236.బాలగేయ కాంతులు:: -బెలగాం భీమేశ్వరరావు,9989537835.


 కొత్త ఉత్సాహం వచ్చింది. బాలల కోసం ఇంకా

ఏవేవో రాయాలి.నా బాలగేయాలు చదివి వాళ్ళు

కూడా కలం పట్టాలి.బాలసాహిత్యానికి బాలలు కూడా శ్రీకారం చుట్టాలి.ఆ ధ్యేయంతో పిల్లలను

ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ' బాలసాహిత్యం ' పేరున

ఒక గేయం రాశాను.//అమ్మ మనసు కలిగితేనే/

బాలమనసు లెరుగ గలరు/బాల మనసు తెలిస్తేనే/బాలరచన లల్లగలరు//నాన్న బాధ్యతెరిగితేనే/బాధ్యత పాటించగలరు/బాధ్యతతో సుద్దులున్న/బాల రచన చేయగలరు//

గురువు చతురతుంటేనే/సద్బోధలు చెప్పగలరు/

విజ్ఞానం వినోదాలు/చక్కగ సృజించగలరు//

పిల్లలార మీరు కూడ/రచనలెన్నో చేయగలరు/

తల్లి తండ్రి గురువులుగ/అవతారములెత్తుడు//

ఈ గేయం 2019 అక్టోబరు 15న వార్త ఆదివారం లో వచ్చింది.మా మనవరాలు వేదకుందన

తన తమ్ముడి మీద పాట రాయమని కోరింది.

ఆ వెంటనే ఆమె పాడుతున్నట్టుగ ఒక పాట

రాసి వినిపించాను.ఆమె చాలా సరదా పడింది.

ఆ గేయాన్ని ' తమ్ముడు ' పేరుతో వార్తకు పంపేను.

//తమ్ముడూ తమ్ముడూ/అందాల తమ్ముడూ/

ముద్దు లొలుకు తమ్ముడూ/మురిపాల తమ్ముడూ//ఆటలెన్నో ఆడుదాం/పాటలెన్నో 

పాడుదాం/జట్టు కట్టి మనము/వాకిట్లో తిరుగుదాం//రారా తమ్ముడూ/బుజ్జి బుజ్జి తమ్ముడూ/దారా తమ్ముడూ/బలే బలే తమ్ముడూ//పనులు అమ్మ చేయాలి/నాన్న పనికి

పోవాలి/అల్లరిపుడు మానుదాం/ఆటల్లో మునుగుదాం//ఈ గేయం అక్టోబరు 20న వచ్చింది.పాత్ర ప్రవేశం చేసినప్పుడు ఇటువంటి

గేయాలు రాయగలం.నవంబర్ నెల వచ్చింది.

తెలుగు వెలుగు పత్రికలో నా గేయమొకటి ఇచ్చారు. పేరు ' శాంతి బాట '! //తాగు నీటితొ

గొంతు తడవని/నరులు కలరోయ్ పుడమినింకను/చిన్న నలతకె వైద్యమందని/

జనులు కలరోయ్ పుడమినింకను//కూటి కోసం

ఎదురు చూచెడి/ప్రజలు భువిలో కలరు పెక్కురు/

గూటి కోసం పరితపించెడి/జనులు మహిలో కలరు అధికులు//జ్ఞానమిచ్చెడి పాఠశాలలు/

కొరత ఉన్నవి వసుధ నింకను/మూఢ భావాల్

పెచ్చుమీరుతు/పాతుకున్నవి మహిని ఇంకను//

శాస్త్ర ప్రగతిని అందుకొననీ/పెక్కు ప్రాంతాల్ కలవు

భువినన్/బడుగు జీవుల బండ బతుకులు/

సాగుచున్నవి సదా ఇలనన్//కష్టసుఖములు తెలిసి నీవును/సానుభూతితొ వ్యవహరించుము/

నష్టమెవరకు చేయకుండా/శ్రేష్ఠనరునిగ వినుతికెక్కుము//తోటి వారికి హాని కోరుట/కానె

కాదుర మనిషి ధర్మం/కీడు చేయని వారి మీదను/

దాడి చేయుట పరమ నీచం//బాధలనియూ ఏవి

తలతువో/పరులకవియూ చేయబోకుము/ఎల్ల

వారల కష్టసుఖములు/నీవిగానే తలచ నేర్చుము//కరములెల్లను కలుపగలిగిన/ఇడుము

లన్నీ సమసిపోనోయ్/నరులు ఎల్లరు హాయినొందిన/నాకలోకమె అవని అగునోయ్//

కూడుగూడులు,విద్య, వైద్యం/ఎల్లవారికి దక్క

వలెనోయ్/కట్టుగుడ్డకు కరువులేకను/ఎల్లవారలు

బతకవలెనోయ్//బతుకు గండాల్ మాయమవ్వగ/మనుజులెల్లరు బతుకవలెనోయ్/

శాంతి సౌఖ్యాల్ పల్లవించగ/లోకమెల్లను ఎదగవలెనోయ్//అదే నెల అంటే నవంబరు 7న

వార్త ఆదివారం అనుబంధం లో వెన్నెల అనే

బాలగేయం వచ్చింది.//నిండు పున్నమి రావె/పండు వెన్నెల తేవె/పిల్లలకు సరదాలు/ దండిగా

పంచవే//ఆటాడు పిల్లలు/ఆనందపడుదురు/

పసిపిల్లలు కూడ/నిను చూసి మురియును//

అమ్మ పిలిచిన గాని/అత్త కేకేసినా/పిల్లలటు వెళ్ళక/నీ వెలుగునుందురే//ఆకలిని ఏమరచి/

ఆటాడుకుందురే/నింగిలో నిను చూస్తు/మైమరచి

పోదురే//అందుకే రమ్మంటు/నిను కోరుచున్నాను/

వెన్నెల్ల వెలుగులను/పంచమంటున్నాను//

పచ్చదనం అంశంతో నేత్రానందం అనే గేయం

నవంబరు11న వచ్చింది.//హరితమయం

హరితమయం/ఎటు చూసినను హరితమయం/

కొండలు కోనలు హరితమయం/నదీతీరాలు

హరితమయం//పంట భూములు హరితమయం/

పూలవనాలు హరితమయం/పండ్లతోటలు హరితమయం/తుప్పలు తీగలు హరితమయం//

పచ్చిక మెరకలు హరితమయం/నేలంతటను

హరితమయం/వర్ష ఋతువులో హరితమయం/

నేత్రానందమె హరితమయం//ఆనంద సింధువు

హరితమయం/ఆరోగ్య హేతువు హరితమయం/

అంతమయిందా ఆ హరితం/మన బతుకగును

అయోమయం//ఆ క్రమంలో మరికొన్ని గేయాలు

రాసి పత్రికలకు పంపేను. చెన్నై ప్రయాణం కోసం

సిద్ధమవుతున్నాం.(సశేషం)