నా చేతిరాత.:- వసుధారాణి.

 
సాధారణంగా పెళ్ళియైన కొత్తల్లో బంధువులు,స్నేహితులు తమ ఇళ్ళకి కొత్త్తజంటని పిలవటం  వాళ్ళు  వెళుతుండటం పరిపాటి కదా .అలా మేమూ  కొత్త జంటగా మారిన కొత్తల్లో నెల్లూరులో మా అత్తగారి స్నేహితురాలు గారింటికి భోజనానికి వెళ్ళాం . ఏదో మామూలు విశ్రాంత లెక్కల మాస్టారి ఇల్లు అనుకున్నా నా జీవితాన్ని మార్చేసే ఇల్లు అని నాకు అప్పుడు తెలియలేదు.
శ్రీ అన్నలూరి రామమూర్తి అయ్యవారు (నెల్లూరు జిల్లాలో మాస్టర్లని అలాగే అంటారు) మా కుటుంబానికి కుటుంబ మిత్రులు.నెల్లూరు సాహితీ ప్రియులకు సుపరిచితులు.వారి సతీమణి ,మా అత్తగారికి మంచి స్నేహితురాలు.రామమూర్తి అయ్యవారు కనిగిరిలో పని చేసినప్పుడు మాయింటి పక్కనే ఉండేవారట అలా రెండు కుటుంబాల పిల్లలతో సహా మంచి కలివిడిగా వుండేవారుట.
మొత్తానికి వారి ఇంటికి మేము,మా అత్తగారు,మా ఆడపడుచు అందరం కలిసి వెళ్ళాం.కుశలాలు అయిన తర్వాత మా అందరినీ నవ్వు మొహంతో చూస్తూ కొంచెం దూరంలో  కూర్చున్న  ఆయన అమ్మాయి ఇలారా అంటూ తన దగ్గరికి పిలిచారు నన్ను.అసలే మనం చదువులో వీకు, పైగా లెక్కల టీచర్ అంటున్నారు అనుకుంటూ కాస్త భయంగానే ఆయన దగ్గరకు వెళ్ళాను.
ఆయన పక్కనే ఉన్న కుర్చీ చూపించి కూర్చో అన్నారు, మనకి కుదురుగా కూర్చునే లక్షణమే లేదు , ఏదో కొద్ది కొద్దిగా బుద్ధిగా ఉండటం అపుడపుడే ప్రాక్టీస్ చేస్తున్నా .వీలైనంత వద్ధికగా పడమూడో ఎక్కమో,పదిహేడో ఎక్కమో అడగరు కదా అనుకుంటూ కూర్చున్నా.
నీకుడి చెయ్యి ఇయ్యి నాయనా అన్నారు .కోతి బుద్ధికి వెంటనే జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా శ్రీదేవి మానవా నీ వామహస్తము డవిలాగు గుర్తొచ్చింది. 
ముఖం చాలా  సాధారణంగా పెట్టి నా వామహస్తము ఆయన వైపు చాపా. ఆయన నాచెయ్యి పుచ్చికుని అరచేతిని కనపడేలా తిప్పుకుని అబ్బబ్బా ఏమి చెయ్యి నాయనా నీది అన్నారు.అప్పటికి నాకు అర్ధం అయ్యింది. మనం అనవసరంగా భయపడ్డాము ఈయన ఎక్కాలు, లెక్కలు అడగటానికి మనల్ని పిలవలేదు . నా వామహస్తము చూసి హస్తసాముద్రికం చెపుతున్నారు అని.
అప్పటి వరకు ఇలా ఎప్పుడు ఎవరి దగ్గరా ఇలా చెయ్యి చూపలేదు.జాతకం కూడా మా ఆడపడుచు వాళ్ళ ఆయన మా జయరాం అన్నయ్య గారు చూసారు మా ఇద్దరికీ మ్యాచ్ అవుతుందా లేదా అని అంతే .మాఇంట్లో అసలు ఈ అలవాటు లేనే లేదు .  సహజమైన ఆసక్తితో ఆయన ఏమి చెపుతారా అని అందరం ఆయన కేసి చూసాము. నాయనా నీ రేఖలు ఎంత బాగున్నాయో అంటూ బోలెడన్ని పాజిటివ్ విషయాలు చెప్పారు.అమ్మయ్య ఈయనకి అన్నీ తెలిసినయి కానీ మనం లెక్కల్లో వీకని తెలియలేదు అంతే చాలు అనుకున్నా.ఆరోజుకి నా ఇంట్రస్ట్ అంతే.
