వినయం – గర్వం:--సాత్విక్ సాయికుమారాచార్యులు,6వతరగతి,9491357842

 ఒకరోజు అశ్వారావుపేటనుండి ఉదయ్, వాళ్ల అన్నయ్య రాము,అక్క శ్వేత తమ తల్లిదండ్రులతో కలిసి ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్లారు. దేవుని దర్శనం అయిన తరువాత అక్కడి చెట్ల క్రింద కూర్చొని తమ కూడా తెచ్చుకున్న అల్పాహారం భుజించి కాసేపు విశ్రాంతి తీసుకుందామని దుప్పటి పర్చుకొని నడుం వాల్చారు. అంతకు ముందే వాళ్లు కొనుక్కున్న ప్రసాదాలు సంచీలో పెట్టుకొని తమ తల వద్దఉంచుకున్నారు. ఉదయ్ వాళ్ల అన్నయ్య రాము ప్రక్కప్రక్కనే పడుకున్నారు. అలసిపోవడంతో ఉదయ్ నిద్రలోకి జారుకున్నాడు. అక్కడి చెట్టుక్రింద చీమల పుట్టలో ఉన్న చీమలు ఆహారాన్ని వెతుక్కుంటూ బారులు తీరాయి. అందులో నల్ల చీమలు ఒకవైపు నుండి ఎర్రచీమలు మరో వైపునుండి వస్తున్నాయి. అవి రెండూ ఉదయ్ దాచుకున్న ప్రసాదం వైపుకి బయలు దేరాయి. ముందుగా వస్తున్న నల్లచీమలు తమ దారికి అడ్డుగా ఉన్న ఉదయ్ కాలి వద్ద కాసేపు ఆగి ఇలా అనుకున్నాయి. బాటసారులు విశ్రాంతి తీసుకుంటున్నారు. వారిని కదిలించకూడదు అని వినయంగా అనుకుంటూ కాలిపై నుండి మెల్లగా దాటసాగాయి. ఉదయ్ కి కాలిపై కితకితలు గా అనిపించి కాలిని పక్కకు జరుపుతాడు. దానితో  చీమలు ఇతను చాలా మంచివాడులా ఉన్నాడు మన దారికి అడ్డు తొలిగాడు అనుకుంటూ తమ గమ్యానికి చేరుకున్నాయి.  ఆ తరువాత వస్తున్న ఎర్రచీమలు అడ్డుగా ఉన్న ఉదయ్ మరో కాలివద్ద ఆగాయి. ముందుగా ఉన్న చీమ తలకెక్కిన గర్వంతో ఊగిపోతూ ఇలా అంటుంది. మిత్రులారా ఇతగాడు మన దారికి అడ్డుగా వచ్చాడు. మనమేంటో ఇతనికి తెలియచేద్దాం దాడి చెయ్యండి అంటూ గర్వంతో మాట్లాడగా మిగతా చీమలన్ని కలిసి ఉదయ్ కాలిపై దాడి చేసి కుట్టసాగాయి. ఉదయ్ కి నిద్రాభంగమై కాలిమీద ఏవో కుడుతున్నాయని గ్రహించి అంతే వేగంతో చేతితో టపాటపా కొట్టసాగాడు. కాలిపైకెక్కిన చీమలన్ని మరణించాయి. గర్వంతో ప్రవర్తించినందుకు ఫలితం  అనుభవించాయి. వినయంతో ప్రవర్తించిన నల్ల చీమలన్నీ తమ లక్ష్యానికి చేరుకోగా గర్వంతో ఊగిపోయిన ఎర్రచీమలు తమ గమ్యానికి చేరుకోకుండానే మధ్యలోనే ప్రాణాలు కోల్పాయాయి. చూసారు కధా గర్వం ఎప్పటికీ హానికరమే. అందుకే గర్వంతో ప్రవర్తించకుండా వినయం కలిగి ఉంటే  ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయాన్ని సాధించవచ్చు. 

సాత్విక్ సాయికుమారాచార్యులు
6వ తరగతి
సూర్యపబ్లిక్ స్కూల్,అశ్వారావుపేట
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
9491357842 

కామెంట్‌లు