కుర్చీ తీసుకెళ్లి విరజాజి చెట్టు దగ్గర వేసుకుని పథేర్ పాంచాలీ చేత పట్టుకుని కూర్చుంటే, అను కోసినా ఇంకా ఆకుల మాటున కనపడకుండా దాగిన ఒకటి రెండు పూల పరిమళం నన్ను సన్నగా తాకింది .మెల్లగా ఆపరిమళం నన్ను మా అమ్మగారింటి విరగపూసిన విరజాజి చెట్ల చెంతకు తీసుకెళ్లింది.ఎండాకాలం మాఇల్లు కోలాహలంగా ఉండేది.సెలవలకు అక్కయ్యలు,పిల్లలు వచ్చేవాళ్ళు.అమ్మ,అక్కయ్యలు వండుకోవటం, ఇంటిపనులు అవీ చేసుకుంటుంటే పిల్లలని ఎమ్మెటర్టైన్ చెయ్యటం నా వంతు.సాయంకాలం ఆరుగంటలకు బయటవాకిలి మొత్తం రెండుమూడు విడతలుగా నీళ్లుచల్లి మట్టిని చల్లపరిచేవాళ్ళం,దారిలా పరిచిన పొడవాటి మాచర్ల బండలకి అటు ఇటు పూల మొక్కలు ఉండేవి. ఆ బండల పైన నీళ్లు పోయాగానే దోసె పెనంలా చుయ్యిమనేవి.. ఎలాగో వాటిని చల్లబరుచుకొని కూర్చోవటానికి యోగ్యంగా మార్చుకున్నాక.పిల్లలకి పూలు కోసే పోటీ తలా ఒక చిన్న కాఫీ గ్లాసు చేతికి ఇచ్చి కోయమనేదాన్ని.మల్లెతీగ,జాజిపెద్ద పందిరి కాక విరాజాజి పూల చెట్లు మూడు ఉండేవి.ఒకటి పందిరి ,ఒకటి చక్కటి గుండ్రటి పొద,ఇంకోటి నేల మట్టంగా తీగ, చెట్టు కాకుండా గట్టి కాండంతో వెరైటీగా పెరిగిన పొద .ఈమూడు విరజాజులు వాటిలో అవి పోటీలు పెట్టుకునేవేమో విపరీతంగా పూసేవి.సాయంత్రం మావాకిలి మొత్తం ఘుమఘుమ లాడిపోయేది ఈ పరిమళాల పోటీకి.పిల్లలందకి అన్నాలు పెట్టటం కూడా నా పనే.ఆరుబయట వేడి వేడి అన్నంలో వేపుడు కూర ఏదైనా కలిపి అందరినీ కూర్చోపెట్టి కధలు చెపుతూ ముద్దలు పెడుతుంటే చక్కగా తినేసేవాళ్ళు.(ఈ కధలు చెప్పే అలవాటు అప్పటిది).వీళ్ళలో మా వినీల మా లక్ష్మి అక్కయ్య కూతురు చాలా తెలివైనది రోజూ ఒక కొత్త కధ చెప్పమని అడిగేది.ఆ పిల్లకోసం కధలు కల్పించటానికి బుర్రని తెగ వాడాల్సి వచ్చేది.వెన్నెల్లో పాలబువ్వలు తినటం అయ్యాక, పడుకోవటానికి పక్కలు అన్నీ ఆరుబయటే వేసుకునే వాళ్ళం.వరుసగా అందరు నులక మంచాలు వేసుకుని ఇంక ఒకటే కబుర్లు ,ఒకళ్ళు ఇంకపడుకోండి అని ఆపితే ఇంకొకళ్ళు ఇంకేదో చెప్పటం ఇలా ఉండేది. నేను మాత్రం అందరినుంచి దూరంగా నామంచం తీసుకెళ్లి విరజాజి పందిరి పక్కన్న వేసుకునేదాన్ని. రాణి గారి లక్షణం కదా విలక్షణంగా ఉండటం.