"గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు
భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ"
వసుమతి పదో క్లాస్ పిల్లలకి క్లాస్ పాఠాలు అయ్యాక, వారితో వర్తమాన సాంఘిక విషయాలు...లోకంపోకడ..రీతి-రివాజులు చర్చిస్తూ ఉంటుంది.
ఆ రోజు.....నిన్న జరిగిన సంఘటన గురించి మనసులో మెదులుతూ ఉండగా వారితో.... 'స్కూల్ అయిపోయి పిల్లలంతా ఇళ్ళకి వెళ్ళిపోయాక 'బి'సెక్షన్ లో ఉండే కిరణ్ వాళ్ళ అమ్మగారు వచ్చారు. కిరణ్ ప్రవర్తన గురించి చాలా బాధ పడి నయానో-భయానో ఎలాగైనా నచ్చచెప్పి అతన్ని సరైన దారిలో పెట్టమనీ, మళ్ళీ తను స్కూల్ కి వచ్చి టీచర్తో మాట్లాడినట్టు అతనికి తెలియనివ్వద్దనీ మరీ మరీ చెప్పి వెళ్ళారు.' అన్నది.
పిల్లలందరూ ఒక్కసారి నిటారుగా కూర్చుని, ఏం జరిగి ఉంటుందని వారిలో వారు గుసగుసలాడుకుంటూ, టీచర్ ఏం చెబుతారో అని ఎదురు చూస్తున్నారు.
వసుమతి గొంతు సవరించుకుని
"గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
కడివెడైననేమి ఖరము పాలు .....
అని రాగయుక్తంగా పద్యం చదివి, 'ఇలాంటి పద్యాలు మీకు లేతవయసులో ఉండగా ఎందుకు చెబుతామో తెలుసా?' అని అడిగింది.
వంశీ లేచి 'ఇలాంటి పద్యాలు చిన్నప్పుడు భట్టీయం వేయిస్తే, ఎప్పటికీ అందులో ఉండే సారం గుర్తుండి పోయి, ఎదిగేటప్పుడు మా వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతుంది ' అనే కదా టీచర్ అన్నాడు.
'సరే ఇంకా వివరంగా చెబుతాను వినండి,' అన్నది.
మన పెద్దలు ఆవుపాలని తల్లిపాలతో పోలుస్తారు. అందులో ఎన్నో సుగుణాలు-పోషకాలు ఉన్నాయి. ఆవుపాలు తేలికైన ఆహారం. పసిపిల్లలకి...అనారోగ్యవంతులకి సులభంగా అరుగుతాయి.
వైద్యశాస్త్ర రీత్యా ఆవుపాలు మనలో రోగ నిరోధక శక్తిని పెంచి చాలా రకాల జబ్బులని దరిజేరనివ్వవు. అందువల్ల గంగి గోవు పాలు గరిటెడు త్రాగినా అది ఎంతో మేలు చేస్తుంది.
ఖరము అంటే గాడిద. గరిటెడు ఆవుపాలకి బదులు కడివెడు గాడిదపాలు త్రాగితే ఏ విధమైన ప్రయోజనం లేకపోగా, ఇబ్బంది కూడా కలిగిస్తుంది.
*********
ఇక నిన్నటి సంఘటన గురించి ఎందుకు మీతో ప్రస్తావించానంటే...అతన్ని తప్పుగా చూడమని కాదు. ఆ తప్పు మీరు చెయ్యకూడదని!
మీకు సంవత్సర పరీక్షలు ఇక పదిహేను రోజుల్లోకి వచ్చాయి తెలుసు కదా!
మొన్న రాత్రి కిరణ్ పొద్దుపోయేదాక చదువు మానేసి సెల్ ఫోన్ చూస్తూ కూర్చున్నాడుట.
వాళ్ళ అమ్మగారికి ఆఫీస్ లో ఇన్స్పెక్షన్ పని ఉండి లేట్ గా వచ్చారుట. రాత్రి భోజనాలయ్యాక, ఆఫీస్ పని చూసుకుంటూ కిరణ్ రూం లో లైట్ వెలుగుతూ ఉండటం చూసి చదువుకుంటున్నావా అని అడిగితే అవునని చెప్పి సెల్ ఫోన్ లో విడియో గేంస్ ఆడుతున్నాడుట. పొద్దుపోయింది లైట్ తీసి పడుకో అని ఆవిడ కొంత సేపు అయ్యాక వెళ్ళి చూస్తే, లైట్ తీసేసి దుప్పటి ముసుగు పెట్టుకుని, లోపల ఫోన్ పెట్టి ఆడుతున్నాడుట. అది చూసి ఆవిడ గదమాయించేసరికి, ఆవిడమీద గట్టిగా అరిచి...చేతిలో ఫోన్ విసిరేశాడుట. చూశారా...ఎంత బాధ్యతారాహిత్యమో!
ఇటు చదువుకుంటున్నానని తల్లితో అబద్ధం చెప్పటం...అటు ఖరీదైన ఫోన్ నేలకేసికొట్టి డబ్బు పాడు చెయ్యటం! పైగా తప్పు చేసి పట్టుబడ్డానన్న ఉక్రోషంతో తల్లి మీదే అరవటం!
ఈ రోజుల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలకెళుతున్నారు. వారు ఇంటికొచ్చేవరకూ మీ క్షేమసమాచారాలు తెలుసుకుంటూ ఉండటానికి సెల్ ఫోన్ లు కొనిచ్చి విచక్షణతో వాడుకోమంటే మీరు ఇలా చెయ్యటం సరైనదేనా? మీరే ఆలోచించండి!
మీ తల్లిదండ్రులు బోలెడు ఫీజులు కట్టి మీరు స్కూల్ కొచ్చి చక్కగా చదువుకునే ఏర్పాటు చేస్తున్నారు*****మీరు చదువుతో పాటు ఎన్నో ఇతర విషయాలు కూడా నేర్చుకుంటున్నారు. అది మీ వ్యక్తిత్వాలని తీర్చిదిద్దాలి****మంచీ-చెడూ తెలుసుకోవాలి.
కేవలం ఫస్ట్ మార్కులు వస్తే సరిపోదు. మంచి నడత ఉండాలి****ప్రవర్తనలో తప్పొప్పులు తెలియాలి*****మన చుట్టు పక్కల జరిగే విషయాల గురించిన అవగాహన ఉండాలి****ఒక మంచి స్కూల్లో చదివించటం కోసం మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో, వారి అవసరాలు ఎన్ని మానుకుంటున్నారో అనే స్పృహ మీకెప్పుడూ ఉండాలి****డబ్బు విలువ తెలియాలి.
వినయాన్ని -విచక్షణని పెంచని చదువు వల్ల ఎవరికైనా ఏమి ఉపయోగం?
జీవితంలో కానీ చదువుల్లో కానీ ఎప్పుడు విజయాలే ఉండవు....
ఫెయిల్ అవటం కూడా సహజం.....ఫెయిల్ అయినప్పుడు నిరాశ పడకుండా...ఎక్కడ తప్పు చేశారో తెలుసుకుంటే ఆత్మ హత్యలు చేసుకుని తల్లిదండ్రులని క్షోభపెట్టే స్థితి ఉండదు.
పెద్దలు చెప్పినట్టు....మీ విజయం మిమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది....అదే ఫెయిల్యూర్ మీకు ప్రపంచాన్ని పరిచయం చేసి****అనుభవాన్ని పెంచుతుంది.
అసలు విదేశాల్లో ఇలా తల్లిదండ్రులు లక్షలు ఫీజులు కట్టి పిల్లల్ని చదివించరు. చిన్నప్పటినించీ ఎవరికి వారే సంపాదించుకుని చదువుకోవాలి.
******
ఎలా మన చదువు మన వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతుందో. ...అలాగే మనం తినే ఆహారం మనలో ఉద్వేగాలని, రాగ ద్వేషాలని పెంచుతుంది అని పెద్దలు చెబుతారు.
సాత్వికాహారం మనలో ప్రశాంతతని పెంచుతుంది. కొన్ని ఆహారాలు ఉదాహరణకి మసాలాలు, కారం..ఇంకా ఇతర ఘాటైన పదార్ధాలు మనలో కోపాన్ని, ఆవేశాన్ని, ఉద్విజ్ఞతని పెంచుతాయి. అలాంటప్పుడు మన మీద మనకి నియంత్రణ ఉండక కొట్లాటలకి వెళ్ళటం, ...ఒక్కోసారి హత్యలకి కూడా దారి తీసేటంత ఆవేశ పడటం కూడా జరుగుతుంది.
ఇప్పుడు మీరందరు ఎక్కువగా బయట హోటళ్ళలో తినటం, ఫాస్ట్ ఫుడ్ తినటం ఇష్టపడుతున్నారు! అవునా? అవేమో తాజావి కాదు, నిలవ చేసినవి..అప్పటికప్పుడు వేడి చేసి ఇస్తాడు. అదెంత ప్రమాదమో మీకు తెలియదు.
అంతేనా, అటువంటి ఆహారాలు మీ మేధస్సుని పాడు చేసి....మీ చదువుల మీద కూడా ప్రభావం చూపిస్తుంది.
అందువల్లనే "భక్తి కల్గు కూడు పట్టెడైనను చాలు" అని వేమన కవి ....చదువు అనేది ఎంత ఎక్కువ అని కాక.... అది మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలని.....జీవితంలో ఆటుపోట్లు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తిమంతుడుగా తయారుచెయ్యాలని****మనం తినే ఆహారం మనకి మానసిక-శారీరక ఆరోగ్యాన్నిచ్చేదిగా ఉండాలని చెప్పాడు.
అర్ధమయిందా! అని వసుమతి టీచర్ చెప్పింది వినేసరికి.... పిల్లలంతా 'అవును కదా. అమ్మా నాన్నలని మనం అడిగింది కొనివ్వకపోతే ఎంత అల్లరి చేస్తాం! పాపం వారి గురించి ఎప్పుడూ ఆలోచించం! చూడు, కిరణ్ వాళ్ళ అమ్మగారు ఎంత బాధపడుతూ టీచర్ తో చెప్పి..పైగా కిరణ్ తో తను స్కూల్ కి వచ్చినట్టు చెప్పద్దని అతని ఆత్మగౌరవం కాపాడే ప్రయత్నం చేశారు! అని అంత మృదువుగా తమకి విషయ బోధన చేసిన టీచర్ కి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి