ఊరికి ఉపకారి :--కందర్ప మూర్తి , హైదరాబాదు.

 మంగాపురంలో మాధవయ్య మధ్యతరగతి రైతు.తనకున్న
ఐదు ఎకరాల వ్యవసాయ భూమికి  మరికొంత  భూమి కౌలుకి
తీసుకుని వరి  మిర్చి  కాయకూరలు పెంపకం చేస్తున్నాడు.
    మాధవయ్య అంటే ఊళ్లో అందరికీ గౌరవం. నెమ్మదస్తుడు , 
పరోపకారి. ఊళ్లో ఎవరికి కష్టం వచ్చినా  ఆదుకుంటాడు.
     మాధవయ్యకు రామ లక్ష్మణుల్లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు. తండ్రికి తగ్గ తనయులు వారు.
     పెద్ద వాడు సూర్యం తండ్రికి వ్యవసాయ పనుల్లో సహాయ
పడుతుంటాడు.రెండవ వాడుచంద్రం పట్నమెళ్లి కాలేజీలో
చదువు కుంటున్నాడు.
     తమ్ముణ్ణి  బాగా చదివించి పెద్ద ఉధ్యోగస్తుణ్ణి చేసి ఊరికి
ఉపయోగ  పడేచేయాలను కుంటున్నాడు సూర్యం.
   అన్నదమ్ములిద్దరూ ఒకే మాట  మీదుండి అమాయకులైన ఊరి ప్రజల బాగోగులు చూస్తుంటారు
    మాధవయ్య భార్య నర్సమ్మ క్యాన్సర్ తో చనిపోతే విధవ
రాలైన చెల్లి సూరమ్మ  పిల్లలిద్దర్నీ పెంచి పెద్ద చేసి తన కూతురు
జానకిని సూర్యానికిచ్చి పెళ్లి చేసింది. జానకి కూడా మాధవయ్య
కుటుంబంలో  కలిసిపోయి అందరి మన్ననలు పొందుతోంది.
      సుఖ సంతోషాలతో సాగిపోతున్న ఆ కుటుంబానికి అను
కోని కష్టం వచ్చింది.  మాధవయ్యకు  పొలంలో  జరిగిన ప్రమాదంలో నడుం విరిగి మంచాన పడ్డాడు.వార్దక్యంతో
సూరమ్మ కాలం చెయ్యడంతో కుటుంబ భాద్యత సూర్యం
భుజాల మీద పడింది. తమ్ముడు చంద్రాన్ని జాగ్రత్తగా చదివిస్తున్నాడు.
         ఊరి సర్పంచి నాగరాజు ఆగడాలకు అంతు లేకుండా
పోతోంది. పంచాయతీ  సొమ్ము తన ఇష్టం వచ్చినట్టు దురుప
యోగం చేస్తున్నాడు.ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే అబద్దపు కేసుల్లో
ఇరికించి పోలీసు స్టేషన్ చుట్టూ తిప్పిస్తాడు.అధికారులందరికి
లంచాలు పెట్టి తన చెప్పు చేతల్లో ఉంచు కున్నాడు.  తన రాజకీయ పలుకుబడితో ఊళ్లో ఆడింది ఆట పాడింది పాటగా పెత్తనం చెలాయిస్తున్నాడు.
 
     మాధవయ్య  కుటుంబానికి  ఊళ్లో  ఉన్న  మంచి పేరు నాగరాజుకు కంటగింపుగా మారింది. కమిటీ మీటింగుల్లో మాధవయ్య పెద్ద కొడుకు సూర్యం
 పంచాయతీకి వచ్చే నిధులు ఊరి అభివృద్దికి చేసే జమాఖర్చుల గురించి నిలదీయడం
  
నాగరాజుకి నచ్చడం లేదు. సూర్యానికి జనంలో ఉన్న మంచి
పేరుకు  భయపడి  వెనక్కి  తగ్గి సమయం  కోసం ఎదురు
చూస్తున్నాడు.
       ఊరి గ్రామదేవత పండగ వచ్చింది.  కుటుంబ ఆర్థిక
స్తోమతను బట్టి చందా డబ్బులు వసూలు చేస్తున్నారు. రామాలయానికి  గ్రామదేవత  ముత్యాలమ్మ గుడికి సున్నాలు రంగులు వేయించారు.
    పండగరోజు రాత్రి రామాలయం దగ్గర స్టేజి వేయించి రికార్డు
డ్యాన్స్ పెట్టించాలని సర్పంచ్ నాగరాజు నిర్ణయించాడు.
  సూర్యం రికార్డు డ్యాన్సుకు బదులు బుర్రకథ పెట్టిద్దామన్నాడు.
 దానికి నాగరాజు  ఒప్పుకోలేదు.పంచాయతీ మీటింగులో
అధిక జనం సూర్యానికే మద్దతు పలకడంతో నాగరాజు మాట
చెల్లుబాటు  కాలేదు.మనసులో కుతకుత లాడిపోయాడు.
సూర్యాన్ని ఎలా దెబ్బ తీయాలని ఆలోచన చేస్తున్నాడు.
    పండగ సంబరాలు, బంధువుల రాకపోకలతో గ్రామదేవత
పండగ ప్రశాంతంగా జరిగిపోయింది.
    ఊరి లిక్కర్ బెల్టు షాపు యజమాని ముత్యాల రాజు సర్పంచ్
నాగరాజుకి  స్వయానా  భావమరిది. నాగరాజు అండతో కల్తీ
లిక్కర్ పండగరోజున విచ్ఛల విడిగా అమ్మి డబ్బు చేసుకున్నాడు
సూర్యానికి తెలిసినా పండగ సమయంలో ఊళ్లో గొడవలు
జరగడం ఇష్టం లేక ఊరుకున్నాడు.
    కొన్ని సందర్భాలలో పంచాయతీ  మీటింగుల్లో  అన్నకి
అండగా  చంద్రం  ఉండేవాడు.
     లిక్కర్ వ్యాపారి ముత్యాలరాజును ఎవరో ఊరి బయట
మామిడి తోటలో కొట్టి పడేసా‌రు. తలపగిలి చావుబతుకుల్లో
ఉన్నాడని కబురు తెలియగానే  సర్పంచ్ నాగరాజు పరుగున
అక్కడికి  చేరుకుని   వెంటనే  పట్నంలో  పెద్ద హాస్పిటల్లో చేర్పించాడు.డాక్టర్లు ఎమర్జెన్సీ ఆపరేషన్ జరిపి ప్రాణాపాయం నుంచి కాపాడేరు. స్ప్రుహ లోకి రావడానికి
  సమయం  పడుతుందని చెప్పారు.
      సూర్యమే  కక్ష కట్టి తన భావని మనుషుల్ని పంపి హత్యా
ప్రయత్నం చేసాడని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసాడు నాగరాజు.
     పోలీసులొచ్చి సూర్యాన్ని అరెస్టు చేసి జైలుకి తీసుకెళ్లారు.
ఊరి  జనం సూర్యం  ఈ నేరం  చేసాడంటే  నమ్మడం  లేదు.
ఏదో   గూడుపుఠానీ  జరిగి  ఉంటుందని  అనుమానం కనబరిచారు. ఎంత డబ్బు ఖర్చైనా  పెద్ద లాయర్ని పెట్టి సూర్యాన్ని  ఈ ఆపద  నుంచి  బయట పడేయాలని నిశ్చయించారు.
       ముత్యాల రాజు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు
కాని  తల వెనక  బలమైన దెబ్బ  తగిలి   మతిస్థిమితం కోల్పోయాడు.ఎవరు పలకరించినా పిచ్చి వాడిలా వెర్రి చూపులు చూస్తున్నాడు. తనలో తనే నవ్వుకుంటాడు.. మంచం మీద
నుంచి లేచి పరుగులు పెడుతున్నాడని మంచానికి కాళ్లు కట్టి ఉంచుతున్నారు.
     నాగరాజు  భావ వైధ్యం కోసం చాలా డబ్బు ఖర్చు చేసినా
ప్రయోజనం  లేకపోయింది. డాక్టరు ఎన్ని ప్రయత్నాలు చేసినా
అతని  మానసిక స్థితి   సరిచేయలేక  పోయారు.
     భావ , భావ మరుదులు   ఇద్దరూ ఊరిని  పీడించి అన్యాయంగా డబ్బు సంపాదించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఊరి జనం అనుకుంటున్నారు.
    నాగరాజు ,  భావమరిది  ముత్యాల రాజు అండతో ఎన్నో దుర్కర్మలు జరిపి అన్యాయంగా సంపాదించిన డబ్బు నీళ్లలా ఖర్చయిపోయింది.
 
     ఈ  సంఘటనతో నాగరాజు మానసిక స్థితి దిగజారి బ్లడ్
ప్రెజర్  విపరీతంగా పెరిగి  బ్రైన్ స్ట్రోక్ తో  పక్షవాతంగా  వచ్చి
మంచానికే  పరిమితమై పోయాడు. సర్పంచ్ చేసిన పాపాలకు
దేవుడు తగిన శిక్ష  వేసాడనుకున్నారు ఊరి ప్రజలు.
      పోలీసులు  ముత్యాల రాజు  కేసు విచారణ జరిపి ఘటనా
  స్థలంలో లబ్యమైన ఆధారాలను బట్టి మామిడి తోటలో
పేకాట జూదం కేంద్రంగా  ఉన్నట్లు, పేకాట సందర్భంగా డబ్బు
విషయమై  ఘర్షణ జరిగి  కొట్టుకోవడం  వల్లే  ముత్యాల రాజుకి
బలమైన దెబ్బలు తలకి తగిలి స్ప్రుహ కోల్పోయినట్టు నిర్దారణ
జరిగింది.
    దర్యాప్తులో పక్క గ్రామస్తులు పేకాట ఘర్షణలో ఈ సంఘటన
జరిగినట్టు , ఆ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారణలో
అసలు  విషయం  బయటపడి  సూర్యం  నిర్దోషిగా విడుదలయాడు.
       సర్పంచ్ నాగరాజు అనారోగ్యంతో మంచానికే పరిమిత
మైనందున ఊరి ప్రజలు సూర్యాన్ని కొత్త సర్పంచ్ గా ఎన్ను
కున్నారు.
   సూర్యం సర్పంచి పదవి తీసుకున్న వెంటనే ఊళ్లో విద్య వైధ్య
రక్షిత మంచినీరు  రోడ్డు  మౌలిక వసతులు  కల్పించి ఆదర్స
గ్రామంగా తీర్చి దిద్దాడు.
                        *                    *                     *