునీంద్రుడు చేసిన బోధ. ప్రియవ్రతుడి కథ చెప్తాడు. ముఖ్యంగా మనందరికీ తెలిసినవి భక్తి మార్గాలు తొమ్మిదే. అయితే ఇరవై ఒక్క భక్తి మార్గాలున్నాయంటూ వాటి గురించి చెప్పారు.పరమేశ్వరుడు పార్వతీదేవి ధర్మసందేహాలకు చెప్పిన సమాధానాలనే ఉమామహేశ్వర సంవాదంగా చెప్తారు. ఇది భారతంలోని అనుశాసనిక పర్వంలో ఉంది. అదే రుద్రగీత. ఓమారు పార్వతీ దేవి మూడో కన్ను తెరవటానికి కారణమేమిటని అడుగుతుంది.అప్పుడు శివుడు "ప్రియసఖీ! నీ చేతులు తొలగించకుండా నీ ముచ్చటను గౌరవిస్తూ చీకటి వ్యాపించిన సకల లోకాలకూ వెలుగుని ప్రసాదించవలసి వచ్చింది. అందుకోసం మూడో కన్ను తెరవాల్సి వచ్చింది" అని అన్నాడు. ఈ మాటతో పార్వతీ దేవి తన ధర్మసందేహాలను అడగగా శివుడు వాటికి జవాబిస్తాడు. బూడిద పూసుకోవడం, ఎముకలు, పాములు ఆభరణాలుగా ఎందుకు ధరించాడో తెలుసుకోవచ్చు రుద్రగీతలో. భాగవతంలోని ఏకాదశ స్కందంలోనిదే అవధూతగీత. అవధూత రూపంలో ఉన్న దత్తాత్రేయస్వామికి యదు మహారాజుకు మధ్య జరిగిన సంవాదమే అవధూతగీత. కొండచిలువ, సముద్రం, మిడుత గురించి చెబుతూ అవి నేర్పే పాఠాలు తెలుసుకోమంటాడు. అడక్కుండానే కోరకుండానే అనాయాసంగా లభించిన ఆహారాన్ని కొండచిలువ తినేస్తుంది. అది రుచా పచా అనేది చూసుకోదు. తక్కువా కావచ్చు. ఎక్కువా కావచ్చు. దొరికిన దాంతో తృప్తిపడి జీవనం సాగిస్తుంది కొండచిలువ. అందని ద్రాక్షకు అర్రులు చాచదు. ఇక సముద్రం విషయానికి వస్తే అది ప్రశాంతంగా ఉంటుంది. గంభీరంగానూ ఉంటుంది. అపారమైన జలరాశితో లోతుగా ఉంటుంది. సాధకుడుకూడా సముద్రంలా శాంతంగా ఉండాలి. సాధకుడనేవాడు సంసారిక పదార్థాలు లభించినప్పుడు పొంగిపోరాదు. అవి తరిగిపోయినప్పుడు కృంగిపోరాదు. సముద్రం నుండి ప్రసాద గాంభీర్యాలు, సుఖదుఃఖాలలో సమానత్వం గ్రహించాలన్నదే ప్రధానం. మిడుత దీపం రూపం చూసి మోహం పొంది అందులో పడి కాలిపోతుంది. అలాగే పురుషుడు స్త్రీ అందం, హావభావాలకు మోహపడి వివేకాన్ని కోల్పోతాడని తెలుసుకోవాలంటాడు. ఇలా ఆయా గీతల సారాంశాన్ని ఈ పుస్తకంవల్ల తెలుసుకోవచ్చని నా వ్యక్తిగత అభిప్రాయం. చదవడంతోపాటు పదోలపరచుకోవలసిన పుస్తకమిది!- యామిజాల జగదీశ్
• T. VEDANTA SURY
9246941040
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి