మనం పెరిగే వాతావరణమే, మన ప్రవర్తన...: రాజేష్ మిట్టపెల్లి ......9441672957


 మనం పెరిగిన వాతావరణమే మన మంచి చెడు ను  నిర్ణయిస్తుంది.  " మొక్కై వంగనిది, మానై వంగునా" ఏ మనిషి అయినా చిన్నతనం నుండే  నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం మనకు ఎంతో నేర్పిస్తుంది. దానిలో నీవు ఏమి నేర్చుకున్నావు, నీవు నేర్చుకున్నది నీ తోటి వారికి, ఈ సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ ఈ చిన్న కథలో తెలుసుకుందాం...

                  ఒక చెట్టు మీద రెండు రామచిలుకలు చక్కగా గూడు కట్టుకుని తమ పిల్లలతో సంతోషం గా కాలం గడుపుతున్నాయి. ఒకనాడు పొద్దున్నే అమ్మ చిలుక, నాన్న చిలుక ఆహారం కోసం చూస్తూ బైటకి వెళ్లాయి. ఇంతలో ఒక బోయవాడు పిల్ల చిలుకలని దొంగిలించాడు. అందులో ఒక రామచిలుక వాడినించి ఎలాగో తప్పించుకుని, ఒక ఆశ్రమంలో చెట్టుపై నుంటూ, అక్కడ ఋషులు బోధిస్తున్న చక్కటి మంచి మాటలు వింటూ పెరిగింది. ఇంకొక రామచిలుకని బోయవాడు ఒక పంజరంలో బంధించి ఉంచుకున్నాడు. అది వాడి ఇంటి లోగిలి లో పెరిగింది. అది ఎంతసేపు తిట్లు,చెడ్డ మాటలు వింటూ అదే నేర్చుకుంది. ఒకనాడు ఒక బాటసారి బోయవాడి ఇంటి దగ్గర చెట్టు కింద పడుకున్నాడు. అది చూసి, రామచిలుక, “ఒరేయ్ మూర్ఖుడా! ఇక్కడెందుకు న్నావురా? నీ నాలుక తెక్కొస్తా!” అంటూ భయపెట్టింది. వాడు గతిలేక అక్కడినించి పారిపోయాడు. ప్రయాణించి, వాడు ఆశ్రమం చేరాడు. అక్కడున్న రామచిలుక, “స్వాగతం బాటసారి. నీ అలుపు తీరేవరకు ఇక్కడ విశ్రమించవచ్చు,” అంటూ తియ్యగా పలికింది. ఆశ్చర్య పోతూ, బోయవాడు నీలాంటి రామచిలుకని నేను దారిలో కలిసాను కానీ అది మహా కటువుగా మాట్లాడుతోంది అన్నాడు. “ఓహ్, బహుశా అది నా అన్న చిలుక అయ్యిఉంటుంది. నేను సాధువులతో సాంగత్యం చేశాను కనుక నా భాష ఇలా ఉంది. అదే నా అన్న వేటగాడి భాష నేర్చుకుని అలా మాట్లాడుతున్నాడు. మనం ఎలాంటి సాంగత్యం లో ఉంటామో అలాగే తయారవుతాము,” అని అనుకుంది రామచిలుక. 

                  ఈ కథలో మనం గమనించవలసినది మంచి వాతావరణంలో పెరిగితే, మంచి ప్రవర్తనతో బ్రతుకు తాము, చెడు వాతావరణంలో పెరిగితే, చెడు ప్రవర్తన తో బతుకు తాము అందుకే చెడు ప్రవర్తన పెరిగిన కూడా, కొంత వాతావరణాన్ని చూసి, చుట్టూ ఉన్న మనుషుల పరిస్థితిని చూసి, మనలో మనమే మార్పు తెచ్చుకోవాలి. అప్పుడే నీవు మనిషిగా విజయం సాధించినట్టు అవుతుంది....