మాకు వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి ప్రారంభం అయినాయి. వేసవి సెలవులలో నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికి దేవుని పల్లికి పండగ కోసం వెళ్లాను. అక్కడ వారం రోజులపాటు గడిపాను. పండగ ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాము. మా అమ్మమ్మ వాళ్లు వ్యవసాయం చేస్తారు. అప్పుడు వేసవికాలం కాబట్టి పంట చేతికి వచ్చే సమయం. వాళ్లకి రెండు ఎకరాల దాకా పొలం ఉన్నది. నేను అది చూడడం కోసం పొలం దగ్గరికి వెళ్ళాను. అక్కడ పొలంలో మేము అన్నము తిన్నాము చాలా ఆనందంగా అనిపించింది ఆ ప్రశాంతమైన స్థలంలో భోజనం చేసినందుకు.
అప్పుడు వడ్లను ఎండ పోశారు కానీ ఆ సమయంలో వర్షాలు పడ్డాయి. వాటి వల్ల వాళ్లకి చాలా ఇబ్బందులు కలిగాయి. అట్ల పంటలు చేతికి వచ్చేలోగానే వర్షాలు పడ్డాయి వాటి వల్ల కొన్ని నష్టాలు కూడా కలిగాయి. అప్పుడు నాకు ఒక కొత్త విషయం అర్థమైంది ఏమిటంటే పర్యావరణం కూడా రైతులకు సహకరించకపోతే అతివృష్టి అనావృష్టి కారణాలవల్ల చాలా నష్టాలు కలుగుతాయి. అప్పుడు ఆ రైతులు ఎంత బాధ పడతారో అనేది నేను గమనించాను. వాళ్లు ఆరు నెలల పాటు చేసిన కష్టానికి ఫలితం లేకుండా నష్టాలు జరిగితే ఎంత బాధని అధిగమించుతారు అనేది నాకు చాలా అర్థమయింది. ఇప్పటి నుంచైనా అన్నాన్ని వృధా చెయ్యొద్దు అనే విషయం తెలుసుకున్నాను. మనము దగ్గరుండి వెళ్లి చూస్తేనే తెలుస్తుంది కానీ పూర్తిగా తెలియదు ఆ పని చేస్తేనే దాని విలువ మనకి పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు చాలా కష్టపడతారు అనే విషయం గ్రహించాను.
వారం రోజుల తరువాత నేను మా ఊరికి వచ్చాను. వేసవి సెలవులే కాబట్టి నేను మా స్నేహితులతో సరదాగా గడిపాను. మా పాఠశాల పేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగన్నపేట. మా తెలుగు ఉపాధ్యాయులు రోజుకో పద్యం అనే వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు.ఆ గ్రూపులో రోజు ఒక అంశం ఇచ్చేవారు. దానిపై నేను కొన్ని ఆటవెలది పద్యాలు, కవితలు మరియు ఆత్మకథలు రాశాను.
ఇలా ఇవి రాయడం వల్ల నాకు చాలా ఆలోచించే తత్వం పెరిగింది . అంశానికి తగినట్టుగా రాయాలని పట్టుదలతో రాశాను వాటిలో రెండు పద్యాలు:
అంశం: చెట్టు
ఆట వెలది
పూలు పండ్ల నిచ్చె పుణ్యమూర్తి తరువు
చెట్టు నీడనిచ్చి సేద దీర్చు
ప్రాణవాయువిచ్చి ప్రాణాలు గా పాడి
అమ్మ వలెను చెట్టు ఆదరించు
అంశం:పుస్తకం
ఆటవెలది
పుస్తకంబు నెపుడు పూర్తిగా జదువుము
పట్టుబట్టి చదువు పదును గాను
చదివితేను గలుగు చక్కని జ్ఞానంబు
మంచిగా జదివిన మార్పు గలుగు
ఇవే కాకుండా ఇంకా చాలా పద్యాలు మరియు కవితలు రాశాను. ఇంకా వేసవి సెలవుల్లో నేను మా అమ్మ దగ్గర వంటలు చేయడం నేర్చుకున్నాను. కొన్ని నీతి కథలను విన్నాను. సెలవులలో నేను మా బంధువులతో మరియు స్నేహితులతో ఆహ్లాదంగా గడిపాను. అలాగే ఇంకా మా తరగతికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకున్నాను. బడిబాటలో భాగంగా మా గురువుతో కలిసి ఒక పాట పాడాను.
అట్లా కొన్ని రాస్తూ, ఆడుతూ, పాడుతూ, నేర్చుకుంటూ వేసవి సెలవులు చక్కగా గడిపాను.
అన్నిటిని కష్టంగా భావించకుండా ఇష్టంగా అన్ని పనులు చేశాను. అట్లా ఇష్టంగా చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.
ప్రతి ఒక్కటి నేర్చుకోవాలనే పట్టుదలతో నేను నేర్చుకునేలా ప్రయత్నించాను. వేసవి సెలవులు కేవలం ఆడుకోవడానికి పరిమితం కాదు. ఇది మనకు కొత్త విషయాలు నేర్చుకోవడానికి విలువైన సమయం. కాబట్టి నేను అలా అనుకొనే వేసవి సెలవుల్లో కేవలం ఆటలే కాకుండా కొన్ని కొత్త విషయాలు నేర్చుకున్నాను. వేసవి సెలవులను నేను సద్వినియోగంగా ఉపయోగించుకున్నానని అనుకుంటున్నాను.
తెలుగు అంతరించిపోతున్న సమయంలో ఉపాధ్యాయుడు ప్రోత్సాహానికి అభినందనలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి