గీతోపదేశం: -వురిమళ్ల సునంద ఖమ్మం

 వేల వత్సరాలు గడిచినా
వసి వాడని విలువల పరిమళం
మానవ జీవన ప్రమాణాల మార్గదర్శనం!
సర్వాంతర్యామి శ్రీకృష్ణ భగవానుడు
అర్జునునకు బోధించిన జ్ఞానము
సర్వకాల సర్వావస్థల యందు
ఆచరించాల్సిన కర్తవ్య నిర్వహణము!
సమస్యా పరిష్కార దిశగా
ఎదురయ్యే సందిగ్ధతలకు సమాధానంగా
కలతలతో వ్యాకులపడే హృదయాలకు సాంత్వనగా అనుగ్రహించబడిన 
మహోపదేశ ఉద్గ్రంథం!
హిందువుల పవిత్ర గ్రంథం
భగవద్గీత పుట్టినరోజిది!
వేలాది సంవత్సరాలుగా 
జరుపుకునే గీతా జయంతి!
వేద వేదాంత యోగ విశేషాల
విరచితమైన సిద్ధాంత గ్రంథమే ఇది!
మహా భారత ఇతిహాసం నుండి
గ్రహింపబడిన
కురుక్షేత్ర సంగ్రామంలో  
ఇరవై ఐదవ అధ్యాయము మొదలు
నలభై రెండో అధ్యాయం వరకు
పేరొందిన భగవద్గీతా సారం!
మానవీయ విలువల గీతోపదేశం!