సోమరి దోమ (బుజ్జిపిల్లలకు బుజ్జికథ): ౼ దార్ల బుజ్జిబాబు

 ఒక ఊరిలో ఓ దోమ ఉంది. అది భలే సోమరి. ఏ పని చేయదు. ఆకలి అయినప్పుడు ప్రాణుల రక్తం పీల్చి కడుపు నింపుకుంటుంది .అక్కడే ఒక తన టీగ  కూడా ఉంది. ఇది కష్ఠించి పని చేస్తుంది. ఆహారం సేకరించు కుని చక్కగా దాచుకుంటుంది. వర్షాకాలంలో కూర్చోని తింటుంది.
     ఒక రోజు పొద్దున్నే తేనటీగ నిద్ర లేచింది. పువ్వు పువ్వు తిరిగింది. మకరందాన్ని పీల్చింది. ఇంటికి వెళ్ళింది. తాగిన తేనని దాచింది. తిరిగి వచ్చి మళ్ళీ అలాగే చేసింది. ఇలా చేయటం దోమ చూసింది. తనలో తాను నవ్వుకుంది.  
    “ఏం తేనటీగ  అన్నా ! ఏకువ జామునే లేచావు. పడరాని పాట్లు పడుతున్నావు. నీ చీమంత చిన్న పొట్ట కోసమేగా ఈ తిప్పలు. ఆశకు అంతం లేదు. రేపటి గురించి చింత ఏలా?  నేను చూడూ,  ఆకలి అయినప్పుడు మేలుకుంటాను. ఏదో ఒక ప్రాణి మీద వాలతాను. అవసరం అయినంత ఆహారం తింటాను. కడుపు నింపుకుంటాను. తిరిగి మత్తుగా పడుకుంటాను.” అన్నది .
       "దోమ తమ్ముడు ! 'కృషితో నాస్తి దుర్భిక్షం' అంటారు పెద్దలు. పరుల మీద ఆధార పడటం ఆవివేకం. సోమరిగా ఉంటే దారిద్ర్యం వస్తుంది. పనిచేసే వారినే సంపద వరిస్తుంది. సంపదతోనే గౌరవం వస్తుంది" అంది తేనటీగ.
      దోమ కడుపుబ్బ నవ్వింది. " నీవు ఎన్నయినా చెప్పు అన్నా!  నీలా దాచుకోవటం నాచేత కాదుబాబూ.  నా పని దోచుకోవటమే. ఉండు ... ఉండు ... కడుపులో ఎలుకల పరిగెడుతున్నాయి. ముందు దాని సంగతి చూడాలి" అని అటుగా  వెళుతున్న గేద మీద  ఆతృతగా వాలింది. దాని ముల్లు లాంటి తొండాన్ని కసుక్కునా గుచ్ఛంది. రక్తాన్ని పీల్చింది. గేదకు చురుకు పుట్టింది.  తోకతో దోమను బాధింది. ఆ దెబ్బకు దోమ అక్కడే అతుక్కుపోయి మాంసపు ముద్ద అయింది.
నీతి :  ఆత్రుత పడితే అంతే మరి.