భోజనాలు ,కబుర్లు,జ్ఞాపకాల కలబోతలు అన్నీ ఐపోయి బయలుదేరే ముందు ,నాయనా నువ్వు చెయ్యి చూడటం నేర్చుకో నీకు ఆవిద్య వస్తుంది అని చెప్పారు నాతో రామమూర్తి అయ్యవారు.నాకు అసలే ఏదన్నా నేర్చుకోవడం అంటే మహాబద్ధకం ,గాలిపీల్చటం లాంటివి వాటంతట అవి వచ్చాయి కనుక సరిపోయింది.అసలు నా బుర్రలో నేర్చుకునే చిప్ అన్నదే లేదని నా గట్టినమ్మకం.సరే ఓ చిరునవ్వు నవ్వి వచ్చేసాం.
తరవాత ఒకటి రెండు సార్లు వారి ఇంటికి వెళ్లటం ,వెళ్లిన ప్రతిసారీ ఆయన నన్ను పిలిచి నా చెయ్యి చూడటం ,నువ్వునేర్చుకో నాయనా అని చెప్పటం .ఇలా జరిగింది.ఒకసారి చాలా రోజుల తర్వాత 1995 లో అనుకుంటా పిల్లల్ని తీసుకుని వెళ్ళాము. మూడు నాలుగు సార్లు ఆయన చూసే పద్దతి నేను చూడటం వలన ఆసారి నాకు  ఆయన చెప్పేటప్పుడు ఏరేఖ చూసి దానికి సంబంధించి ఏవిషయం చెపుతున్నారు అని కొంచెం కొంచెం అర్థం అయ్యింది. పైగా ఆయన నాకు ఇంట్రస్ట్ కల్పించటానికి అనుకుంటా, ఆయన చూసే రేఖల్ని నాకు వివరిస్తూ  చెప్పారు.ముఖ్యమైన రేఖలు ఏమిటి అన్న అవగాహన కొద్దిగా వచ్చింది.నీకు అదే వస్తుంది నాయనా ఈ పుస్తకాలు చదువుకో అంటూ రెండు పుస్తకాలు కూడా ఇచ్చారు.
ఇంటికి వచ్చాక ఎలా అలవాటు అయ్యిందో ఖాళీగా ఉన్నపుడు నా చేతులు నేనే చూసుకోవటం గురువుగారి మాటలు గుర్తు చేసుకోవటం.చిన్నగా ఆయన ఇచ్చిన పుస్తకాలు చదవటం మొదలు పెట్టాను.రకరకాల గుర్తులు,రేఖలు అన్నీ నాచేతిలో ఉన్నాయా లేదా సరిచూసుకోవటం .ఇలా ఒక ఆసక్తి ఏర్పడింది.నా చేయి కాకుండా కొత్త చేతులు చూడాలనే ఆకాంక్ష పుస్తకాలు చదివే కొద్దీ ఎక్కువైంది.
ఎవరైనా చేతులు తిప్పుతూ మాట్లాడుతున్నా,రేఖలు కనపడేలా టీవీ లో ఎవరినైనా చూసినా గమనిస్తూ వుండేదాన్ని. చివరికి శస్త్రచికిత్స నేర్చుకున్న వైద్యుడికి ప్రయోగానికి శరీరం కావాల్సి వచ్చినట్లు నాకు చెయ్యి కావాల్సి వచ్చింది.మనం నేర్చుకున్న విద్య పరీక్షించు కోవటానికి.
అపుడు మేము ప్రొద్దుటూరులో వున్నాము .ఇంట్లో చిన్న నర్సింహులు అని అటెండర్ ఉండేవాడు కొంచెం అమాయకుడు.ఒకరోజు నర్సింహులూ నీ చెయ్యి చూపు అన్నా మనం చెప్పిన మొట్టమొదటి భవిష్యవాణి ఏమనగా నీకు త్వరలో పెళ్లి అవుతుంది కానీ నీవు, నీ భార్యా విడి పోతారు అని.నిజంగానే అతని ఉద్యోగం పర్మినెంట్ అయ్యి, చక్కని అమ్మాయిని ఇచ్చి అతనికి పెళ్లి చేశారు .నేను చెప్పిన కొద్దిరోజులకే..  (  సశేషం)