*ఎవరుగొప్ప*డి.కె.చదువులబాబు

 రామయ్య అనే రైతు వద్ద తెల్లఆవు ఉండేది. తెల్లఎద్దులుఉండేవి.నల్లమేక ఉండేది. ఎర్రకుక్క ఉండేది. మచ్చలపిల్లి ఉండేది. ఎర్ర పెట్టకోడి ఉండేది. కుక్క,పిల్లి,ఇంట్లో ఉండేవి. మిగిలినవి ఇంటి ఎదురుగా ఉన్నపాకలో ఉండేవి.

రామయ్యకు జంతువులంటే చాలా ప్రేమ. వాటిని బాగా చూసుకునేవాడు. అవి అప్పుడప్పుడూ కలిసి కబుర్లు చెప్పుకునేవి.

ఒకరోజు కుక్క, పిల్లి పాకలోకి వెళ్ళాయి. ఆరోజు వర్షంపడి బయట బురదగా ఉండటంతో అన్నీ పాకలోనే ఉన్నాయి. అవి కబుర్లు మొదలు పెట్టాయి. మాటలమధ్యలో తెల్లఆవు" నేను ఇచ్చే లీటర్లపాలు అమ్ముకుని, ఆడబ్బుతో మన యజమాని నాలుగు మెతుకులు తింటున్నాడు. మీకూ పెడుతున్నాడు. కాబట్టి నేను గొప్ప. నన్ను అందరూ గౌరవించాలి"అంది.

నల్లమేక తల విదిలించి " నేనూ పాలు ఇస్తున్నాను.నాపాల డబ్బుతోనే మీకు తిండి పెడుతున్నాడు.అందరికంటే నేను గొప్ప. మీరందరూ నన్ను గౌరవించాలి"అంది.

ఎర్రకోడి ఒక్కసారిగా ఒళ్ళువిదిల్చి "నేను పెట్టే గుడ్లు అమ్మగా వచ్చిన డబ్బుతో బతుకుతున్నాడు.మీకింత తిండి పెడుతున్నాడు.మీఅందరికంటే నేనే గొప్పదాన్ని.నన్ను గౌరవించండి"అంది.

"మేము పొలం దున్ని పండిస్తున్న పంటను అమ్ముకుని మన యజమాని బతుకుతున్నాడు. మీకూ కడుపునిండా తిండి పెడుతున్నాడు. మేమేగొప్ప. మమ్మల్ని గౌరవించాలి" అన్నాయి తెల్లఎద్దులు.

మచ్చలపిల్లి 'మ్యావ్' మని ఒక్కఅరుపు అరిచి"ఇంట్లో నిల్వ ఉంచుకున్న తిండి గింజలను ఎలుకలు తినిపోతే, మనయజమానికీ, మీకూ తిండి ఉండదు. ఒక్కఎలుకా రాకుండా ఎలుకలబారినుండి ఆహారపదార్థాలను కాపాడుతున్నాను. నేను మీఅందరికంటే గొప్పదాన్ని. నన్ను అందరూ గౌరవించాలి"అంది.

అన్నిటిమాటలనూ వింటున్న ఎర్రకుక్క కోపంగాచూసి'భౌభౌ'మంటూ ఒక్కఅరుపు అరిచి"నేను రాత్రీపగలు కష్టపడి మనయజమాని ఇంట్లోని ధనాన్ని, ధాన్యాన్ని దొంగలబారినుండి కాపాడుతున్నాను. నేను లేకుంటే దొంగలు దోచుకెడతారు.అప్పుడు మీరందరూ పస్తులే. కాబట్టి అందరి కంటే నేను గొప్ప. అందరూ నన్ను గౌరవించాలి"అంది.

ఈ విధంగా అవి వాదించుకుంటూ ఉండగా రామయ్య పాకలోకి వచ్చాడు.

"మనలోఎవరుగొప్పోమన యజమానిని అడుగుదాము"అంది కోడి.

అవి రామయ్యకు తమవాదనలు వినిపించాయి.వాటిమాటల్లో ప్రపంచంలో తామేగొప్ప అనే గర్వాన్ని గమనించాడు రామయ్య.

వెంటనే కుక్కను, పిల్లిని, కోడిని మిగిలినవాటితో పాటు తాడుతో కట్టేశాడు. రేపు వచ్చి ఎవరు గొప్పనో చెబుతానని వెళ్ళిపోయాడు.

తెల్లవారింది.రామయ్య పాక వైపు రాలేదు. అన్నీ ఆకలితో నకనకలాడుతున్నాయి. సాయంకాలమైంది.అవి ఆకలితో అల్లాడిపోతున్నాయి.అప్పుడు వచ్చాడు రామయ్య.

ఆవును,నల్లమేకను పాలు ఇవ్వమన్నాడు. "తిండి,నీళ్ళు లేక ప్రాణం పోయేలా ఉంది. పాలు ఎలా వస్తాయి" అన్నాయి.

కోడిని గుడ్డు పెట్టమన్నాడు.

"గింజలు లేక ఆకలితో ప్రాణంపోయేలా ఉంది. గుడ్డు ఎలా వస్తుంది?" అంది. ఎద్దులను పొలానికి పోదామన్నాడు. తిండి,నీళ్ళు లేక శక్తి చచ్చిపోయింది. రాలేమన్నాయి.

పిల్లినిఎలుకలను పట్టమన్నాడు. "తిండిలేక కదిలే శక్తి లేదు" అంది పిల్లి.

కుక్కను ఇంటికాపలాకు రమ్మన్నాడు. తిండి,నీరు లేక అల్లాడిపోతున్నాను. కదలలేను"అంది.

రామయ్య నవ్వి "రెండురోజులు ఆహారం, నీళ్ళు లేకుంటే దేనికీ పనికి రాకుండా పోయారు.మీరు గొప్పెలాగవుతారు? ఈసృష్టిలో ప్రకృతి గొప్పది. పంచభూతాలు ప్రకృతిలో భాగం. ఆహారం, నీరు జీవులకు ప్రకృతి ప్రసాదించిన వరాలు. మొక్కలనుపెంచడం,చెట్లను నరకకుండా కాపాడుకోవటం,ఆహారాన్ని,నీటిని వృధాచేయకుండా పొదుపుగా వాడుకోవటం,ప్రకృతిని కలుషితం చేయకపోవడం వంటి పనులద్వారా మనం ప్రకృతిని గౌరవించాలి.గర్వం ఎప్పుడూ మంచిది కాదు."అన్నాడు.

వాటికి జ్ఞానోదయమయింది. సిగ్గుతో తలొంచుకున్నాయి.రామయ్య వాటికి ఆహారం,నీళ్ళు తెచ్చిఅందించాడు.

ప్రకృతికి మనస్సులో నమస్కరించుకుని తినడం ప్రారంభించాయి.

డి.కె.చదువులబాబు.

ప్రొద్దుటూరు516360

కడపజిల్లా.