ఆట వెలదులు (చిత్ర పద్యాలు):-- ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు
చేద బావి వద్ద చేడియలెల్లరు 
నీటి కడవలెత్తి  నిలిచి యుండి 
వంతు వచ్చు వరకు వంట ముచ్చటతోడ
వేయి మాట లాడి  వెడలుచుంద్రు!

గిలక సవ్వడులకు పులకించు మనసులు 
తాడు జారుచుండు తరుణి చేత 
నీటమునుగు బిందె నిర్మలజలములు 
ఇంటిలోని వారి కెంతమేలు !

పూడికలను దీసి పూలమొక్కలకేయ 
మట్టి సత్తువకును మరియుపూయు!
పసుపు కుంకుమలను పాటిగబెట్టుచు
గంగ పూజజేయ ఘనతగల్గు!

జోరు వానలకును చోద్యము జలములు 
 అంచువరకు నిలుచు నబ్బురముగ
బిందె ముంచుకొనుచు బిగువగు నడుముపై 
చక్కగాను యుంచి చాన నడచు!


కామెంట్‌లు