లాభం - నష్టం:--సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,ధర్మపురి. మొబైల్: 9908554535.

  కనకయ్య తన ఇంట్లోని బంగారు చంద్ర హారాన్ని కొడుకుకు  తెలియకుండా రామాపురంలోని విశ్వనాథానికి అమ్ముదామని బయలుదేరాడు. ఎందుకంటే తన కొడుకుకు చెప్పితే అతడు అమ్మనివ్వడని కనకయ్య  భయం. అంతే కాకుండా తన అవసరాలకు డబ్బు కావాలి . కనుక తన వద్ద వారికి తెలియకుండా ఉన్న ఒకే ఒక్క బంగారు నగను అమ్మకానికి  పూనుకున్నాడు. ఆ నగను తీసుకున్న విశ్వనాథం కనకయ్యకు దాని ధర  యాభై వేల రూపాయలను ఇచ్చాడు. తాను ఇరువది ఐదు వేలకు  తన భార్యకు అప్పుడెప్పుడో చేయించిన నగ. తాను ఇప్పుడు అమ్మితే యాభై వేల రూపాయలు  వచ్చేసరికి ఎంతో లాభం వచ్చిందని సంబరపడ్డాడు కనకయ్య.
         కనకయ్య కొడుకు చంద్రయ్య చాలా కష్టపడి డబ్బు సంపాదించ సాగాడు. అతని భార్య తనకూ ఒక బంగారు హారం చేయించమని పోరు పెట్టింది .భార్య పోరు  పడలేక బంగారాన్ని కొని,తన  భార్యకు చంద్రహారం చేయిద్దామని తండ్రికి చెప్పకుండా రామాపురం లోని విశ్వనాథం వద్దకు వెళ్లాడు చంద్రయ్య.  విశ్వనాథానికి చంద్రయ్య కనకయ్య కొడుకు అని తెలియదు. విశ్వనాథం కనకయ్య వద్ద కొన్న  బంగారు చంద్రహారాన్ని  అతనికి చూపి ఇది చాలా మేలు రకపు బంగారంతో చేసిన నగ అనీ, మీరు కొత్తగా చేయించ వలసిన  అవసరం లేదనీ, మీకు ఒక వెయ్యి రూపాయలు కూలి ఆదా అవుతుందని ,దీని ఖరీదు అరవై వేలు అని చెప్పాడు.
         చంద్రయ్య సంతోషించి అరువది వేల రూపాయలు  చెల్లించి ఆ హారాన్ని తెచ్చి తన  భార్య మెడలో వేశాడు. భార్య ఎంతో సంతోషించింది. తెల్లవారి తన కోడలు మెడలో ఆనగ చూచిన కనకయ్యకు అది తాను అమ్మిన నగ కావచ్చని అనుమానం వచ్చి, అది ఎక్కడిదని ప్రశ్నించాడు? మీ కుమారుడు చేయించాడని కోడలు చెప్పింది. అప్పుడు కనకయ్య చంద్రయ్యను  ప్రశ్నించగా రామాపురం విశ్వనాథం తనకు ఇది అరువది వేలకు అమ్మాడని చెప్పాడు.
        వెంటనే కనకయ్య కోడలును ఆ నగను ఒకసారి మెడలో నుంచి తీసి ఇమ్మన్నాడు.  చాటుగా వెళ్లి ఆ నగను పరీక్షించగా తన పేరు ఆ నగపై  కనబడింది. విశ్వనాథం ఎంత పని చేశాడని అనుకున్నాడు కనకయ్య .  ఒక్క రోజు తేడాతో తన దగ్గర కొని  తన కొడుకుకే అమ్మి  పదివేల రూపాయల  లాభం సంపాదించాడు. కొడుకుకు చెప్పకుండా ఆ నగను తాను అమ్మడం తన  బుద్దితక్కువపని  అని నొచ్చుకొని  తాను చేసిన పనికి సిగ్గుపడ్డాడు .పదివేల రూపాయలు  తన కొడుకు నష్టపోయినందుకు  ఎంతో చింతించాడు. తాను లాభపడినందుకు నవ్వాలో  లేక తన కొడుకు నష్టపోయినందుకు ఏడవాలో కనకయ్యకు అర్థం కాలేదు.


కామెంట్‌లు