.మతి మరుపు: సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,--ధర్మపురి.

 రామశాస్త్రి  సోమశర్మలు ఇద్దరు మంచి స్నేహితులు. ఎక్కడకు వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్లేవారు.అయితే రామ శాస్త్రికి కాస్త మతి మరుపు ఎక్కువ. వారిద్దరూ ప్రతిరోజూ గోదావరికి సాయంత్రం వెళ్ళి సంధ్యా వందనం చేసుకొని తిరిగి ఇంటికి వచ్చేవారు.
            ఒకరోజు ఎప్పటిలాగానే వారు సాయంత్రం గోదావరికి వెళ్ళారు.అక్కడ స్నానం చేసి సంధ్యావందనం ముగించుకొని కొంతదూరం రాగానే రామ శాస్త్రికి తాను కొత్త సబ్బు బిళ్ళ మరచి పోయానని జ్ఞాపకం వచ్చింది.వెంటనే అతను సోమ శర్మతో తాను ఆ సబ్బు బిళ్ళను తెచ్చు కుంటానని సోమ శర్మతో చెప్పాడు. సోమ శర్మ కొద్దిసేపు అతని కొరకు వేచి వుంటానని వెళ్ళి తెచ్చు కొనమన్నాడు.
          రామ శాస్త్రి పరుగు పరుగున వెళ్ళి చేతిలో ఉన్న మర చెంబు అక్కడ పెట్టి సబ్బు బిళ్ళ తీసుకొని వచ్చి సోమ శర్మను కలిశాడు.ఈ సారి సోమ శర్మ రామ శాస్త్రి తో " అవునూ రామ శాస్త్రీ!నీ చేతిలో మర చెంబు ఉండేది.అది లేదేమిటి"అని ప్రశ్నించా డు.అప్పుడు రామ శాస్త్రికి తాను ఈసారి మర చెంబు అక్కడ పెట్టీ సబ్బు బిళ్ళ తీసుకొని వచ్చానని అర్థమైంది.వెంటనే ఈ విషయం సోమ శర్మతో అన్నాడు.
            సోమ శర్మ ఈసారి సబ్బు బిళ్ళను అతని నుండి లాక్కొని "శాస్త్రీ!నీవు వెళ్ళి ఆ మర చెంబును పట్టుకుని రా!ఈ సబ్బు బిళ్ళ నా దగ్గర ఉండనీ! లేకుంటే సబ్బు బిళ్ళ అక్కడ పెట్టీ మర చెంబు తెస్తావు" అని అన్నాడు.
              వెంటనే రామ శాస్త్రి పరుగు పరుగున ఆ నది వద్దకు వెళ్లాడు. కాని అక్కడ మర చెంబు లేదు.దానిని ఎవరో తస్క రించారు.