వింత సమస్య: ---సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, ధర్మపురి.-- మొబైల్: 990855453


 పూర్వం అవంతీ రాజ్యాన్ని ధర్మవర్మ అనే రాజు  పరిపాలించేవాడు. ఆ రాజు గారి ఆస్థానంలో అనేక మంది పండితులు ఉండేవారు. స్వయానా ధర్మవర్మ  కూడా పండితుడే. అందుచేత ఎంతోమంది పండితులను ఆస్థానంలో పోషిస్తూ వస్తున్నాడు.

              ఇలా ఉండగా ఒకరోజు పొరుగు రాజ్యమైన విదర్భ  నుండి  కైలాసభట్టు  అనే పండితుడు వచ్చి తాను ఒక విచిత్ర సమస్యను ఇస్తున్నానని,దాని  అర్థం చెప్పితే తాను వారికి  సంపాదించిన ధనాన్ని అంతా ఇస్తానని, లేనిపక్షంలో రాజుగారు తన ఆస్థానంలోని పండితులను  అందరినీ తొలగించి తనను ఒక్కడినే ఆస్థాన పండితునిగా గుర్తించాలని సవాలు విసిరాడు. దీనికి ధర్మవర్మ అంగీకరించాడు.

            వెంటనే రాజు ఆ సమస్య ఏమిటో చెప్పాలని అన్నాడు. కైలాస భట్టు " దిక్కు తొక్క అంబా శంభో గబుక్కు కసుక్కు అబ్బా దెబ్బ" అని చెప్పి , దీని అర్థం చెప్పండన్నాడు.పండితులు  ఎంత ఆలోచించినా దీనికి సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు ధర్మవర్మ పండితులందరితో  "ఈ సమస్యకు అర్థం చెప్పేవారే లేరా!"  అంటూ ప్రశ్నించాడు. అప్పుడు రామశాస్త్రి అను పండితుడు లేచి" ప్రభూ!ఈ సమస్య వింతగా ఉన్నది.ఎన్నడూ  దీనిని వినలేదు .కనలేదు. ఇది కొత్తగా, విచిత్రంగా ఉన్నది. కావున దీని అర్థం చెప్పాలంటే రెండు రోజుల వ్యవధి  కావాలి "అని అన్నాడు. అందుకు రాజు కైలాస భట్టు  వైపు చూశాడు.కైలాస భట్టు  దానికి తలాడించి "మహారాజా! రెండు రోజులు ఏమిటి ?వారం రోజులైనా ఫర్వాలేదు. ఈ సమస్యకు అర్థం చెప్పమనండి  లేదా ఓటమిని అంగీకరించమనండి" అన్నాడు. అంతటితో  రాజు ఆనాటి సభను  ముగించాడు.

             ఇంటికి వెళ్ళిన రామశాస్త్రి ఆ సమస్య గురించి తీవ్రంగా ఆలోచించాడు. ఎంత ఆలోచించినా సమాధానం తట్టలేదు. ఎంతో మందిని అడిగి చూశాడు. అయినా ప్రయోజనం లేదు. ఇలా ఒక రోజు గడిచిపోయింది.

            రెండవ నాటి ఉదయం రామశాస్త్రి రాజసభకు వస్తున్నాడు. ఇంతలో ఒక దృశ్యం చూశాడు. వెంటనే చటుక్కున  ఆలోచన వచ్చింది. అంతే. రామశాస్త్రి సభా భవనానికి చేరుకున్నాడు .అప్పటికే సభ కొలువు దీరి ఉంది .అందరు రామశాస్త్రి కొరకై ఎదిరి  చూస్తున్నారు. రాజు "శాస్త్రీ!సమాధానం దొరికిందా "అని అడిగాడు. అప్పుడు రామశాస్త్రి లేచి" మహారాజా! దాని అర్థం నాకు తెలిసింది . ఒక శివభక్తుడు దిక్కులు( దిక్కు ) చూస్తూ నడుస్తున్నాడు .ఇంతలో దారిలో పడవేసిన అరటిపండు తొక్క పై ( తొక్క )తన కాలు వేసాడు .వెంటనే జర్రున జారి ఒక గేదెపై పడ్డాడు .అది' అంబా 'అని ( అంబా )అరిచింది .ఆ వ్యక్తి శివుని ' శంభో 'అని ( శంభో )తలుస్తూ ఉండగా ఆ గేదె గబుక్కున ( గబుక్కు )ఒక్క తన్ను అతడిని తన్నింది .వెంటనే అతడు పక్కనున్న ముళ్ళకంచె పై పడ్డాడు. ఆ ముళ్ల కంచె లోని ముళ్ళు 'కసుక్కున( కసుక్కు ) 'అతని శరీరంలో దిగాయి . అప్పుడతడు ' అబ్బా 'అని ( అబ్బా )అరిచాడు .లేచి ముందుకు నడవగా ఒక రాయి తట్టి  పాదమునకు దెబ్బ ( దెబ్బ ) తగిలింది .ఇది మహారాజా! దీని అర్థం. ఇందులో సమస్య లోని అన్ని  పదాలు వచ్చాయి. అంతే తప్ప ఏమి లేదు .ఇదే" దిక్కు తొక్క అంబా శంభో గబుక్కు కసుక్కు అబ్బా దెబ్బ". ఇందులో ఇంకా ఏదైనా ఉంటే కైలాస భట్టునే  చెప్పమనండి" అని  అన్నాడు. దానికి కైలాస భట్టు సిగ్గుతో తలవంచుకున్నాడు. వెంటనే చప్పట్లతో సభాభవనమంతా  మార్మోగిపోయింది. ధర్మవర్మ  పండితుల ప్రతిష్ఠను కాపాడినందుకు  రామశాస్త్రిని  అభినందించి గొప్పగా సత్కరించాడు.