చెప్పుడు మాటలు (బుజ్జిపిల్లలకు బుజ్జికథ) ౼ దార్ల బుజ్జిబాబు

 ఒక అడవిలో పెద్ద మడుగు ఉంది. 
అందులోఓ కప్ప, చేప స్నేహంగా ఉండేవి. 
ఆపద వచ్చినప్పుడు ఒకదానికి ఒకటి చెప్పుకొని తప్పించుకునేవి. 
అదే ప్రాంతంలో ఒక యండ్రకాయ ఉంది. 
దానికి వాటిఅన్యోన్యత నచ్చేది కాదు. 
వాటిని విడదీయాలి అనుకుంది.
ఒకరోజు చేపలేని సమయం చూసి కప్పవద్దకు వచ్చింది. ఇలా చెప్పింది. 
"కప్ప బావా! నీకు ఆ దిక్కుమాలిన చేపతో స్నేహం ఏమిటి? మానవుడిలాగా నీవెంతో తెలివైనవాడవు. గొప్పవాడవు. 
       పొడి నేలపై కూడ పరుగెత్తగలవు. 
       చేపకుఏం తెలుసు? చింతకాయ పచ్చడి. 
       సుద్ద మొద్దు. 
       ఒట్టి తిండిపోతు.
       అమాయకపు గొడ్డు. 
       అయినా ఇవన్నీ నాకెందుకులే. 
       చెప్పాల్సింది చెప్పాను. 
       నీ మేలు కోరే మిత్రునిగా...” అంది.
       పొగడ్తలకు కప్ప కడుపు ఉబ్బింది. 
       తబ్బిబ్బుతో తేలాడింది.
       ఆ తరువాత కప్పలేని వేళలో చేప చెంతకు చేరి “చేప అల్లుడూ! బాగున్నావా? నీవెక్కడ, ఆ కప్ప ఎక్కడా? దానితో స్నేహం ఏమిటీ? ఎవరైనా వింటే నవ్వుతారు.
        నీ పొలుసుల అందం ముందు దాని ముడుతుల చర్మం దిగదుడుపే.
        అది బురద గుంటలలోనే బ్రతికేది.
        మరి నీవో, మహా సముద్రాలలో అయినా ఈదుకురాగలవు.
       అది తెలివితక్కువ దద్దమ్మ. 
       పొగరుబోతు బడుద్దాయి.
       దానితో స్నేహం మానేయి" అన్నది.
        చేప ఆలోచనలో పడింది. యండ్రకాయ చెప్పింది సబబుగానే తోచింది. 
       ఆ రోజు నుండి రెండింటి మధ్య స్నేహం చెడింది.  
       ఆపదలో సాయం మానేశాయి.
       ఒక రోజు ఓ కొంగ వచ్చింది. పొంచి చూస్తుంది.
       కప్ప ఒడ్డున కూర్చొని గమనిస్తూ ఉంది.
       కప్ప అరచి ఉంటే చేప పారిపోయేదే.
       అలా చేయలేదు.
       చేప నీటిపైకి వచ్చింది. 
       కొంగ పట్టేసుకుని గట్టు మీదకుతెచ్చి కాళ్ల క్రింద ఇరికించుకుంది. 
       ఇంతలో ఓ పాము కప్ప వైపు వస్తుంది. 
       చేప చూసింది. 
       చప్పుడుచేస్తే కప్ప తప్పించుకునేదే.
       గమ్మున ఉంది. 
       పాము కప్పను నోట కరచుకుంది.
       చేప కొంగకు, కప్ప పాముకు ఆహారం అయ్యాయి.
       నీతి : చెప్పుడు మాటలు వింటే చేటు కలుగక తప్పదు.
కామెంట్‌లు