పచ్చటి బ్యాంక్ !!: -కె ఎస్ అనంతాచార్య


 కరన్సీ కన్నా, బంగారం కన్నా

వేయంతల విలువ

వాణిజ్య విపణీ వీధిలో

సహస్రార 

పూల్ గోబీ విచ్చిన రీతి


పచ్చని బ్లాంకెట్ కప్పి వేసిన చలువ 

కుట్రలు కుతంత్రాలు ఎరుగని తరువు  

భానుడి ప్రతాపానికి ఎదురు నిలిచే   సాహసి!  చక్కటి రూపసి!

 


  క్షేమం అడిగే ఉడత

 తెలుగు పలుకుబడుల చిలుక 

 మువ్వగోపాలుడి చెతిపై వాలి గారాలు పో యే గువ్వ

  మైదానంలో  ఆడపిల్లల మధ్య తొక్కుడు బిళ్ళ ఆడే లేడి పిల్ల 

కాదేదీ ఈ పచ్చని నిధికి అనర్హం ? 


ఈ ధనం ఖర్చు  చేస్తే వందల కరోనా ముళ్ళతో

కాలానికి కత్తుల వంతెన కడుతుంది!

జగతిని రక్త సిక్తం చేస్తుంది! 

కాపాడుకుంటే

ఆదివారం అరటి మొలిస్తే 

మరుసటి రోజే గెల వేస్తుంది 

సాహితీ వంటలో కరివేపయై పరిమలిస్తుంది


ఒక్క పూవు వేల ప్రేమ భావాలను మోసుకొచ్చే వాయు సందేశం  కాయల్ని పండ్లను చేసే చెట్టు గుణ సంజాతం 


బెరడు చెట్టు వేసుకున్న నడుము బెల్టు 

వేరు కుటుంబాల అంటి పెట్టుకొని ఉండమనే చెప్పే అమ్మ ఐక్యతా సందేశం


గుట్టలిప్పుడు ఏడుస్తున్నాయి తమ 

నేస్తాల నరికినప్పుడు ఆపక పోతిమని మొక్కలిప్పుడు దిగులు పడుతున్నాయి ఏవి తల్లి నిరుడు మురిసి న  పర్వత సానువు లు?


మానవజీవితాన్ని పెనవేసుకున్న ఆకుపచ్చని గుడులెక్కడ? 

విషం కోరలు విప్పుకొని సరిహద్దు  సైనికుల  కవాతుల్లో  వేడెక్కి న హిమశీతల వాయువులు! 


నదులిప్పుడు  వానదేవుడి వాకిట్లో నిలబడ్డ చకోర పక్షులు

అనుగ్రహం కలిగే దెప్పుడో


ఇప్పుడింకా అందరం పచ్చల హారాలు అల్లి భూమి బాంకు లాకర్లో పెడదాం!

ఎన్నటికైనా తరగని నిధులను బావి తరాలకు దాచిపెడదాం