సంక్రాంతి సందడి: -- -దాసరి వెంకటరమణ


 రమ్మని ఊరు పిలుస్తోంది

అమ్మలా ఆత్మీయంగా

సంక్రాంతి పండుగ వచ్చిందని,

సంతోషం మోపులు మోపులు తెచ్చిందని,

వచ్చి మోయగలిగినంత మోసుకుపోమ్మని

రమ్మని ఊరు పిలుస్తోంది

అమ్మలా ఆత్మీయంగా


అదేమిటో ఊరికి వెళ్తూంటే 

అమ్మ దగ్గరికి వెళ్తున్నట్టే వుంది

ఊరుముందు మర్రిమాను కిందికి రాగానే

నిశ్చింత సాంతం సొంతమైనట్టు ..ఆ నీడ

ఆచ్చం అమ్మ చీరచెంగును కప్పుకున్నట్టే వుంది

ఊళ్ళో పాదం మోపగానే ..అమ్మ

ఒళ్లో సేద తీరినట్టే ఉంది


తలవాకిట గొబ్బిళ్ళు 

తలమీదుగ కుంకుళ్ళు

నలుగు పిండితో స్నానాలు

నలుగురితో కలసి భోజనాలు

నువ్వులు జల్లిన రొట్టెలు

ఆవిరి కుడికిన కుడుములు

అలుపెరుగని కబుర్లు

ఆరోగ్యాన్నిచ్చే రహస్యాలు


అలరించే కోడిపందాలు

ఆవేశ కావేశాలన్నీ 

ఆటలకే పరిమితం చేసే

ఆత్మీయత పెంచే అనుబంధాలు


హరిదాసుల పాటలు

గంగిరెద్దుల ఆటలు

ఆకాశమే హద్దుగ ఎగిరే

అందాల గాలిపటాలు


ధాన్యం నిండిన కళ్ళాలు

దాతృత్వం నిండిన కళ్ళు

కలిగినంతలోనే కొంత దానం

కాలక్రమానందానికి మూల ధనం


దేశాలు పట్టుకు తిరిగే

జీవచ్చవ పక్షులారా

సంవత్సరానికి ఒకసారైనా

చెట్టు మీదకు చేర రండి

సంవత్సరానికి సరిపడా 

సంతోషం మోసుకుపొండి


అమ్మంటే ప్రకృతి

అమ్మంటే పల్లెటూరు

అమ్ముంటే ఆనందం

అమ్ముంటే ఆరోగ్యం

అమ్ముంటే సంతోషం

అమ్ముంటే సమస్తం

అమ్మకు ఎంత దగ్గరైతే అంత ధనం ధాన్యం

అమ్మకు ఎంత దూరమైతే అంత దీనం దైన్యం

సంక్రాంతి సందడి లోని

రహస్య సందేశం ఇదే!