పుచ్చకాయ సంచారం (బుజ్జిపిల్లలకు బుజ్జికథ):౼ దార్ల బుజ్జిబాబు.

        ఒక పుచ్చకాయ ఉండేది.
        అది ప్రపంచ సంచారం చేయాలని అనుకుంది. 
       వెయ్యినొక్క భాషలు నేర్చుకుంది.
       సూట పదహారు శాస్త్రాలు చదివింది. 
       వేషం మార్చుకుని పౌర్ణమి రోజున బయలుదేరింది. 
       ఓడ ఎక్కి  ఐదు మహా సముద్రాలు చూసింది. 
       విమానం ఎక్కి ఏడు ఖండాలు తిరిగింది.
        ఉత్తర, దక్షిణ ధృవాలు పరిశీలించింది.
        టండ్రా మంచు గడ్డలపై నడిచింది. 
        ఇగ్లూ ఇళ్లలో భోజనం చేసి కుక్కలులాగే స్లెడ్జి బండిలో షికారుకు వెళ్లింది. 
       అమెజాన్, నైలు నదులలో స్నానం అడింది. 
       ఇంగ్లీష్ కాలువను ఈదుకుంటూ దాటింది. 
       మృత సముద్రంలో మునిగి తేలింది. 
       నయాగారా జలపాతం అందాలను ఆరగించింది.
       సహారా ఎడారి ఎండలో ఎగిరింది. 
       ఈఫిల్ శిఖరం పై ఎక్కి ఆపిల్ పండ్లు తిన్నది.
        ఈజిప్పు పిరమిడ్లలోని మమ్మీలను పరిశీలించింది. 
       మక్కా మసీదులో నమాజు చేసింది. 
       బెత్లెహేములో ప్రార్ధనలు జరిపింది. 
       చైనా గోడపై గోలీలు ఆడింది.
       ఇమ్రాన్ ఖాన్ తో    ఇష్టాగోష్ఠి చేసింది. 
       బైడేన్ తో బాతాకాని వేసింది. 
       పోప్ జాన్‌పాల్‌ను ఆలింగనం చేసుకుంది. 
       ఐక్యరాజ్య సమితికి వెళ్లి శాంతి చర్చలు జరిపింది. 
       ప్రపంచ బ్యాంక్ కు వెళ్లి ఆంధ్ర అభివృద్ధికి అప్పు తీసుకుంది. 
        స్విట్జర్లాండ్ వెళ్లి డబ్బును స్విస్ బ్యాంక్ లో దాచింది.
        బిన్ లాడెన్ వారసులను  రహస్యంగా  కలిసింది. 
        చార్మినార్ లో గడిపి ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడింది. 
       ఇక అమావాస్య వచ్చింది. 
       ఇంటి వైపు గాలి మళ్లింది.
        "అయ్యో నేను వచ్చి అప్పుడే పదిహేను రోజులు అయింది.
       ఇంటిపై బెంగ పుడుతుంది.
       త్వరగా వెళ్లిపోవాలి. 
       తిరిగి వెళ్లాలంటే ఎన్నినాళ్లు పడుతుందో? 
       మాఊరు చేరతానో లేదో? 
       అది ఎటువైపున ఉందో ఏమో?
       ఇప్పుడు ఎలా?  చాలా భయంగా ఉంది” అనుకుంది.
       ఇంతలో ఒక చీమ ఎదురు అయింది.
       "చీమా! చీమా! మా ఊరు ఎటో చెప్పవా?" అడిగింది
పుచ్చకాయ.
        “అదుగో అదే నీ ముందు ఉన్నదే మీ ఊరు" అంది చీమ.
        పుచ్చకాయ ముక్కుమీద వేలు వేసుకుంది. 
       “చీమా! ఇక్కడకు ఎలా వచ్చాను? ఇది ఎలా సాధ్యం? కల కనలేదు కదా?" అన్నది పుచ్చకాయ.
        "లేదు. లేదు... ఇది సాధ్యమే. భూమి గుండ్రంగా ఉంది. 
ఎక్కడ బయలుదేరితే అక్కడికిరావచ్చు" అంది చీమ.
        "అది ఎలా? అర్ధం కాలేదు. కొంచెం వివరించి చెప్పవా చీమ?" అడిగింది పుచ్చకాయ.
       సరే అలా కదలకుండా ఉండు" అని పుచ్చకాయపై ఎక్కింది.
        బొడ్డు దగ్గర గుర్తు పెట్టి బయలుదేరింది. 
        చుట్టూ తిరిగి బొడ్డు దగ్గరకు వచ్చింది.
        "ఇప్పుడు అర్ధం అయిందా" అంది చీమ.
        "ఆ.." అంది ఆనందంగా పుచ్చకాయ.
       నీతి : తలచుకుంటే సాధ్యం కానిదే లేదు.
కామెంట్‌లు