*భాస్కర శతకము* - పద్యం (౩౨ - 32)

ఉత్పలమాల :
 *కామిత వస్తుసంపదలు | గల్గు ఫలం బొరులాసపడ్డచో*
*నేమియుఁ బెట్టఁడేని సిరి | యేటికి ? నిష్ఫలమున్నఁబోయినన్*
*భ్రామికపడ్డ; లోకులకుఁ | బండగనే మది యెండిపోవఁగా*
*నేమిఫలంబు ? చేదుఁ విడ | దెన్నటికైన ముసిండి భాస్కరా!*
*ముసిండి = ముషిణి చెట్టు*
తా.: మునులు, సకల దేవతలు, జీవులచే పూజింపబడుతున్న, నా గురుమూర్తివైన ,భాస్కరా!
 ముషిణి చెట్టు స్వభావ సిద్ధంగా చేదు గుణము కలిగి వుంటుంది.  ఆ ముషిణి చెట్టుకు కాసిన కాయలు కూడా చేదుగానే వుంటాయి. చెట్టు కాయలు పండినా, ఎండినా కూడా దాని సహజమైన చేదు గుణము పోదు. అందువల్ల ముషిణి చెట్టు కాయలను తినాలి అని ఆశ పడిన జనుల కోరిక తీరదు కదా.  అలాగే, అన్ని సంపదలు, ధనము  వున్న మనిషిని చూచి, తన అత్యవసరాలకు ఉపయోగపడతాడు అని ఆశపడ్డ వానికి సహాయం చేయగలగాలి.  అలా ఎదుటి వారికి సహాయ పడలేనప్పుడు, మనకు ఎన్న సంపదలు వున్నా, లేకున్నా, ఏమీ ఉపయోగం లేదు. ... అని భాస్కర శతకకారుని వాక్కు.
.....ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss