మా మునిసిపల్ హైస్కూల్ పరిస్థితి ఒకసారి నాయకత్వ లోటులొ పడిపోయింది.చెట్టులేని చోట ఆమదంచెట్టే మహావృక్షంలాగా ,నాయకత్వ లక్షణాలు ఎంత మాత్రమూలేని నేను,వహీదా అనే ఇంకో అమ్మాయి కేవలం ఫేస్ వాల్యూ వల్ల SPL, ASPL అయ్యాము.అయితే అంది వచ్చిన అధికారాన్ని మేము బాగానే దుర్వినియోగం చేసి బోలెడంత ఆశ్రీతపక్షపాతం కూడా చేసాము.యూనిఫామ్ వేసుకురాని వాళ్ళని నిలబెట్టటం,లేటయిన వాళ్ళని ఒక పిరియడ్ పరిగెత్తించటం ఇలాటి వాటిల్లో మన దోస్తుల్ని వదిలేస్తాం అన్నమాట.అయితే ఒక స్కూల్లోని చిన్న పదవి ఎంత కిక్కు ఇచ్చిందంటే.పొట్టి అనూరాధ అని ఒక పిల్ల ఉండేది.హైట్ లో నాలో సగం ఉండేది.అమ్మాయికి తనంత బారు జడ ,షోడా బుడ్డి కళ్ళద్దాలు,ఎప్పుడూ నవ్వుతూ తమాషాగా ఉండేది.ఆ పిల్లకి కూడా నాలాగే చదువుకోవడం అనేది చాలా అల్పమైన విషయంలా అనిపించేది .ఈ పనికాకుండా మనం ఇంకేదో గొప్పపనికోసం ఈ భూమి మీదకి వచ్చాం అన్న ఫీలింగ్ లో ఉండేవాళ్ళం.క్లాసులోనుంచి ఎప్పుడంటే అప్పుడు బయటికి వెళ్లిపోయే వెసులు బాటు మన పదవి వల్ల మనకొచ్చిన ఎగస్ట్రా పవర్ అన్నమాట.అనురాధని తీసుకుని hm రమ్మన్నారని చెప్పటం,నేను సైకిల్ తొక్కితే అది వెనకాల ఎక్కటం.అన్నపూర్ణమ్మ ఆసుపత్రి ఏరియాలో ఇళ్లు కొంచెం పూర్వకాలం కట్టినవి ఉండేవి.కొన్ని ఇళ్లముందు చెట్లనీడ పడే పెద్ద అరుగులు ఉండేవి.ఇద్దరం ఆ అరుగుల మీద కూర్చుని మిగిలిన మా వయసు పిల్లలు ఎంత మాత్రం మాట్లాడుకోని మేధో చర్చలు చేసుకునే వాళ్ళం.అది NTR, రాజీవ్ గాంధీ ల నాటి రాజకీయాలకాలం .ఇందిరాగాంధీ లోటు పూడ్చాలంటే మనమే ప్రైమ్ మినిస్టర్ కావాలి అని అనుకుని.NTR స్పూర్తితో మనమే సొంతంగా ఒక పార్టీ పెడదాం అని అనుకున్నాం.ఇంక చూడండి .మా ఆలోచనలు,సమాలోచనలు .నేషనల్ పార్టీ కనుక ఆడవాళ్ళ పార్టీ కనుక "భారత భారతి" అని పార్టీ పేరు ఫిక్స్ చేసాం. పార్టీ గుర్తు మొదట అప్పడాల కర్ర అనుకున్నాం సరదాగా, తరవాత వరి కంకి,ఒక ఫాక్టరీ గొట్టం కలిపి ఒకే ముద్ర గా ఉండేట్లు సెలక్ట్ చేసాం.వ్యవసాయం,పరిశ్రమలు రెండూ సమానంగా ప్రగతికి సూచన అని.నీలిరంగు జెండా మీద వెలిగే పొయ్యి,పక్కన ఇల్లు ,ఇంటి ముందు స్కాలర్ టోపి చేతిలో డిగ్రీ తో ఒక తలకాయ( మేము చదువుకోకున్నా సరే).అంటే అందరికి కూడు ,గూడు, చదువు మా లక్ష్యం అన్నమాట.బోలెడన్ని సమస్యలని చర్చించి పార్టీ ఎజండా కూడా తయారు చేసాం.అనూరాధ ఎప్పటికీ పార్టీ శాశ్వత అధ్యక్షురాలు,నేను ఎప్పుడూ ప్రైమ్ మినిస్టర్ అలా ఇద్దరం ఒప్పందం చేసుకున్నాం.ఇంతలోకి ఆఫ్ ఎర్లీ పరీక్షలు వచ్చి మా భారత భారతిని వెనక్కి నెట్టేసాయి. అయితే కుర్చీని అంటుకుని కూర్చునే సాటి నాయకుల బాధని ఒక school SPL పదవిని అలంకరించిన నేను అర్ధం చేసుకో గలను.
మీ విలువైన ఓటు.: -వసుధారాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి