ఆ కుర్రాడు విరగ్గొట్టలేదండీ:-- యామిజాల జగదీశ్
 రిటైరైన ఓ తమిళ ఉపాధ్యాయుడు చెప్పిన విషయంమిది.
అప్పట్లో స్కూల్స్ ఇన్ స్పెక్టర్లు తనిఖీకొచ్చేవారు. అలా వచ్చినప్పుడు ఆయన టీచర్లు ఎలా పాఠాలు చెప్తున్నారు? పిల్లలెట్లా చదువుతున్నారు వంటివన్నీ పరీక్షించేవారు. 
ఈ క్రమంలోనే ఓ ఇన్ స్పెక్టర్ ఓ గ్రామంలో ఉన్న పాఠశాలకు వెళ్ళాడు. ఆయనకు రామాయణ కథ బాగా వచ్చు. ఇష్టంకూడా. అయితే అందరికీ రామాయణం తెలుసని అనుకుంటూ ఉంటారు. 
అందుకే ఓ క్లాసులోకి వెళ్ళగానే ఓ విద్యార్థిని ప్రశ్నించారు "జనకుడి ధనుస్సుని ఎవరు విరగ్గొట్టారు?" అని. 
అయితే ఆ విద్యార్థి భయం భయంగా మొహం పెట్టి "అయ్యా! నేను విరగ్గొట్టలేదండి" అన్నాడు. 
ఆ జవాబుతో చిర్రెత్తుకొచ్చిన ఇన్ స్పెక్టర్ టీచర్ వంక చూసి ఏమిటీ జవాబు? మరీ ఇంత అయోమయంగా ఉన్నాడేంటీ ఈ కుర్రాడూ అన్నారు.
అంతట టీచర్ "వాడు ఎవరి జోలికీ వెళ్ళడండి. ఎవరితోనూ తగవులాడడండి. వాడు ధనుస్సు విరగ్గొట్టలేదు కనుకే అలా అన్నాడండి" అన్నాడు.
ఈ జవాబు ఇన్ స్పెక్టర్ ని ఆవేశపరుడ్ని చేసింది. వెంటనే హెడ్మాస్టర్ దగ్గరకు వెళ్ళి తరగతిలో జరిగినదంతా చెప్పాడు. 
ఆయన చెప్పినదంతా విన్న హెడ్మాస్టర్ "ఇందులో తప్పేముందండి...మా స్కూలు విద్యార్థులు కానీ మా మాస్టార్లుకానీ ఎప్పుడూ ఎవరి జోలికీ వెళ్ళరండి. అయినా దర్యాప్తు జరిపి ఎవరు విరగ్గొట్టారో మీకు చెప్తానండి" అన్నాడు.
ఈ జవాబుతో ఇన్ స్పెక్టర్ కోపం కట్టలు తెంచుకుంది. తిన్నగా విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారి దగ్గరకు వెళ్ళి విషయమంతా చెప్పాడు. 
ఆ అధికారి అంతా విని ఈరోజుల్లో ఏవీ సరిగ్గా తయారు చేయడం లేదండి. నాణ్యత లేనివవడంవల్లే అన్నీ సులభంగా విరిగిపోతున్నాయి. పాడైపోతున్నాయి. అయినా ఓ పల్లె స్కూలుకి వెళ్ళి అక్కడి అమాయక విద్యార్థులను ఇలాటి ప్రశ్నలడగడం ఏమీ బాగులేదండి అన్నాడు. ఇకముందు ఇలాటి ప్రశ్నలు అడక్కండి అని సూచించాడా అధికారి. 
ఇన్ స్పెక్టర్ కి జుత్తు పీక్కున్నంత పనైంది.
ఇంకెక్కడా ఆగకుండా తిన్నగా ఇంటికి వెళ్ళిన ఇన్ స్పెక్టర్ తన భార్యతో అంతా చెప్పి "వొళ్ళెవరికీ బుర్రలు లేవుగానీ....నువ్వు చెప్పు ఎవరు విరగ్గొట్టారో" అని ఆడిగాడు. 
అయితే ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా 
"ఇదికూడా తెలీదనుకున్నారా? మనందరికీ తెలిసిన రాజామణే ఆ ధనుస్సుని విరగ్గొట్టాడండి" అంది. 
ఈ రాజామణి ఎవరంటే ఆ ఊళ్ళో కొద్ది రోజుల క్రితం ప్రదర్శించిన రామాయణం నాటకంలో రాముడి పాత్ర పోషించాడు. 
ఆ తర్వాత ఇన్ స్పెక్టర్ ఇంకెవరినీ రామాయణానికి సంబంధించి ఎలాటి ప్రశ్నలూ అడగలేదు.