మనవడా నా చేయి పట్టు :- సన్యాసిరాజు కాశీ, విశాఖపట్నం -ఫోన్ : 7799359595
తృతీయ బహుమతి విజేత 
====================
//పల్లవి //
మనవడా మనవడా నా చేయి పట్టు! 
నా మనసంతా నీదే అయ్యేటట్టు! 
నీ చేయి పట్టులోనె ఉంది నా ఆయువు పట్టు! 
ఆ ఆయువు పట్టే నేను కలలు కన్న తేనెపట్టు! 

చరణం-1
చీమలున్న చోటే నీ చేయి పెట్టు! హాని చేయనని ముందే ఒట్టు పెట్టు! 
చీమతో స్నేహం చేపట్టు! స్నేహం కోసం పంచదార పంచిపెట్టు! 
చీమల్లో క్రమశిక్షణ కనిపెట్టు! చీమ తెలివిని నీలో రాబట్టు! 
శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదని చెప్పి పెట్టు! 
చీమ తోనే స్నేహం ఇమ్మని శివుని తో మొర పెట్టు! //మనవడా//

చరణం -2
"చల్ చల్ గుర్రం చలాకి గుర్రం“ అని నాచేయి పట్టు! 
నా భుజాన్ని ఎక్కి నన్ను అంటిపెట్టు!
విహారం చేసి విజ్ఞానాన్ని నీలో దాచిపెట్టు! 
ఊరూరా తిరిగి ఆ విజ్ఞానాన్ని పంచిపెట్టు! 
“అనగ అనగ ఒక రాజు” కథలో ఏడవ చేప ఎందుకు ఎండలేదో నీవే చెప్పి పెట్టు! 
బూచాడు అని నిన్ను భయ పెట్టువాడిని నా ముందు పెట్టు! 
నా తాత నా ఎనకున్నాడని తొడ కొట్టి చెప్పు! 
నా తాత కర్ర నీ కాళ్ళు విరగగొట్టు! నా తాత చేయి నీ చెంప పగులకొట్టు అని వాడికి చెప్పి పెట్టు!  //మనవడా//

చరణం -3
“గుడు గుడు గుంజం గుండే రాగం ”అంటూ పిడిక మీద పిడిక పెట్టు! 
తెలుసుకో అదే మీలోన ఉన్న కలసికట్టు! 
కసాయివాడి మీద గురిపెట్టు! వాడు పట్టుకున్న కత్తిని దూరం పెట్టు! 
కట్టివేసిన మేక కట్టును విప్పి పెట్టు! పిల్లమేక దగ్గర తల్లిమేకను విడిచి పెట్టు! 
ఆవు -పులి కథ చెప్పి కసాయి వాడికి జాలిని చూపెట్టు! వాల్మీకి కథని చెప్పి బోయవాని మనసు మారేటట్టు చేపట్టు! //మనవడా// 

చరణం 4
హింస వద్దు అని అరచి వదలకు నీ మొండి పట్టు! అహింస ముద్దు అని ముద్దు ముద్దు గా మెప్పించి పెట్టు! 
ఒక చెంపదెబ్బకు రెండవ చెంప చూపెట్టు ! కరుణించి కొట్టలేని ఆ చేయి హృదయానికి దండం పెట్టు! 
శాంతి శాంతి అన్న గాంధీ తాత నా తాతకు తాత అని చెప్పి ఒక సెల్యూట్ కొట్టు ! 
“నేడు నేనే వీరుడైన బాలుడునని రేపు నేనే గౌరవనీయుడైన పౌరుడుని అని ” 
బిగ్గరగా అరచి జాతీయ జెండాను నీ చేతితో పట్టు ! //మనవడా //

కామెంట్‌లు