మాఇల్లు ఊరికి దూరంగా ఉండటం వలన దీపాల కాంతి తక్కువగా ఉండి .అందువల్ల ఆకాశం తెర చాలా స్పష్టంగా ఉండేది 70mm రేంజ్ లో.వెన్నెలరోజులు సరేసరి.అమావాస్య దినాలు అద్భుతంగా ఉండేవి.మా పద్మక్కకి కొంచెం నక్షత్ర జ్ఞానం ఉంది .కొన్ని గ్రహాలు ,రాసులు అవీ చూపుతుండేది.నాకు మాత్రం సప్తఋషి మండలం,అరుంధతి మాత్రం బాగా తెలుసు.ధ్రువతారని కూడా ఉత్తరం దిక్కున గుర్తు పట్టగలను.పెళ్లిచేసుకున్నప్పుడు పెళ్ళికొడుకుకు అరుంధతి నన్ను చూపమని చెపితే బాగుండును మన పాడిత్యం చూపొచ్చు కదా అనుకునేదాన్ని.ఐతే నా పెళ్లి ముహుర్తం మధ్యాన్నం కావటంవలన పురోహితుడు సాయంత్రం 4 గంటలకే లేని అరుంధతిని చూపించాడు.భూమినించి పంపిన సాటిలైట్లు,ఉల్కలు ,బాగా రాత్రి అయ్యాక కాంతితో నిండిన పాలపుంత ఇవన్నీ కొంచెం సేపు గమనిస్తే తెలుస్తూ ఉండేవి.సూర్యోదయం, సూర్యాస్తమయం రోజూ మనం చూడగలిగే గొప్ప ఖగోళాద్భుతాలు ,ఐతే రోజూ ఉండటం వలన మనకి చిన్న చూపు కానీ.ఇలా నేను తీరికగా చుక్కలు లెక్కపెట్టుకునే బాధ్యతలు లేని దశలో వున్నప్పుడు .మరో ఖగోళఅద్భుతం మనకి చూడటానికి అనుభవం లోకి వచ్చింది. 1986 లో అనుకుంటా హెలి తోకచుక్క వచ్జింది.ఇంకేముంది కోతికి కొబ్బరి కాయ దొరికినట్లు మాకు పెద్ద సంబరం.ఎడ్మండ్ హెలి 1758 లో కనిపెట్టిన తోకచుక్క అప్పటి నుంచి ఆయన పేరు మీదగా పిలవబడుతోంది.ప్రతి 76 సంవత్సరాలకి ఇది మనకు కనపడుతుంది.మా బావగారు జువాలజీ లెక్చిరర్ కదా ,ఆయనకి మాకు సైన్స్ కి సంబంధించిన విషయాలు చెప్పటం చూపటం చాలా ఇష్టం.కాలేజీ లోని ఫిజిక్స్ ల్యాబ్ లో వుండే టెలిస్కోప్ లో మాకు ఈ హెలి తోకచుక్కను చూపారు .అది ఎంత అందమైన అనుభూతి అంటే జీవితానికి ఒక్కసారే కలిగేది.నేను చేసిన నక్షత్ర జపానికి మెచ్చి ఆ భగమంతుడు నాకు మా బావగారి రూపంలో ఆ అవకాశం ఇచ్చాడు అనిపించింది.ఒకసారి ఎర్రమట్టి వర్ణంలో, ఇంకోసారి లేతవంకాయ వర్ణంలో హెలి నాకు కనుల విందు చేసింది.విరజాజి పరిమళం నిన్న నన్ను హెలి తోకచుక్క దాకా ప్రయాణం చేయించింది.మళ్ళీ హెలి వస్తుంది 2061 లో నేను అప్పుడు అక్కడే ఉండి మరి కాసంత దగ్గర నించి చూడగలనేమో.
నా నక్షత్రజపం.:- వసుధారాణి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి